Share News

ఇసుక రోడ్లు!

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:10 AM

భోజనం తర్వాత భుక్తాయాసం పడితే గొంతు వరకూ తినకపోతేనేమి అని అంటుంటారు. ఇప్పుడు ఇసుక లారీల పరిస్థితి కూడా అంతకుమించి కనబడుతోంది. నిబంధనలు పట్టించుకోం.. అడిగేవాడూ లేడు అనే పరి స్థితి జనం ప్రాణాల మీదకు తెస్తోంది.

ఇసుక రోడ్లు!
ఇది తారు రోడ్డే : ధవళేశ్వరం క్వాయర్‌ బోర్డు వద్ద ఇలా..

ఈనెల 9న చినకొండేపూడికి చెందిన దంతే ప్రసాద్‌ (26) రాజమహేంద్రవరం రూరల్‌లోని ఓ వివాహానికి హాజరై తిరిగి వెళుతున్న సమయంలో సీతానగరం మండలం బొబ్బిల్లంక వద్ద రోడ్డుపై ఇసుక వల్ల బండి జారిపోయింది. కిందపడిన ప్రసాద్‌ తలపై నుంచి అటుగా వెళ్తున్న లారీ ఎక్కేసింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు ఇసుకలో కలిసిపోయాయి. తర్వాత బొమ్మూరులోని రోడ్డుపై ఇసుక వల్ల ఓ సచివాలయ ఉద్యోగి బండి స్కిడ్‌ కావడంతో దెబ్బలు తగిలాయి.

ప్రాణాలు పోతున్నా పట్టదు

పరిమితికి మించి అధికంగా ఇసుక లోడ్లు

వేబ్రిడ్జిలు లేవు.. అడిగేవారూ లేరు

కేసులు రాస్తే.. నేత కన్నెర్ర

అధికారుల కాసుల కక్కుర్తికి జనం బలి

ఏ రోడ్డులో వెళ్లినా ఇసుకే. రోడ్డు పక్కనా ఇసుకే. జనం జారి పడుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. యంత్రాగం, ప్రజాప్రతినిథుల కళ్లకు మసకే. ఇసుక విచ్చలవిడి తరలింపు మానవత్వాన్ని కూడా ఇసుకలో కలిపే స్తోంది. కూటమి వచ్చిన తర్వాత అద్దంలా మెరుస్తున్న రోడ్లపై ఇసుక చిమ్ముతున్నా.. పట్టించుకునే వారు లేరు.. అడిగేవారు కానరారు. ఒకవేళ అధికారులు కేసు రాస్తే మాత్రం రాజకీయ బాసులకు కళ్లల్లో ఇసుక పడినంత మంట పుడుతోంది. జనం బాధ మాత్రం పట్టడం లేదనే విమర్శలు పెద్దఎత్తున వినవస్తున్నాయి.

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

భోజనం తర్వాత భుక్తాయాసం పడితే గొంతు వరకూ తినకపోతేనేమి అని అంటుంటారు. ఇప్పుడు ఇసుక లారీల పరిస్థితి కూడా అంతకుమించి కనబడుతోంది. నిబంధనలు పట్టించుకోం.. అడిగేవాడూ లేడు అనే పరి స్థితి జనం ప్రాణాల మీదకు తెస్తోంది. గత ప్రభుత్వంలో ఇసుక కోసం జనం నానాతంటాలూ పడాల్సి వచ్చింది. ఇష్టానుసారం ధరలతో బెంబేలెత్తించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక లభ్యతను సీఎం చంద్రబాబు ఆదేశాలతో సులభతరం చేశారు. దీంతో సామాన్యుడికి ఇసుక అందుబాటులోకి వచ్చింది. అయితే ఇసుకాసురుల పాలిట మాత్రం వరంగా పరిణమించింది. అడ్డూఅదుపూ లేకుండా వేల టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. ఈ క్రమంలో లారీలో ఇంకొక్క గుప్పెడు కూడా పట్టనంతగా ఇసుకను నింపుతున్నారు. ఆ లారీలు ఎక్కువ ట్రిప్పులు వేయాలనే ఆతృతలో వేగంగా వెళుతున్నాయి. లారీల్లోని ఇసుక సన్నగా జారుతూ రోడ్డుపై పడుతోంది. ద్విచక్ర వాహనదారులు ఏ మాత్రం ఇసుమంత అదుపుతప్పినా పెద్ద ప్రమాదానికి కారణమ వుతోంది. అయినా సరే సంబంధిత శాఖలేమీ పట్టించుకోవడం లేదు.

