వార్డుల్లో సమస్యలను గుర్తించాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:28 AM
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని వార్డుల్లో నియమితులైన ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన వార్లులో పర్యటించి సమస్యలను గుర్తించాలని కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశించారు.

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలి
కమిషనర్ కేతన్ గార్గ్
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 11( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని వార్డుల్లో నియమితులైన ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన వార్లులో పర్యటించి సమస్యలను గుర్తించాలని కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశించారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే డివిజన్లలో పర్యటించి సమస్యలు గుర్తించిన ప్రత్యేక అధికారులు వాటిపై నివేదిక తయారు చేయాలన్నారు. అలాగే చిన్న చిన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలన్నారు. సచివాలయ కార్యదర్శులతో కలిసి తిరిగి సమస్యలను గుర్తించాలని వాటి పరిష్కారానికి సమావేశం నిర్వహిచాలన్నారు. చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్‌కు తరలించే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. షాపుల ఎదుట ప్లాస్టిక్ చెత్త కుండీలు ఏర్పాటు చేసుకోని వ్యాపారస్తులకు జరిమానా విధించాలని ఆదేశించారు. దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. పన్నుల వసూళ్లు పర్యవేక్షించాలని, మొండి బకాయిదారులకు సేవలు నిలుపుదల చేయించాలని, నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల యజమానులకు జరిమానా విధించాలని సూచించారు. ప్రతీ వార్డులో సమస్యలపై సమగ్ర వివరాలు సేకరించి ప్రొఫైల్ తయారు చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు నిర్వహించే సమావేశానికి సచివాలయ కార్యదర్శులు తప్పక హాజరుకావాలని కమిషనర్ ఆదేశించారు.
గాదాలమ్మనగర్ పుంత రోడ్డు విస్తరణ
కార్పొరేషన్ పరిధిలోని గాదాలమ్మనగర్ పుం త రోడ్డును 60నుంచి 80 అడుగులకు విస్తరిస్తున్నామని కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం గాదాలమ్మనగర్ పుంత రోడ్డును టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్డులో 760 మీటర్ల మేరకు అభివృద్ధి ప్రణాళిక రూపొందించామన్నారు. మొత్తం ప్రభావిత భవనాలు, స్థలాలు 54 ఉన్నాయని, ఈ రోడ్డుకు హైవే నుంచి మునిసిపల్ పరిమితి వరకు మొత్తం 1.2 కిమీ పొడవు ఉంటుందన్నారు. ఈ రోడ్డుకు సంబంఽధించి స్ధలాలు భవనాలు యజమానులతో సమావేశం నిర్వహించి టిడీఆర్ అందజేస్తామన్నారు. ఖాళీ స్థలాల్లో రోడ్డు విస్తరణ చేపట్టి భవన నిర్మిత స్థలాలకు పన్ను విధించనున్నట్టు తెలిపారు. శనివారంలోపు అన్ని భవన యజమానులు నుంచి అవసరమైన పత్రాలు సేకరించి రోడ్డు, అభివృద్ధి ప్రణాళికను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ కోటయ్య, డీసీపీ సత్యనారాయణ రాజు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.