Share News

ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించరా..

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:12 AM

ఏళ్లు గడుస్తున్నా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారని అధికార, విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించరా..

అధికారుల తీరుపై సభ్యుల ధ్వజం

సంక్రాంతికి ముందే చెత్తతో భోగిమంటలు

అమలాపురం రూరల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఏళ్లు గడుస్తున్నా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారని అధికార, విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారట్లేదని, గత ప్రభుత్వంలో ప్రస్తావించిన సమస్యలను సైతం ఇప్పటి వరకు పరిష్కరించని తీరుపై ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మండిపడ్డారు. అమలాపురం మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్‌ బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. బండారులంకలో డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరించకపోవడంతో సంక్రాంతికి ముందే ప్రతి వీధిలోను, ప్రధాన రహదారుల్లోను ఎక్కడికక్కడ చెత్తతో భోగి మంటలు వేస్తున్నారని ఎంపీటీసీ అంకం హిమభారతి పేర్కొన్నారు. బండారులంక సర్పంచ్‌ పెనుమాలసునీత మాట్లాడుతూ డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం దొరకట్లేదని, గ్రామస్తులు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిందాడగరువులో లోఓల్టేజ్‌ సమస్యతో పాటు తరచూ విద్యుత్‌ అంతరాయంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకువచ్చామని సర్పంచ్‌ పొణకల గణేష్‌ పేర్కొన్నారు. తాండవపల్లి, భట్నవిల్లి గ్రామాల్లోని శ్మశానవాటికల్లో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుచేయాలని, సాకుర్రు అంబేడ్కర్‌నగర్‌లో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీసీ రేవు శ్రీనుబాబు, సర్పంచ్‌ తిరుకోటి సుజాత, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు పొలమూరి బాలకృష్ణ విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గృహ నిర్మాణ శాఖ అధికారుల తీరుపై ఎంపీపీ భాగ్యలక్ష్మి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో గృహనిర్మాణ రుణాలు మంజూరు కాలేదని, ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ లబ్ధిదారులు రుణాల కోసం ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. పాలగుమ్మిలో డ్వాక్రా మహిళల నుంచి సేకరించిన నగదును వీవోఏలు బ్యాంకుకు జమ చేయకుండా స్వాహా చేశారని, ఈవ్యవహారంలో ఏపీఎం, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని పాలగుమ్మి సర్పంచ్‌ కుడుపూడి రామలక్ష్మి కోరారు. లక్షలాది రూపాయలు స్వాహా చేసినా ఎందుకు చర్యలు తీసుకోరని మండిపడ్డారు. బండారులంకలో జరిగిన నిధుల స్వాహాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సర్పంచ్‌ సునీత ప్రశ్నించారు. వన్నెచింతలపూడి లాకు వంతెన ప్రమాదకరంగా ఉందని, రక్షణ చర్యలు చేపట్టాలని కోఆప్షన్‌ సభ్యుడు ఎం.స్పర్జన్‌రాజు కోరారు. ఎంపీటీసీలకు 23నెలలుగా జీతాలు లేవని, జీతాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈదరపల్లి ఎంపీటీసీ అడపా సత్తిబాబు కోరారు. ఈవిషయంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాశామని ఎంపీపీ భాగ్యలక్ష్మి సమాధానమిచ్చారు. పంటకాల్వలు, మురుగుకాల్వ గట్లపై ఆక్రమణలు పెరిగిపోతున్నాయని, ఏళ్లు గడిచిపోతున్నా చర్యలు తీసుకోరా అని ఎంపీపీ, జడ్పీటీసీ పందిరి శ్రీహరిలు డ్రైన్స్‌ ఏఈ సునీత, ఇరిగేషన్‌ ఏఈ రెహ్మాన్‌లపై మండిపడ్డారు. కుమ్మరికాల్వపై ఆక్రమణలు పెరిగిపోతూనే ఉన్నాయని, అసలు వాటిని తొలగిస్తారా లేదా అని ఈదరపల్లి, పేరూరు ఎంపీటీసీలు సత్తిబాబు, వాసంశెట్టి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించడంలో ఇరిగేషన్‌, విద్యుత్‌, మురుగు, సాగునీటిపారుదల శాఖల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ అడపా సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో ఉండ్రు బాబ్జీరాజు, పంచాయతీరాజ్‌ డీఈ పీఎస్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.1.470లక్షల మిగులుబడ్జెట్‌

2024సవరణ బడ్జెట్‌, 2025-26అంచనా బడ్జెట్‌లో చూపిన ఆదాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి అంచనా బడ్జెట్‌ను ఎంపీడీవో బాబ్జీరాజు ప్రవేశపెట్టారు. 2025-26 బడ్జెట్‌లో అన్నిపద్దుల కింద ఆదాయం రూ.109,56,78,000 కాగా వ్యయం రూ.10 9,55,31,000గా అంచనా వేశారు. రూ.1.47లక్షల మిగులు బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించారు.

Updated Date - Jan 07 , 2025 | 01:12 AM