జరిమానాలకు గంతలు

వాస్తవానికి 6 టైర్ల లారీలో 10 టన్నులకు మించి వేయకూడదు. కానీ 14 టన్నుల వరకూ నింపుతు న్నారు. 10 టైర్ల లారీలో 18కి 22 టన్నులు, 14టైర్ల లారీకి 24కి 30 టన్నుల వరకూ, 16టైర్ల లారీలకు 25 టన్నులకు అదనంగా మరో పది టన్నుల ఇసుక లోడు వేస్తున్నారు. ఒకరకంగా డ్రైవరు క్యాబిన్‌లో తప్ప లారీ నిండా ఇసుకే ఉంటోంది. చట్ట ప్రకారం ఆయా లారీల్లో పరిమితికి మించి లోడు వేయకూడదు. అధికంగా ఉన్న లోడుకు టన్నుకు రూ.2 వేల చొప్పున, అదనంగా రూ.20వేలు.. అంటే 5 టన్నులు అధికంగా ఉంటే రూ.30 వేలు జరిమానా విధించవచ్చు. ఈ లెక్కన జరిమానాలు విధించకపోవడంతో లక్షల రూపాయల ఆదాయం ప్రభు త్వ ఖజానాకు గండి పడుతోంది. గోదావరి ఇసుక నాణ్యత ఎక్కువగా ఉండడంతో ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌ కూడా వెళుతోంది. దూర ప్రాంతాలకు మార్కెట్‌ లారీల్లో ఇసుక వెళుతోంది. వాటికీ 10 టన్నుల వరకూ అదనంగా లోడు వేస్తున్నారు.

రాజకీయ కన్నెర్ర

జిల్లాలోని కడియం, ధవళేశ్వరం (గాయ త్రి), కోటిలింగాలు, కాతేరు, వెంకటనగ రం, ముగ్గళ్ల, కాటవరం, కొవ్వూరు, తాళ్ల పూడి, ఔరంగాబాద్‌, వాడపల్లి, అరికిరేవుల తదితర చోట్ల ఇసుక రేవులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని రోడ్లను చూస్తే మరీ దారుణంగా ఇసుకతో నిండిపోయి ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాల్లో రోడ్డు పక్కన ఇసుక గుట్టలు కూడా పెడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్లు కోరలు చాస్తున్నా యి. పట్టణాలు, నగరంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇసుక రాపిడి వల్ల కొత్తగా వేస్తున్న రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం రోడ్లను అద్దాల్లా తయారుచేస్తుంటే.. ఇసుక లారీలు వాటి ని చిందరవందర చేస్తున్నాయి. అయితే ఒకవేళ అధికారు లు చర్యలకు ఉపక్రమిస్తే ఇసుక వ్యాపారంలో ఉన్న, ఆ వ్యాపారులకు దన్నుగా ఉన్న రాజకీయ నాయకులు కన్నె ర్ర చేస్తూ.. ఇసుక సులభతరం చేసినా స్థానిక అధికారుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయంటూ సీఎం చంద్రబాబు దృష్టికి తప్పుగా సమాచారం తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరిగినట్టు వినవస్తోంది. దీంతో జనాలు ఇబ్బంది పడుతున్నా.. ప్రాణాలు పోతున్నా అధికారులు మాత్రం కళ్లు మూసుకోక తప్పడం లేదు.

చాలీచాలని వస్త్రం

నిబంధనల ప్రకారం ఇసుక ర్యాంపుల్లో వేయింగ్‌ బ్రిడ్జి లను లైసెన్సుదారులు ఏర్పాటుచేసుకోవాలి. లారీలో ఇసుక లోడు చేసిన తర్వాత లారీని వేయింగ్‌ బ్రిడ్జిపైకి తీసుకె ళ్లాలి. ఒకవేళ లోడు అధికంగా ఉంటే తొలగిస్తారు. అప్పు డు ర్యాంపులోంచి లారీ బయటకు రావాలి. కానీ ర్యాంపు ల్లోంచి వందల లారీలు అధిక లోడుతో వెళుతున్నా వేయింగ్‌ బ్రిడ్జిలను మాత్రం ఏర్పాటు చేయడం లేదు. ఒకవేళ అరకొరా ఉన్నా ఒకటీఅరా లారీలను దానిపైకి ఎక్కిస్తున్నారంతే. ఒకవేళ వేయింగ్‌ బ్రిడ్జిలు ర్యాంపుల్లో ఉంటే మితిమీరిన లోడుతో లారీలు రోడ్లపైకి ఎలా వస్తు న్నాయని జనం ప్రశ్నిస్తున్నారు. తీరా రోడ్డుపైకి వచ్చిన తర్వాత కూడా మోళీనే. ఇసుక లారీని అధికారులు ఆపినా వే-బిల్లు మాత్రమే చూసి రైట్‌ రైట్‌ అనేస్తున్నారు. ఇసుక రోడ్డుపై పడుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నా జరిమానాలు రాయలేని పరిస్థితి ఉండ డంతో కనీసం లోడుపై పరదా కట్టాలని జిల్లా ఉన్నతాధికా రులు ఆదేశించారు. అది కూడా సరిగా అమలు కావడం లేదు. చాలా లారీలు ఆ ఆదేశా లను పట్టించుకోక పోగా.. కొన్నింటికే పరదా కప్పుతున్నా భారీకాయానికి కర్చీఫ్‌ చుట్టినట్టు ఉంటోంది. కనీసం ఇసుక లారీల వేగానికి అడ్డుకట్ట వేయలేక పోతుండడం శోచనీయం.

Updated Date - Feb 15 , 2025 | 01:10 AM