Share News

పీఎం సూర్యఘర్‌ పథకంతో మేలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:21 AM

విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటినీ సూర్యఘర్‌ వెలుగులతో నింపుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం పీఎం సూర్యఘర్‌ పథకం అమలు తీరు పురోగతిపై నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

 పీఎం సూర్యఘర్‌ పథకంతో మేలు

అమలాపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటినీ సూర్యఘర్‌ వెలుగులతో నింపుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం పీఎం సూర్యఘర్‌ పథకం అమలు తీరు పురోగతిపై నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. సోలార్‌ ప్యానల్‌ కనెక్షన్ల కోసం తక్షణమే పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో బల్క్‌ వినియోగదారులను గుర్తించి పథకాన్ని పరిపూర్ణంగా వర్తింప చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో లబ్ధిదారులను కూడా గుర్తించి పథకం అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. వినియోగదారులు విద్యుత్‌ ఉత్పత్తిదారులుగా మారాలన్నారు. సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుని ఉచితంగా విద్యుత్‌ను గృహ అవసరాలకు వినియోగించుకుంటే విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. లబ్ధిదారులు రూ.2 లక్షల విలువైన 3 కిలోవాట్ల సోలార్‌ ప్యానళ్లను ఇంటి కప్పుపై ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా రూ.78 వేలు సబ్సిడీ అందిస్తుందన్నారు. మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చునన్నారు. లబ్ధిదారులు 10 శాతం వాటా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నాడు. తద్వారా 20 ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్‌ను పొందవచ్చునని వివరించారు. ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సౌర విద్యుత్‌ను వినియోగించుకోవడం ద్వారా కాలుష్య రహిత, పర్యావరణ హిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ట్రాన్స్‌కో ఈఈ ఎం.రవికుమార్‌ మాట్లాడుతూ జీఎస్టీ, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వర్తకులతో త్వరలో సమావేశం నిర్వహించి పథకం అమలు తీరుపై కలెక్టర్‌ అధ్యక్షతన సమీక్షిస్తామన్నారు. సమావేశంలో నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్‌ స్వామినాయుడు, డీఆర్డీఏ పీడీ డాక్టర్‌ వి.శంకరవరప్రసాద్‌, ఎల్డీఎం కేశవవర్మ, చీఫ్‌ సేల్స్‌ మేనేజర్‌ నందెపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:21 AM