కూరగాయల రైతులు గగ్గోలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:28 AM
హోల్‌సేల్‌గా కూరగాయల ధరలు దిగజారడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కోసారి కోత, రవాణా చార్జీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. కూరగాయల పంటలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని లంక భూములు ప్రసిద్ధి. శ్రేష్ఠమైన లంక మట్టిలో ఏ రకమైన కూరగాయలు సాగు చేసినప్పటికీ మంచి దిగుబడులు వస్తాయి.

ఆలమూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): హోల్‌సేల్‌గా కూరగాయల ధరలు దిగజారడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కోసారి కోత, రవాణా చార్జీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. కూరగాయల పంటలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని లంక భూములు ప్రసిద్ధి. శ్రేష్ఠమైన లంక మట్టిలో ఏ రకమైన కూరగాయలు సాగు చేసినప్పటికీ మంచి దిగుబడులు వస్తాయి. దీంతో లంక భూములలో కూరగాయల సాగు అధికంగానే జరుగుతుంది. అయితే ఒక్కోసారి దిగుబడులు అంతంత మాత్రంగానే ఉంటాయి. అప్పుడు ధరలు మాత్రం అధికంగా ఉంటాయి. అయితే మరోసారి దిగుబడులు అధికంగా ఉండి ధరలు అమాంతం పడిపోతాయి. ప్రస్తుతం. డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి అంతర్‌రాష్ట్ర కూరగాయల మార్కెట్లో గత వారం రోజులుగా కూరగాయల ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొన్ని రకాల పంటలకు కనీసం కోత కూలీలు, రవాణా చార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా హోల్‌సేల్‌లో ధరలు ఒకసారిగా పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే రిటైల్‌లో మాత్రం కూరగాయల ధరలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. రిటైల్ మార్కెట్‌లో ధరలు మండుతూనే ఉన్నాయి. కూరగాయలు తగ్గాయని అంటున్నారే కాని వినియోగదారునికి మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.