Share News

టమాట వింటుంది!

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:54 AM

ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుందనే సామెత.. కూరగాయల విషయం లోనూ వర్తించినట్టే కనబడుతోంది.

టమాట వింటుంది!

పడిపోయిన దొమ్మేరు వంకాయలు

బెండ..దొండకాయలే బెటర్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుందనే సామెత.. కూరగాయల విషయం లోనూ వర్తించినట్టే కనబడుతోంది. ఎందుకంటే ధరల విషయంలో ఏనాడూ నేలచూపులు చూడని కొన్ని కూరగాయల ఽధరలు అనూ హ్యంగా పతనమైతే.. ధర అంతంతమాత్రంగా ఉండే కొన్ని రకాల ధరలు భారీగా పెరుగుతూ పైపైకి వెళ్లడం రైతులను, మార్కెట్‌ వర్గాలను ఆఽశ్చర్యానికి గురిచేస్తోంది. కూరగాయాల్లో ప్రధానంగా రారాజుగా వెలిగే దొమ్మేరు వంకాయల ధర భారీగా పతనమైంది. రైతు బజార్లలో కిలో రూ.20లకు బహిరంగ మార్కెట్లో రూ.30-40లకు దొరుకుతుండడం విశేషం. దొమ్మేరు వంకాయలు కిలో రూ.50ల కంటే ధర తగ్గిన సందర్భాలు అరుదు. ఒక్కోసారి కిలో రూ.70-రూ.80 కూడా ధర ఉంటుంది. అలాంటిది చిత్రంగా దొమ్మేరు వంకాయల ధర పడిపోయింది. మరోపక్క చాలా తక్కువ ధరకే దొరికే బెండకాయలు, దొండకాయల ధరలు అమాంతం ఎగబాకాయి. రైతు బజార్లలోనే బెండకాయలు కిలో రూ.48, బీరకాయలు రూ.38, దొండకాయలు రూ.34 ధర ఉందంటే బహిరంగ మార్కెట్లో వీటి ధరలు ఎంత ఉంటాయో చెప్పనక్కరలేదు. టమోటా ధర పడిపోయింది. నెల రోజుల కిందట రూ.80-రూ.100లకు చేరిన టమోటా ధర అనూహ్యంగా దిగివచ్చింది. రైతు బజార్లలో కిలో రూ.13లకు, బహిరంగ చిల్లర మార్కెట్లలో రూ.15-రూ.20లకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరలకే దొరికే ములక్కాడ, పొట్లకాయ, ఆనబకాయ వంటి ధరలు పెరిగిపోయాయి. రైతుబజార్లలో పొట్లకాయ ఒక్కటి రూ.20లు, ములక్కాడ రూ.10లు ధర ఉంది. ఆనబకాయ రూ.15లకు విక్రయిస్తున్నారు. బహిరంగ చిల్లర మార్కెట్లలో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితికి ప్రధానకారణం వాతావరణ మార్పులే అని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.

కూరగాయలపై వాతావరణం

వాతావరణ పరిస్థితులు వంకాయల దిగుబడికి పూర్తి అనుకూలంగా ఉండడం వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగి మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయని చెబుతున్నారు. లోకల్‌గా సీతానగరం, కడియం మండలాలు, దొమ్మేరు ప్రాంతం నుంచి వంకాయలు ఎక్కువగా మార్కెట్లకు వస్తున్నాయి. టమోటా పరిస్థితి కూడా ఇంతే. అయితే బెండకాయలు, దొండకాయల విషయంలో ప్రతికూల వాతావరణం కారణంగా దిగుబడులు తగ్గడంతో ధరలు పెరగడానికి కారణంగా పేర్కొంటున్నారు. అలాగే రాత్రిపూట చలి, మంచు ప్రభావంతో బెండకాయలకు వైరస్‌ సోకి దిగుబడులు పడిపోయినట్టు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా తగ్గేదేలే అంటూ మార్కెట్లో కింగ్‌లా ఉండే దొమ్మేరు రకం వంకాయల ధరలు గణనీయంగా పడిపోవడం వీటిని సాగు చేసే రైతులో గుబులు పుట్టిస్తోంది.

Updated Date - Jan 25 , 2025 | 12:54 AM