Share News

ప్రజాసమస్యల పరిష్కారానికి పనిచేయాలి

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:28 AM

రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ కోలా గంగాభవానీ పేర్కొన్నారు.

 ప్రజాసమస్యల పరిష్కారానికి పనిచేయాలి

ముమ్మిడివరం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ కోలా గంగాభవానీ పేర్కొన్నారు. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. తొలుత మండలంలోని వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల ప్రగతిని వివరించారు. అయినాపురం శివారు మెట్టలంకలో ఏళ్ల తరబడి వాటర్‌ ట్యాంకు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని, దీనికి అధికారులు నిర్లక్ష్యమా లేకా ప్రభుత్వ అలసత్వమా అని ఆ గ్రామ సర్పంచ్‌ మోకా రామారావు, ఎంపీటీసీ సభ్యుడు మట్టపర్తి సురేష్‌ ఆరోపించారు. దీనిపై ఎంపీడీవో శ్రీవెంకటాచార్య మాట్లాడుతూ సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారి అత్యవసర పని మీద బయటికి వెళ్లారని, ముందు సమాచారం ఇచ్చే వెళ్లారని, మీ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతానని వివరణ ఇచ్చారు. మండల విద్యాశాఖాధికారి డి.గౌరీశంకర్‌ మాట్లాడుతూ మండలంలో పదో తరగతి పరీక్షలకు 7,347మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఈఏడాది నూరుశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయినాపురం ఎంపీటీసీ మట్టపర్తి సురేష్‌ మాట్లాడుతూ మధ్యాహ్నభోజన పథకానికి రేషన్‌ బియ్యమే సరఫరా చేస్తున్నారని, దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడంలేదని ఆరోపించారు. దీనిపై ఎంఈవో గౌరీశంకర్‌ వివరణ ఇస్తూ విద్యార్థులకు సన్నబియ్యం ఇవ్వాలని, అయితే రేషన్‌ బియ్యంలో పోషక విలువలు ఉన్నాయంటూ ఆ బియ్యాన్నే సరఫరా చేస్తున్నారన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో డి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో ప్రస్తుత సంవత్సరంలో 921పనులకు రూ.7.33కోట్లు నిధులు ఖర్చు చేశామన్నారు. 2,50,120 మందికి పనిదినాలు కల్పించామని, దినసరి వేతనం రూ.293 చెల్లించామన్నారు. సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్‌ డి.గోపాలకృష్ణ, ఏవో ఏఎన్‌ ఎనివాస్‌, ఈవోపీఆర్డీ ఎల్‌.కల్యాణి, డీఈఈ పాలకొల్లు విజయశ్రీనివాసరావు,సర్పంచ్‌లు ఎంపీటీసీలు, వివిధ శాఖలఅధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:28 AM