బజార్ల బెంగ తీరినట్టే
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:29 AM
జిల్లాలో కొత్త రైతుబజార్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి దశలో మున్సిపాల్టీల పరిధిలో ప్రజల అవసరాలు తీర్చేలా వీటిని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో అయిదేళ్ల తర్వాత తిరిగి వీటి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.

తొలుత మున్సిపాల్టీల్లో నిర్మించాలని మార్కెటింగ్ శాఖకు ఆదేశాలు
సామర్లకోట, తుని, పిఠాపురం, కాకినాడలలో తీరనున్న బజార్ల సమస్య
నిధుల్లేక మధ్యలో నిలిచిపోయినవాటినీ ప్రారంభించేలా కసరత్తు
కోడ్ ముగిశాక తూరంగి రైతుబజారును ప్రారంభించనున్న అధికారులు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాలో కొత్త రైతుబజార్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి దశలో మున్సిపాల్టీల పరిధిలో ప్రజల అవసరాలు తీర్చేలా వీటిని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో అయిదేళ్ల తర్వాత తిరిగి వీటి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అయిదేళ్లలో ఒక్క రైతుబజారు కూడా రాలేదు. ఏడు రైతుబజార్ల నిర్మాణానికి రూ.7 కోట్లతో అప్పట్లో టెండర్లు 13సార్లు పిలిస్తే ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాక ప్రభుత్వం అభాసుపాలైంది. కూటమి ప్రభుత్వం త్వరలో సామర్లకోట, తుని, పిఠాపురంలలో వీటి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. నిధులు లేక మధ్యలో ఆగిపోయిన కాకినాడ రాజీవ్‌స్వగృహ ఏరియా, తూరంగిలోని కొత్త రైతుబజార్‌ను పూర్తిచేయాలని భావిస్తోంది. జిల్లావ్యాప్తంగా అనేక పట్టణాల్లో లక్షల్లో జనం నివ సిస్తున్నారు. వీరంతా నిత్యం కూరగాయల కోసం బయట వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. కానీ బయట ధర ఎక్కువ. అయినా తాజావి దొరకని పరి స్థితి. ఈనేపథ్యంలో ప్రజల అవసరాల కోసం కొత్తగా జిల్లాలో ఏడు రైతుబజార్లు నిర్మించాలని జిల్లా మార్కె టింగ్‌శాఖ అధికారులు 2021లో ప్రతిపాదించారు. వీటికి మూడు నుంచి అయిదెకరాల భూములు కావా లని అంచనాలు వేశారు. అయితే వీటి నిర్మాణానికి అంచనాలు తయారుచేసిన ఇంజనీర్లు మొత్తం రూ.7.50 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. వీటిలో జగ్గంపేట రైతుబజార్‌కు రూ.67.84లక్షలు, కిర్లంపూడి 58.17లక్షలు, ఏలేశ్వరం రూ.66.36లక్షలు, కాకినాడ ఏటిమొగ రూ.33.38 లక్షలు, రమణయ్యపేట రైతుబ జార్ 1, 2లకు చెరో రూ.కోటి, తుని బజారుకు రూ. 85.61లక్షల చొప్పున ఖర్చవుతుందని అంచనా వేశారు. దీంతో 2021 ఏడాది చివర్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే పని విలువ లక్షల్లో ఉండ డంతో కాంట్రాక్టర్లు పోటీ పడతారని ప్రభుత్వం భావించింది. కానీ దీనికి విరుద్ధంగా గడువు పూర్తయినా ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్లు దాఖలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో మళ్లీ రెండున్నర నెలల వ్యవధి తర్వాత ప్రభుత్వం ఇంకోసారి టెండర్లు పిలిచింది. కానీ అప్పటి జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేని కాంట్రాక్టర్లు అప్పుడు కూడా ఆసక్తి చూపలేదు. ఒకవేళ టెండర్లు దక్కించుకున్నా ప్రభుత్వం డబ్బులు ఇవ్వదనే భయంతో ఒక్కరంటే ఒక్క రు కూడా కన్నెత్తి చూడలేదు. దీంతో ప్రభుత్వం పరువు బజారుపాలయింది. అయినా ఇదేదీ ఖాతరు చేయని సర్కారు ఏకంగా మూడేళ్లలో పదమూడుసార్లు రైతుబజార్ల నిర్మాణ టెండర్లు పిలుస్తూనే వచ్చింది. చివరకు ఓట్ల కోసం అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలలు ఉందన్న సమయంలో కూడా కొత్తగా మళ్లీ టెండర్లు పిలి చింది. అయినా స్పందన శూన్యం. దీంతో అప్ప టి జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక ఎవరూ ముందుకురాక రైతు బజార్ల నిర్మాణానికి గ్రహణం పట్టినట్టయింది.
