రోడ్డూ ఆక్రమించెయ్!
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:32 AM
మండలంలోని ప్రక్కిలంక, పైడిమెట్ట గ్రామాల్లో పాత ఇనుప సామాన్ల షాపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ రెండు గ్రామాల నుంచి గజ్జరం గ్రామం వైపు వెళ్లే దారి వెంబడి ఉన్న ఈ షాపుల కారణంగా ఆ రహదారిలో ప్రయాణం చేసేవారు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. రోడ్డు మార్జిన్‌ను సైతం ఆక్రమించి పాత ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు వేస్తున్నారు.

ప్రక్కిలంక, పైడిమెట్ట గ్రామాల్లో పెరుగుతున్న పాత ఇనుప సామాన్ల దుకాణాలు
విద్యుత్‌వైర్లు, రబ్బరు కాల్చివేత
వాటి నుంచి వెలువడుతున్న పొగ
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు
తాళ్లపూడి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రక్కిలంక, పైడిమెట్ట గ్రామాల్లో పాత ఇనుప సామాన్ల షాపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ రెండు గ్రామాల నుంచి గజ్జరం గ్రామం వైపు వెళ్లే దారి వెంబడి ఉన్న ఈ షాపుల కారణంగా ఆ రహదారిలో ప్రయాణం చేసేవారు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. రోడ్డు మార్జిన్‌ను సైతం ఆక్రమించి పాత ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు వేస్తున్నారు. అలాగే పాడైపోయిన రబ్బరును, రాగివైరు కోసం కరెంటు వైరులును రోడ్డు పక్కనే కాల్చుతున్నారు. దీని వల్ల వచ్చే పొగతో ఆ దారిలో ప్రయాణాలు చేసే వారు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ కార్యకలాపాలపై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమౌతున్నారని పలువురు నాయకులు అంటున్నారు. పాత సామాన్లే కాక అపహరించిన వాహనాలను సైతం ఇక్కడ స్పేర్ పార్టులుగా మారుస్తున్నారనే ఆరోపలను వినిపిస్తున్నాయి. గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు, ఎంపీటీసీ చిన్నబ్బాయి మాట్లాడుతూ పాత సామాన్ల షాపుల నిర్వహణను నియంత్రించే వారు కానీ, చర్యలు తీసుకునే వారు కానీ లేరన్నారు. గతంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఈ సమస్యను ప్రస్తావించినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ప్రక్కిలంక, పైడిమెట్ట గ్రామా నుంచి గజ్జరం వెళ్లే రహదారిలో ఒకనాడు ఇటుక బట్టీల నుంచి వచ్చే కాలుష్యంతో ఇబ్బంది పడేవారు ఇప్పుడు ప్లాస్టిక్ వైర్లు, పాతరబ్బర్లు కాలుస్తుండడంతో వచ్చే మరో రకమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు, వాహనదారులు వాపోతున్నారు.