Share News

ఓఎన్జీసీపై పోరుకు ఓడలరేవు గ్రామస్తుల అల్టిమేటం

ABN , Publish Date - Feb 05 , 2025 | 12:39 AM

కృష్ణా-గోదావరి బేసిన్‌ పరిధిలో 30ఏళ్లుగా అపారమైన చమురు నిక్షేపాలు తరలించుకుపోతూ ఓఎన్జీసీ ఓడలరేవు గ్రామాభివృద్ధి, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని సమావేశం ఆరోపించింది.

ఓఎన్జీసీపై పోరుకు ఓడలరేవు గ్రామస్తుల అల్టిమేటం

అల్లవరం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కృష్ణా-గోదావరి బేసిన్‌ పరిధిలో 30ఏళ్లుగా అపారమైన చమురు నిక్షేపాలు తరలించుకుపోతూ ఓఎన్జీసీ ఓడలరేవు గ్రామాభివృద్ధి, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని సమావేశం ఆరోపించింది. ఓడలరేవు గ్రామస్తులకు ఇచ్చిన హామీ ఓఎన్జీసీ అమలు చేయకుంటే ఈనెల6 నుంచి ఓడలరేవులో ఓఎన్జీసీ ప్లాంటు కార్యకలాపాలు అడ్డుకుని నిరవధిక ధర్నా చేపడతామని గ్రామస్తులు అల్టిమేటం జారీ చేశారు. టెక్నికల్‌ అర్హతలున్నా స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలిస్తున్నారని ఆరోపించారు. ఓడలరేవులో రైతుల నుంచి 470ఎకరాలను భూమిని ఓఎన్జీసీ సంస్థ తీసుకుని ఇంకా కొంత మందికి సొమ్ములు ఇవ్వలేదని, సీఎస్సార్‌ నిధులను సక్రమంగా ఖర్చు చేయలేదని సమావేశం ఆరోపించింది. దేశంలో ఓడలరేవు అతిపెద్ద గ్యాస్‌ టెర్మినల్‌ అని, రోజుకు 15లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ తరలించుకుపోతూ అభివృద్ధిని విస్మరించిందని పలువురు దుయ్యబట్టారు. ఓఎన్జీసీ లిఖితపూర్వక హామీ ఇవ్వకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పలువురు హెచ్చరించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు మాట్లాడుతూ ఓఎన్జీసీ భారీ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రోమోటెక్‌ కంపెనీలో 66 పోస్టులు ఇస్తామని, తక్కువ మందిని చేర్చుకుంటే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దృష్టికి తీసుకువెళతానని అన్నారు. అనంతరం ఓఎన్జీసీకి వెళ్లే రోడ్డులో గ్రామస్తులు, కూటమి నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమాల్లో కొల్లు విష్ణుమూర్తి, పినపోతు రామకృష్ణ, నాతి లెనిన్‌బాబు, కలిగితి సత్యనారాయణ, కొప్పాడి వెంకటరామకృష్ణ, గండుమేను శ్రీను, మంతెన సురేష్‌రాజు, పిండి గణపయ్య, పెచ్చెట్టి రామకృష్ణ, నల్లా రాము, కడలి విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2025 | 12:39 AM