శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:27 AM
కోటిపల్లి పుణ్యక్షేత్రంలో ఈనెల 25 నుంచి 27 వరకూ నిర్వహించే శివరాత్రి ఉత్సవాలను, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్, రామచంద్రపురం ఆర్డీవో డి.అఖిల అన్నారు.

కె.గంగవరం, ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి): కోటిపల్లి పుణ్యక్షేత్రంలో ఈనెల 25 నుంచి 27 వరకూ నిర్వహించే శివరాత్రి ఉత్సవాలను, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్, రామచంద్రపురం ఆర్డీవో డి.అఖిల అన్నారు. శనివారం శ్రీ ఛాయాసోమేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఆమె వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో లైటింగ్, మార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి గుడికి వచ్చేదారిలో భక్తులకు తాగునీటి సదుపాయం కల్పించాలని, స్నానాల రేవులో బారికేడింగ్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే మహిళా భక్తుల కోసం తాత్కాలిక షెడ్ పనులు వెంటనే ప్రారంభించాలని ఆర్‌డబ్ల్యూఎఎస్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఉత్సవాల మూడు రోజులు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ ఏఈని ఆదేశించారు. బారికేడింగ్ వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ, దేవస్థానం అధికారులను ఆదేశించారు. నాలుగు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులతో చెప్పారు. రామచంద్రపురం డీఎస్పీ బి. రఘువీర్ మాట్లాడుతూ ఫెర్రీ రేవులో ప్రయాణించే పంటులతో పాటు గజ ఈతగాళ్లతో రెండు నావలు ఏర్పాటు చేయాలని ఫిషరిష్ డిపార్ట్‌మెంట్‌ను కోరారు. అదే విధంగా రేవులో రెండు వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.x