దేవాలయాలకు పూర్తి సహకారాలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:28 AM
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న జిల్లాలోనే వివిధ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోని దేవాలయాలకు జిల్లా యంత్రాంగం నుంచి సహాయ సహకారాలు అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు.

అమలాపురం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న జిల్లాలోనే వివిధ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోని దేవాలయాలకు జిల్లా యంత్రాంగం నుంచి సహాయ సహకారాలు అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం మహాశివరాత్రి నిర్వహణ ఏర్పాట్లతో పాటు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి, వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి, మందపల్లి శనేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, కోటిపల్లి సోమేశ్వరస్వామి, అమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, పలివెల ఉమాకొప్పేశ్వరస్వామి ఆలయం, ర్యాలి జగన్మోహని దేవస్థానం, మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానాలకు చెందిన అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించే దేవస్థానాల అధికారులు వారికి అవసరమైన శాంతి భద్రతల పరిరక్షణ, అదనపు సిబ్బంది, వసతుల కల్పన వంటి సహకారానికి సంబంధించి ముందుగానే ప్రతిపాదనలు పంపితే జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు సమకూరుస్తుందన్నారు. స్నానఘట్టాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో బీఎల్‌ఎన్ రాజకుమారి, దేవదాయ ధర్మదాయశాఖ ఉప కమిషనర్ డీఎల్వీ రమేష్, వాడపల్లి, ద్రాక్షారామ దేవస్థానం అధికారులు ఎన్‌ఎస్ చక్రధరరావు, ఏవీ దుర్గాభవానీ, కార్యనిర్వాహక ఇంజనీర్ ముదునూరి సత్యనారాయణరాజు, వివిధ దేవస్థానాల ఈవోలు, సిబ్బంది సమీక్షలో పాల్గొన్నారు.