శ్మశానవాటికల దుస్థితిపై కౌన్సిలర్ల ఆవేదన
ABN , Publish Date - Jan 29 , 2025 | 01:21 AM
ఆర్టీిసీ కాంప్లెక్సు వద్ద ఉన్న శ్మశానవాటిక దుస్థితికి సిగ్గుపడాలని 3వ వార్డు కౌన్సిలరు అంకం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ) జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆర్టీిసీ కాంప్లెక్సు వద్ద ఉన్న శ్మశానవాటిక దుస్థితికి సిగ్గుపడాలని 3వ వార్డు కౌన్సిలరు అంకం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్‌పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన పురపాలక సంఘ సమావేశ మందిరంలో జరిగింది. జనసేన కౌన్సిలరు అంకం శ్రీనివాస్ మాట్లాడుతూ పసలపూడి వద్ద స్వాగత ముఖద్వారం నిర్మాణం అంశంపై మాట్లాడారు. గతంలో హిందూ, క్రైస్తవ శ్మశానవాటిక అభివృద్ధ్దికి రూ.10 లక్షలు కేటాయించారని ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదని ప్రశ్నించారు. పట్టణంలో శ్మశానవాటికల దుస్థితిపై కౌన్సిలర్లు వాడ్రేవు సాయిప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు మస్తాన్ మాట్లాడారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో జిమ్ సామగ్రి చెడిపోయాయని, వాకింగ్ ట్రాక్ శుభ్రపర్చడం లేదన్నారు. కౌన్సిలరు బావాల మంగామణి మాట్లాడుతూ తన వార్డులో స్వయం సంఘాల గ్రూపుల నిర్వహణ సక్రమంగా లేదని రుణాలమంజూరులో ఆర్పీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఇంటర్ నెట్ రూ.2.70 లక్షలు, 12 సమావేశాలకు రూ.2 లక్షలు ఖర్చు చేయడంపై వాడ్రేవు సాయిప్రసాద్ అభ్యంతరం తెలిపారు. వైఎస్‌ఆర్ నగర్‌లో ఇళ్లకు కుళాయి కనెక్షన్‌లకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఇబ్బంది పెడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారికి కుళాయి కనెక్షన్‌లు ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. సాధారణ సమావేశంలో 12, అత్యవసర సమావేశంలో 5 అంశాలు ఆమోదించారు. సమావేశంలో వైస్ చైర్మన్లు కొలమూరి శివాజీ, చింతపల్లి నాగేశ్వరరావు, కమిషన్ అయ్యప్పనాయుడు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.