Share News

శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌లో పూడిక చేపట్టాలి

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:09 AM

శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌కు పూర్తిస్థాయిలో డ్రెడ్జింగ్‌ పనులు చేపడితే మురుగునీరు నేరుగా కేశవదాసుపాలెం వద్ద సముద్రంలో కలిసే అవకాశం ఉందని స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ దృష్టికి తీసుకువచ్చారు.

 శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌లో పూడిక చేపట్టాలి

అమలాపురం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌కు పూర్తిస్థాయిలో డ్రెడ్జింగ్‌ పనులు చేపడితే మురుగునీరు నేరుగా కేశవదాసుపాలెం వద్ద సముద్రంలో కలిసే అవకాశం ఉందని స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పరంగా పూడికతీత పనులు చేపట్టాలని స్థానిక రైతులు కలెక్టర్‌ను ముక్తకంఠంతో కోరారు. శంకరగుప్తం ప్రధాన మురుగుకాల్వ కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లను గురువారం అధికారులతో కలిసి కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్వాపరాలు, స్థితిగతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.శంకరగుప్తం మురుగుకాల్వ కరవాక నుంచి కేశవదాసుపాలెం వరకు ఉందని, ఈ మేజర్‌ డ్రెయిన్‌కు సంబంధించి 2017-18లో సగభాగం మాత్రమే తూర్పుపాలెం వరకు పూడికతీత డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టారని వివరించారు. మిగతా సగం పనులు చేపట్టకపోవడం వల్ల గట్లు మీదుగా మురుగునీరు పారుతుందని వివరించారు. కొబ్బరిచెట్లకు మురుగునీరు చేరడంతో పాటు సముద్రపు ఆటుపోట్లు మూలంగా ఉప్పునీరు తోటల్లోకి, పొలాల్లోకి చేరడం మూలంగా కొబ్బరిచెట్లు చనిపోతున్నాయని వివరించారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, ఆర్డీవో కె.మాధవి, జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ, డ్రైనేజీ విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఎన్వీ కిశోర్‌, దిలీప్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 01:09 AM