Share News

సంక్రాంతికి వస్తున్నాం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:52 AM

గోదావరి జిల్లాల ఆప్యాయత.. అనురాగాలు.. ప్రేమకు తిరుగులేదు.. కాలం మారినా అదే తీరు.. గోదావరి నీటిలోనే ఆ ప్రేమ ఇమిడి ఉందో ఏమిటో తెలియదు కానీ.. గత పది రోజులుగా ప్రతి ఇంట్లోనూ పండుగకు ఎప్పుడొస్తున్నారు.. ఎప్పుడొస్తున్నారు.. అనే మాటకు అలుపే లేదు..

సంక్రాంతికి వస్తున్నాం
కాకినాడ రైల్వేస్టేషన్‌లో రద్దీ

దారులన్నీ ఇటువైపే

ప్రధాన నగరాల నుంచి రాక

తరలివస్తున్న బంధుగణం

బస్‌లు..రైళ్లు..విమానాలు ఫుల్‌

కళకళలాడుతున్న పల్లెలు

సొంత వాహనాలే ఆధారం

హైవేలపై ట్రాఫిక్‌జామ్‌లు

గోదావరి జిల్లాల్లో సందడి

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

గోదావరి జిల్లాల ఆప్యాయత.. అనురాగాలు.. ప్రేమకు తిరుగులేదు.. కాలం మారినా అదే తీరు.. గోదావరి నీటిలోనే ఆ ప్రేమ ఇమిడి ఉందో ఏమిటో తెలియదు కానీ.. గత పది రోజులుగా ప్రతి ఇంట్లోనూ పండుగకు ఎప్పుడొస్తున్నారు.. ఎప్పుడొస్తున్నారు.. అనే మాటకు అలుపే లేదు.. అంత ఆప్యాయంగా పిలిస్తే ఎందుకురారు.. సంక్రాంతికి వస్తున్నాం.. అంటూ బంధువులు వచ్చేస్తున్నారు.. అటు హైదరాబాద్‌ ఇటు వైజాగ్‌ నుంచి దారులన్నీ గోదావరి జిల్లాల వైపే చూపిస్తున్నాయి.. రైళ్లు ఫుల్‌ అయిపోతు న్నాయి.. బస్‌ల సంగతి సరే సరి.. విమానాలదీ అదే పరిస్థితి.. కార్లు.. ద్విచక్ర వాహ నాలపై వచ్చే వారి సంఖ్య తక్కువేంలేదు.. రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి.. గోదావరి జిల్లాల్లోని పల్లెలబాట పడుతున్నాయి.. సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో సందడే వేరు.. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా కుటుంబాలతో పండుగకు వస్తారు.. పట్టణం నుంచి పల్లెబాట పడతారు.ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాదిమంది బెంగళూరు, పుణే, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే ఎక్కువ. శుక్రవారం పని ముగించుకుని శని, ఆదివారం సెలవు కావ డంతో పండుగకు బయలుదేరిపోయారు. శని వారం అర్ధరాత్రి నుంచే గోదావరి జిల్లాల రోడ్లకు తాకిడి పెరిగింది. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, మధురపూడి ఎయిర్‌పోర్ట్‌ కిటకిటలా డిపోతు న్నాయి. ప్రయాణికుల సంఖ్య గతంకంటే పెరి గింది. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి కొద్దినెలల కిందట కేవలం 1300 మంది వరకూ రాకపోకలు సాగిస్తే.. ప్రస్తుతం రోజూ 2 వేలమంది రాకపోకలు సాగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట 80 శాతం నుంచి 95 శాతం వరకూ ఆక్యుపెన్సీ ఉండగా ప్రస్తుతం ఫుల్‌ అయిపోతున్నాయి. ముంబై, ఢిల్లీ నుంచి వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఇక ఆర్టీసీలో సాధారణ రోజుల్లో 25 వేలమంది వరకూ ప్రయాణిస్తుంటే ప్రస్తుతం 50 వేలమంది ప్రయాణికులు రాకపో కలు సాగిస్తున్నారు. స్వగ్రామాలకు చేరుతున్న విద్యార్థులు, ప్రజలతో బస్టాండ్లు కిక్కిరిసిపోయా యి. కాకినాడ నగరంతోపాటు రాజమహేంద్రవ రం, అమలాపురం, రాజోలు, జగ్గంపేట, ఏలేశ్వ రం, రావులపాలెం బస్టాండ్లలో సందడి కనిపించింది. రైళ్లలో ప్రతి రోజూ వేలాదిమంది రాక పోకలు సాగిస్తుంటే.. ఆయా రైల్వే స్టేషన్లన్నీ ఊపిరాడనంతగా కిక్కిరిసిపోతున్నాయి. ప్రధా నంగా రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లకు సంక్రాంతి పండుగ ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉందని చెబుతున్నారు.

