పండుగ ఆనందం.. ఆవిరి
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:32 AM
ఆంధ్ర, తెలంగాణకు చెందిన వివిధ ప్రాంతాల బంధువులు కాకినాడలోని తూరంగిలో బంధువుల ఇంటికి సంక్రాంతి సంబరాలకు వచ్చారు. 3 రోజులు కాకినాడలో ఉండి సంతోషంగా గడిపారు. నాల్గో రోజు ముక్కనుమ నాడు ధారపల్లి జలపాతం చూసేందుకు బయల్దేరి ప్రమాదం బారినపడ్డారు. వారు ప్రయాణిస్తున్న టెంపో వ్యాన్ గురువారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి ఆర్‌అండ్‌బీ రహదారి వద్ద పంట కాలువలోకి బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు మృతిచెందగా 28 మంది గాయాల పాలయ్యారు. దీంతో అప్పటివరకూ ఆనందంగా గడిపినవారిలో తీవ్ర విషాదం నెలకొంది.

ఆంధ్ర, తెలంగాణకు చెందిన వివిధ ప్రాంతాల బంధువులు కాకినాడలోని తూరంగిలో బంధువుల ఇంటికి సంక్రాంతి సంబరాలకు వచ్చారు. 3 రోజులు కాకినాడలో ఉండి సంతోషంగా గడిపారు. నాల్గో రోజు ముక్కనుమ నాడు ధారపల్లి జలపాతం చూసేందుకు బయల్దేరి ప్రమాదం బారినపడ్డారు. వారు ప్రయాణిస్తున్న టెంపో వ్యాన్ గురువారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి ఆర్‌అండ్‌బీ రహదారి వద్ద పంట కాలువలోకి బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు మృతిచెందగా 28 మంది గాయాల పాలయ్యారు. దీంతో అప్పటివరకూ ఆనందంగా గడిపినవారిలో తీవ్ర విషాదం నెలకొంది.
ధారపల్లి జలపాతం సందర్శనకు
వెళ్తుండగా ఘోర ప్రమాదం
ఒమ్మంగి వద్ద పంటకాలువలోకి
బోల్తా పడిన టెంపో వ్యాన్
ఇద్దరు మహిళలు మృతి,
28 మందికి గాయాలు
ప్రత్తిపాడు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ తూరంగికి చెందిన కోమాకుల శ్రీనివాసరావు తోడల్లుళ్ల కుటుంబాలు విశాఖపట్నం, మిరియాలగూడ, హైదరాబాద్ నుంచి తూరంగికి వచ్చారు. సంక్రాంతిని పురస్కరించుకుని భోగి, పెద్ద పండుగ, కనుమ మూడు రోజులు సందడిగా గడిపారు. నాల్గోరోజు ముక్కనుమ అయిన గురువారం ప్రత్తిపాడు మండలంలోని పర్యాటక ప్రదేశం అయిన ధారపల్లి జలపాతం చూడటానికి సన్నద్ధమయ్యారు. వారంతా కాకినాడలోని వినాయక ట్రావెల్స్‌కు చెందిన టెంపో వాహనాన్ని బుక్ చేసుకుని ఎంఎస్‌ఎన్ చార్టీస్ వద్ద నుంచి వ్యాన్ డ్రైవర్‌తో సహా 30 మంది బయల్దేరారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన వారి టెంపో వాహనం ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి సమీపంలోని గోపాలుడు చెరువు దగ్గరలో చీకటి తోటకు వద్దకు చేరుకోగానే ఉత్తరకంచి ఆర్‌అండ్‌బీ రహదారిపై వాహ నం రోడ్డు పక్కన ఉన్నచెట్టు దుంగను వేగంగా వచ్చి ఢీకొంది. పంట కాలువలో టెంపో వ్యాన్ బోల్తా పడింది. దీంతో తూరంగికి చెందిన కోమాకుల శ్రీనివాసరావు భార్య చంద్రావతి (45), తిమ్మాపురానికి చెందిన బత్తుల సత్యనారాయణ కుమార్తె బత్తుల లక్ష్మిసురేఖ (19) సంఘటనా స్థలం వద్ద తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే మరో 28 మంది గాయపడగా వారిలో 15మందికి తీవ్ర గాయాలు, 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
కన్నీరు మున్నీరైన బంధువులు
