ఇంకా సిట్ అవదా
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:51 AM
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని వైసీపీ అక్రమార్కులు చెరబట్టేసి గడచిన అయిదేళ్లలో భారీగా విదేశాలకు తరలించేశారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని వైసీపీ అక్రమార్కులు చెరబట్టేసి గడచిన అయిదేళ్లలో భారీగా విదేశాలకు తరలించేశారు. ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా రహస్య నెట్‌వర్క్ ను ఏర్పాటుచేసి రేషన్ బియ్యం పేదలకు ఇలా అందగానే.. అలా కిలోకు రూ.10 చెల్లించి లక్షల టన్నులు కాకినాడకు తరలించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు బియ్యాన్ని కనివినీ ఎరుగని రీతిలో బొక్కేశారు. పౌరసరఫరాలశాఖ పరిధిలోని రేషన్ బియ్యం వ్యవస్థను కుళ్లబొడిచేశారు. ప్రభుత్వం వందలకోట్లు సబ్సిడీ చెల్లించి పేదలకు ఇచ్చే బియ్యాన్ని సదరు నేత, ఆయన మనుషులు కారుచౌకగా కొట్టేసి దాన్ని సార్టెక్స్ యంత్రాల్లో పాలిష్‌చేసి ఆకర్షణీయ ప్యాకింగ్‌ల్లో ఉంచి నౌకల ద్వారా ఆఫ్రికా దేశాలకు అమ్మేసుకుని వేలకోట్లు గడించారు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ అధి కారంలోకి వచ్చిన తర్వాత 2019-2020లో కాకి నాడ యాంకరేజ్ పోర్టు నుంచి 19 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో 27 లక్షల మెట్రిక్ టన్ను లు, 2021-22లో 29లక్షల మెట్రిక్ టన్నులు, 2022-23లో 38లక్షల మెట్రిక్ టన్నులు, 2023- 24లో 24లక్షల మెట్రిక్ టన్నులు తరలిపోయింది. ఇందులో రేషన్ బియ్యం సగానికిపైనే. అయితే గతేడాది నవంబరు ఆఖరులో కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికాదేశానికి స్టెల్లానౌకలో రహస్యంగా ఎగుమతికి సిద్ధంచేసిన రేషన్ బియ్యం పట్టుబ డడంతో స్మగ్లింగ్ వ్యవహారం అధికారికంగా బయటకు వచ్చింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాకినాడకు వచ్చి స్వయంగా షిప్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత రేషన్ ఆనవాళ్ల కోసం వెదికితే కాకినాడ, చుట్టుపక్క ప్రాంతాల్లో అనేక గోదాముల్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం పట్టుబడింది. ఈనేపథ్యంలో వేళ్లూనుకుపోయిన రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై రాష్ట్రప్రభుత్వం గతేడాది డిసెంబరులో ఉక్కుపా దం మోపింది. మాఫియాను అంతమొందించి అక్రమార్కులను శిక్షించే విధంగా ప్రత్యేకంగా సిట్‌ను నియమించింది. రేషన్ బియ్యం కాకినా డకు నలుమూలల నుంచి ఎలా చేరుకుంటోంది? ఎవరు తరలిస్తున్నారు? ఎక్కడి నుంచి తరలిస్తు న్నారు? అక్కడి నుంచి ఏయే గోదాముల నుంచి మిల్లులకు వెళ్లి పాలిష్ చేసుకుని ఏయే కంపె నీల ద్వారా నౌకల్లో విదేశాలకు తరలిపోనున్నా యనేదానిపై ఈ సిట్ బృందం దర్యాప్తు చేపడు తుందని పేర్కొంది. