Share News

అత్యుత్సాహం... అతి ప్రమాదం!

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:18 AM

సర్పవరం జంక్షన్‌, జనవరి 17 ( ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట ఎన్టీఆర్‌ బీచ్‌ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ సాగరతీరంలో గడిపేందుకు చిన్నారులు, యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో తరలివస్తూంటారు. శని, ఆదివారం, సెలవుల సమయాల్లో వేలా

అత్యుత్సాహం... అతి ప్రమాదం!
ఎన్టీఆర్‌ బీచ్‌లో సందర్శకుల కోలాహలం (ఫైల్‌ఫొటో)

సెలవు రోజుల్లో కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌కు తరలివస్తున్న సందర్శకులు

పోలీసులు లేని ప్రాంతాలకు వెళ్లి సముద్ర స్నానాలు

కెరటాల ధాటికి గల్లంతవుతున్న యువకులు

సర్పవరం జంక్షన్‌, జనవరి 17 ( ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట ఎన్టీఆర్‌ బీచ్‌ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ సాగరతీరంలో గడిపేందుకు చిన్నారులు, యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో తరలివస్తూంటారు. శని, ఆదివారం, సెలవుల సమయాల్లో వేలాది మంది సందర్శకులు తరుచూ విచ్చేసి సముద్రం పై నుంచి వీచే చల్లనిగాలులకు సేదతీరుతూంటారు. కాకినాడ కుంభాభిషేకం నుంచి ఉప్పాడ వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. ఇందులో సూర్యారావుపేట లైట్‌హౌస్‌ నుంచి నేమాం గెస్ట్‌హౌస్‌ వర కు సాగరతీరం ఉండడంతో నిత్యం అనేక మం ది వచ్చి సముద్రంలో స్నానాలు చేస్తుంటారు. వినోద, విహార యాత్రల పేరుతో యువకులు, చిన్నారులు, పెద్దలు బీచ్‌కు వస్తూంటారు. ఆహ్లా దం కోసం వచ్చే యువకులు సముద్ర కెరటాల తాకిడి, ఉధృతిని అంచనా వేయలేక కెరటాల్లో చిక్కుకుని గల్లంతై మృత్యువాత పడుతున్నారు. దాంతో విహార, వినోద యాత్ర కాస్తా కుటుంబ సభ్యులకు తీరని పుత్రశోకం మిగులుస్తోంది.

కొత్త సంవత్సరంలో ముగ్గురి మరణం

కొత్త సంవత్సరం ఒకటో తేదీన సాగరతీరంలో గడిపేందుకు వెళ్లి సముద్రంలో స్నానంచేస్తూ అలల ఉధృతికి గల్లంతై ముగ్గురు యువకులు మృతి చెందారు. కొత్తపల్లి మండలం కోనపాపపేట శివారు మల్లివారితోటకు చెందిన గుత్తుర్తి సతీష్‌ కుమార్‌ (17), కాకినాడ రామకృష్ణారావుపేట ఎర్రరోడ్డుకు చెందిన వడిసెల గౌరీ లక్ష్మీ నాగసాయి (16), బొర్ర శ్రీనుబాబు (17) నూతన సంవత్సరం సందర్భంగా సూర్యారావుపేట ఎన్టీఆర్‌ బీచ్‌కెళ్లి సముద్రంలో స్నానంచేస్తూ అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెం దారు. గడచిన అయిదేళ్లలో తిమ్మాపురం, సర్పవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో సుమారు 22 మంది మృతిచెందారు. సముద్ర తీరంలో వాకలపూడి మెరైన్‌ పోలీసులు సుమారు 10 మంది, తిమ్మాపురం పోలీసుల ఆధ్వర్యంలో గస్తీ నిర్వహిస్తూంటారు. సముద్రంలో స్నానాలు చేయకుండా వాకీటాకీలు, మైక్‌ ద్వారా హెచ్చరికలు చేస్తూ అప్రమ త్తం చేస్తూంటారు. లైట్‌హౌస్‌ నుంచి నేమాం వరకు ఉన్న సముద్రతీరంలో పోలీసులు లేని ప్రాంతాలకు వెళ్లి యువకులు సముద్రస్నానాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారాల్లో రద్దీగా ఉండే సమయంలో మరింత మం ది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నా యువకుల మరణాలు తగ్గకపోవడం కలవరపాటుకి గురి చేస్తోంది.

అవగాహన కల్పిస్తున్నాం

సముద్రం లోపలి కెళ్లి స్నానాలు చేయవద్దని, ప్రమాదం పొంచి ఉందని యువకులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎస్‌ఐ ఆధ్వర్యంలో సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నాం. శని, ఆదివారం, సెలవుల రోజుల్లో ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను తీరంలో అందుబాటులో ఉంచుతున్నాం. యువకులు సముద్రంలో స్నానాలు చేయాలన్న కోరికతో పోలీసులు లేని ప్రాంతాలకు వెళ్లి, సముద్ర స్నానాలకు దిగి చేజేతులా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకర బీచ్‌లో ప్రత్యేక హెచ్చరికల బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

రామ్మోహన్‌రెడ్డి, సర్కిల్‌ ఆఫీసర్‌, మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌

Updated Date - Jan 18 , 2025 | 12:18 AM