Share News

టెన్త్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:26 AM

అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

టెన్త్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

అమలాపురం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 17నుంచి ఏప్రిల్‌ 1వరకు జరిగే పదో తరగతి పరీక్షలను సజావుగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లాలో 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 19,217 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. వీరిలో 19,010 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా 207 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. రెగ్యులర్‌ పదో తరగతి పరీక్షలతో పాటు 1195 మంది ఓపెన్‌ స్కూలు విద్యార్థులకు కూడా జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రశ్నాపత్రాలను అమలాపురం జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన స్ర్టాంగ్‌ రూమ్‌కు పరీక్షలకు వారం రోజుల ముందే చేరుకుంటాయన్నారు. అనంతరం రూట్‌ ఆఫీసర్లు, ఎంఈవోల పర్యవేక్షణలో జిల్లాలోని 22 మండలాల్లోని పోలీసుస్టేషన్లకు తరలించి అక్కడి నుంచి పరీక్ష రోజున సంబంధిత సీఎస్డీవోలు ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకువెళతారని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా కలెక్టర్‌కు వివరించారు. స్ర్టాంగ్‌రూమ్‌, పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ పోలీసులను ఆదేశించారు. పరీక్షల సమయంలో ఆయా కేంద్రాల పరిసరాల్లో జిరాక్సు షాపులు మూసివేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అత్యవసర మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.దుర్గారావుదొరకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సరైన సమయంలో పరీక్షాకేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులను నడిపించాలని ఆర్డీసీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ఏపీఈపీడీఈఎల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను నిర్దేశించిన స్పాట్‌ వాల్యుయేషన్‌ సెంటర్‌కు చేర్చేలా పోస్టల్‌ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ పదో తరగి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ సూచించారు. సమావేశంలో డీఆర్వో రాజకుమారి, అడిషనల్‌ ఎస్పీ ఏవీఆర్‌ పీబీ ప్రసాద్‌, అమలాపురం, రామచంద్రపురం ఆర్డీవోలు కొత్త మాధవి, బి.అఖిల, జిల్లా రవాణాధికారి ఎన్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 01:26 AM