టెంపో వ్యాన్ బోల్తా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళల బంధువుల రోదనతో ప్రత్తిపాడు ఆసుపత్రి నిండిపోయింది. ఈ సంఘటనలో మృతిచెందిన చంద్రావతికి భర్త కోమాకుల శ్రీనివాసరావు, ముగ్గురు సంతానం ఉన్నారు. మృతిచెందిన మరో యువతి బత్తుల లక్ష్మి సురేఖకు తండ్రి సత్యనారాయణ, తల్లి లక్ష్మి ఉండగా ఈ అమ్మాయి కాకినాడ పీఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదుతుంది. బంధువులతో సరదాగా ధారపల్లి జలపాతం చూసేందుకు వెళ్లిన వారు టెంపో వ్యాన్ బోల్తా ఘటనలో ప్రాణాలు కోల్పోవడాన్ని వారి కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కుటుంబీకులంతా ధారపల్లి జలపాతం వద్ద సేద తీరి సంతోషంగా గడుపుదామనుకుంటే విధి వంచించి ఇలా ప్రమాద బారిన పడాల్సివచ్చిందని ఆవేదన చెందుతున్నారు. వి ద్యార్థిని లక్ష్మిసురేఖ మృతితో తాపీ మేస్త్రీ పనులు చేసే ఆమె తండ్రి సత్యనారాయణ, తల్లి లక్ష్మి తమ బిడ్డ ఉన్నత విద్యావంతురాలు అవు తుందని ఆశపడ్డామని అర్ధాంతరంగా మృత్యువు కబళించిందని కన్నీరుమున్నీరయ్యారు. తీవ్ర గాయాలకు గురైన వారిలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తమ్మిశెట్టి సోమశేఖర్, ఆయన భార్య శివకుమారి, కుమార్తె హిమాంసీలు ఉన్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే సత్యప్రభ
టెంపో వ్యాన్ బోల్తా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అం దించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించి మృతుల బంధువులు, క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అండగా ఉండాలని కూ టమి శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సౌమ్యను ఆదేశించారు. జరిగిన రోడ్డుప్రమాదంపై సీఐ సూర్య అప్పారావు, ఎస్‌ఐ లక్ష్మీకాంతంతో చర్చించారు. ఒమ్మంగి చీకటి తోట మలుపు వద్ద ప్రమాదాలు నివారణకు స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధిత శాఖల అధికారులకు తెలియజేయాలని సీఐ, ఎస్‌లను ఆదేశించారు. ప్రత్తిపాడు తహశీల్దార్ ఎం.సూర్యప్రభ, ఆర్‌ఐ గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్ యాళ్ళ విశ్వేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యు డు వెలుగుల కొండలరావు, టీడీపీ నాయకులు అంబటి రాంబాబు, శెట్టిబత్తులవీరబాబు బాధితులను పరామర్శించారు.
తూరంగిలో విషాదఛాయలు
కాకినాడ రూరల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): టెంపో వ్యాన్ బోల్తా ప్రమాదంలో కాకినాడ రూ రల్ మండలం తూరంగికి చెందిన కోమాకుల చంద్రావతి(45) మృతిచెందింది. ఆమె భర్త శ్రీనివాస్‌కు, ముగ్గురు కూతుర్లు వరలక్ష్మి, అంజలి, శిరీషలకు తీవ్రమైన గాయాలు కావడంతో ప్రత్తిపాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనతో తూరంగిలో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారంతా సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా చేసుకుని విహారయాత్రకు బయలుదేరితే ప్రమాదం జరగడంతో తూరంగివాసులు ఆవేదన చెందుతున్నారు. చం ద్రావతి మృతదేహాన్ని శుక్రవారం తూరంగిలోని వారి నివాసానికి తీసుకువస్తారని సమాచారం.
అతి వేగమే కారణమా..!
ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా చెబుతున్నారు. వ్యాన్ డ్రైవర్ జి.రాంబాబు వేగంగా వాహనాన్ని నడపడాన్ని వారించినా వినలేదు. వేగం తగ్గించకుండా వెళ్లి ఒమ్మంగి గోపాలపురం చెరువు వద్ద వాహనాన్ని అదుపుచేయలేక రోడ్డు పక్కన ఉన్న చెట్టు దుంగను ఢీకొట్టాడు. దీంతో పంట పొలంలోకి వ్యాన్ బోల్తా పడిందని బస్సులో ప్రయాణించినవారు వాపోయారు.
ప్రాణాలు కాపాడిన యువకులు
పంట కాలువలో టెంపో వ్యాన్ బోల్తా పడిన సం ఘటనలో టెంపో వెనుక బైక్‌పై వస్తున్న పెద్దిపాలెం యువకులు పండు, రాజు, గోవిందు చూసి క్షణాల్లో వ్యాన్ బోల్తాపడిన వారిని బయటకు తీసి అంబులెన్స్‌కు, పోలీసులకు వెనువెంటనే సమాచారం అందిం చారు. దీంతో సీఐ సూర్య అప్పారావు, ఎస్‌ఐ లక్ష్మీకాంతం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.