జాతీయ రహదారులు కిటకిట

కార్పొరేషన్‌(కాకినాడ)/నల్లజర్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై సంక్రాంతి సందడి మొదలైంది. వరుస సెలవులు కావడం తో పట్టణాల నుంచి పల్లెలకు ప్రజలు పయనమయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు బయలుదేరిన వారితో శుక్ర, శనివారాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. విశాఖపట్నం నుంచి విజయవాడ 16వ నెంబర్‌ జాతీయరహదారి, కత్తిపూడి నుంచి పామర్రు 216వ నెంబరు హైవేపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. ఈ రద్దీ తిరుగు ప్రయాణికులతో ఈనెల 19వ తేదీ వరకు కొనసాగనుంది.

200 బస్‌లు ఫుల్‌..

కార్పొరేషన్‌(కాకినాడ), జనవరి 11 (ఆం ధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్‌ అయిపోయాయి. పండుగ ముందు, తర్వాత కూడా వందశాతం బుకింగ్‌ పూర్తయింది. శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు బస్సులేవీ ఖాళీ లేకపోవడంతో హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణీకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సంక్రాంతి ప్రయాణాలకు ఆర్టీసీ బస్సుల్లో సీటు దొరికే పరిస్థితి లేకుండాపోయింది. హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ నుంచి ఉమ్మడి జిల్లాకు సుమారు 200 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బస్సులన్నీ ఫుల్‌ అయిపోయాయి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని స్పెషల్స్‌ నడిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే తిరుగు ప్రయాణం కూడా కష్టంగా ఉండబోతుంది. ఈనెల 16 నుంచి 19 వరకు సీటు దొరికే పరిస్థితి లేదు. తిరుగు ప్రయాణాలు చేసుకునే వారికి 20వ తేదీ నుంచి మాత్ర మే సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పండుగకు రావాలనే.. కంగారొద్దు!

పండుగకు స్వగ్రామాలకు రావాలనే కంగారొద్దు.. జాగ్రత్తగా రండి.. లేదంటే ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.. వచ్చీరాని డ్రైవింగ్‌తో ఇంత రద్దీ సమయంలో దూర ప్రయాణం కష్టమే.. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. లేదంటే ప్రమాదాలు జరగొచ్చు..పండుగ నేపథ్యంలో చాలా మంది బెంగళూరు, హైదరాబాద్‌, పుణె.. తదితర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఇలా వచ్చే వారి కారులో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవింగ్‌ వచ్చిన వారు ఉండాల్సిందే.. ఎందుకంటే ఒకరు నిద్రపోయినా మరొకరు డ్రైవింగ్‌ చేయొచ్చు. లేదా నిద్ర వస్తే రహదారి పక్కన కాసేపు నిలిపివేసి నిద్రపోండి. ఎంత ఆనందంగా వస్తున్నారో అంతే భద్రంగా తిరిగెళ్లాలి సుమా..!

రద్దీ ఎక్కువగా ఉంటే.. స్కూల్‌ బస్‌లు తిప్పేయండి..

కార్పొరేషన్‌(కాకినాడ), జనవరి 11: పండుగ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపట్టాలని డీజీపీ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు ఎస్పీలు, ఆర్టీసీ డీపీటీవో, డీటీసీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులకు సరిపడా బస్సు సౌకర్యాల్లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటిచోట్ల తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు సరిపోకపోతే ప్రైవేట్‌ కాలేజీ, స్కూల్‌ బస్సులను ఉపయోగించాలని సూచించారు.

- డీజీపీ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు

Updated Date - Jan 12 , 2025 | 12:52 AM