15 వరకు అవసరం..
వాస్తవానికి కాకినాడ జిల్లాకు 15 వరకు కొత్త రైతుబజార్ల అవసరం ఉంది. కానీ ఈ ఏడు పూర్తయితే ఆ తర్వాత మిగిలినవి పట్టా లెక్కించాలని అధికారులు భావించారు. కానీ జగన్ ప్రభుత్వానికి ఉన్న చెడ్డపేరు కారణంగా ఏ పనికి టెండర్లు పిలిచినా కదలని పరిస్థితి. దీంతో ఇప్పటికీ జిల్లాలో కాకినాడ నగరంలో రెండు, పెద్దాపురంలో ఒకటి మాత్రమే రైతు బజార్లు నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మారి కొత్తగా కూటమి సర్కారు గద్దెనెక్కడంతో అధికారుల్లో ఆశలు గురించాయి. అందులోభాగంగా ఇటీవల ప్రభుత్వం దృష్టికి మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు పాత ప్రతిపాదనలను తీసుకువెళ్లారు. ఏడు కొత్త బజార్ల నిర్మాణానికి స్థలాలు కూడా ఉచితంగా సిద్ధం చేశామని వివరించారు. అటు తాజా కూరగాయలు విక్రయించేలా నేరుగా రైతులను కూడా ఎంపికచేసి ఉంచామని తెలిపారు. టెండర్లు తిరిగి పిలిస్తే ఏడాదిలోగా వీటిని అం దుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం తక్షణ నిర్ణయం కింద మున్సిపాల్టీల్లో తొలుత వీటిని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. దీంతో కొత్తగా సామర్లకోట, తుని, పిఠాపురం మున్సిపాల్టీల పరిధిలో వీటి నిర్మా ణానికి వీలుగా చర్యలు చేపట్టనుంది. సామర్లకోట రైతుబజారుకు స్థల సేకరణ చేయాల్సి ఉంది. తునిలో స్థలం సిద్ధంగా ఉంది. అటు పిఠాపురంలో ఎంపికచేసిన స్థలం న్యాయ వివాదంలో ఉంది. దీంతో వీటన్నింటిని వేగంగా పూర్తిచేయాలని జిల్లా అధికారులు లక్ష్యం విధిం చుకున్నారు. ఇందుకోసం రూ.3.50 కోట్ల వరకు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అయితే చాలాకాలం కిందటి అంచనాలు కావడంతో తిరిగి వీటికి కొత్త అంచనాలు సవరించి ఏప్రిల్‌లో వీటికి కొత్త టెండర్లు పిలిచి పని పూర్తిచేయనున్నారు. అటు కాకినాడ రూర ల్‌లోని తూరంగిలో నిర్మించిన కొత్త రైతు బజారును ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభించనున్నారు. అలాగే కాకినాడ రాజీవ్‌గృహకల్ప సమీపంలో రైతుబజారు నిధుల సమస్యతో మధ్యలోనే ఆగిపోయింది. దాని నిర్మాణం కూడా పూర్తిచేసి త్వరలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దశలవారీగా మిగిలిన పట్టణాల్లో ప్రతిపా దించిన కొత్త రైతుబజార్లను నిర్మించనున్నారు.