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా నిందితులను తక్షణం అరెస్ట్ చేసే అధి కారం సైతం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కాకినాడ, చుట్టుపక్కల మొత్తం అయిదు పోలీసుస్టేషన్ల పరిధిలో గతేడాది జూన్, జూలై నెలల్లో 13 రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిపై కూలంకుషంగా దర్యాప్తుచేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొం ది. అయితే సిట్ బృందాన్ని నియమించిన నేప థ్యంలో అయిదు పోలీసుస్టేషన్ల పరిధిలోని 13 కేసులపై జిల్లా పోలీసులు సైతం లోతుగా విచా రణ చేశారు. సిట్ దర్యాప్తునకు వస్తే తక్షణ నివే దిక ఇచ్చేలా వివరాలు సిద్ధం చేశారు. ప్రధా నంగా కాకినాడ రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో జులై 11న రూ.26కోట్లు. జూన్ 28న కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప స్టేషన్ పరిధిలో రూ.13.96 కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టుబ డింది. ఇది లవన్ కంపెనీదిగా గుర్తించారు. కొటారి అమిత్‌కుమార్ అనే వ్యాపారిని నిందితు డిగా తేల్చారు. అయితే ఇదే లవన్ కంపెనీ పశ్చిమ ఆఫ్రికాకు బియ్యం ఎగుమతి చేస్తుండగా బార్జిలో 1,060 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం తో పట్టుబడింది. అదేరోజు కరప స్టేషన్ పరిధి లో రూ.15.31 కోట్ల బియ్యం పట్టుబడింది. ఇది ద్వారంపూడి ప్రధాన అనుచరుడైన వినోద్ అగ ర్వాల్‌కు చెందిన సరళ ఫుడ్స్ కంపెనీ. ఇలా సిట్ దర్యాప్తు చేయనున్న ఈ 13 కేసులకు సంబంధిం చి మొత్తం రూ.84.87 కోట్ల విలువైన 22,947 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుబడినట్లు పోలీసు లు గుర్తించారు. ఇందులో ద్వారంపూడి అనుచ రులే అధికంగా ఉండడం గమనార్హం. అయితే క్షేత్రస్థాయిలో పక్కా ఆధారాలు భారీగా ఉండ డంతో ఆయా కంపెనీలకు పోలీసులు నోటీసులు కూడా పంపించారు. అయితే సిట్ దర్యాప్తు ప్రారంభిస్తే ఈ కేసుల ఆధారంగా నిందితులను తక్షణం అరెస్ట్ చేయడంతోపాటు వాటి వెనుక ఉన్న పెద్దతలలు సైతం సులువుగా దొరికే అవ కాశం ఉంది. కానీ సిట్ రంగంలోకి దిగలేదు.
అక్రమార్కుల్లో ఎంచక్కా దర్జా..
రేషన్ స్మగ్లింగ్‌పై ఏకంగా సిట్ విచారణకు ఆదేశించడంతో బియ్యం అక్రమార్కులు వణికి పోయారు. పైగా సిట్‌కు అరెస్ట్‌ల అధికారం కట్టబెట్టడంతో తమ పాపం పండినట్లేనని భయపడ్డారు. ఇంతవరకు దాని ఊసే లేక పోవడంతో తమకేం కాదులే అనే ధోరణిలో ప్రస్తుతం మళ్లీ రేషన్ బియ్యం కొనుగోళ్లు మొ దలుపెట్టారు. వాస్తవానికి సిట్‌ను నియమిం చిన తర్వాత అందులో ఉన్న కొందరు సభ్యు లు గత వైసీపీ ప్రభుత్వానికి అడ్డంగా కొమ్ము కాసిన వారేనన్న విమర్శలు వచ్చాయి. దీంతో వీరిని మార్చి ప్రభుత్వం డిసెంబరు 27న మరో కొత్త సిట్‌ను నియమించింది. అందులో కొందరు పోలీసులను తప్పించి కాకినాడ జిల్లాలో బీసీ కార్పొరేషన్ అధికారి శ్రీనివాస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పౌరసరఫరాల సంస్థ డీఎం బాలసరస్వతిని నియమించారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. అటు కొత్త సిట్‌లో సభ్యులుగా ఉన్న ఇద్దరు ఉమ్మడి జిల్లా అధికారుల్లోను అయోమయం కొనసాగుతోంది. తమను దర్యాప్తు బృందంలో సభ్యులుగా చేర్చినా విచారణకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారు అయోమయంలో కొనసాగుతున్నారు.