అక్కడ వెలవెల... ఇక్కడ కళకళ
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:34 AM
బర్డ్‌ఫ్లూ వైరస్ ప్రచారంతో కోడి మాంసం అమ్మకాలు నిలిచిపోవడం వల్ల మాంసాహారప్రియులు చేపలు, మటన్ మార్కెట్‌లపై పడ్డారు. దీనిని గ్రహించిన విక్రయదారులు వాటి ధరలను పెంచి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు.

బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి ప్రచారంతో నిలిచిన కోడి మాంసం అమ్మకాలు
ఫిష్, మటన్ మార్కెట్లలో పెరిగిన రద్దీ
ధరలు పెంచి వినియోగదారులను దోచుకుంటున్న వ్యాపారులు
చికెన్ లేక మూతపడిన హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు
కోడిగుడ్డుకు పెరుగుతున్న గిరాకీ
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
బర్డ్‌ఫ్లూ వైరస్ ప్రచారంతో కోడి మాంసం అమ్మకాలు నిలిచిపోవడం వల్ల మాంసాహారప్రియులు చేపలు, మటన్ మార్కెట్‌లపై పడ్డారు. దీనిని గ్రహించిన విక్రయదారులు వాటి ధరలను పెంచి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి కారణంగా జిల్లాలో కోడి మాంసం అమ్మకాలు 15 రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా కోళ్లు తయారయ్యే ఫారాలు, విక్రయించే హోల్‌సేల్, రిటైల్ షాపులతో పాటు కోడిమాంసం ఆధారంగా నిర్వహించే నాన్ వెజ్ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కోడిమాంసం దుకాణాలు మూతపడ్డాయి. వాటిపై ఆధారపడి జీవించే వందలాది మంది ఇప్పటికే ఉపాధి కోల్పోయారు. షాపులు మూసివేశారు. అయితే ప్రజలు చికెన్‌వైపు ఇంకా దృష్టి సారించకపోవడంతో కోళ్లఫారం యజమానులు చికెన్ బిర్యానీలు, డ్రై ఐటెమ్స్ చేసి మేళాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ లేదు. కోడి మాంసం తినొచ్చు. కోడిగుడ్లను కూడా తినండంటూ జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అధికారికంగా ప్రకటనలు జారీ చేసినప్పటికీ ప్రజలను బర్డ్‌ఫ్లూ భయం వేధిస్తోంది. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో దాదాపు చికెన్ ఐటెమ్ లేకుండానే విందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సముద్రం, గోదావరిలో లభ్యమయ్యే చేపలు, రొయ్యలు, పీతలు వంటి అనేక రకాల మత్స్య సంపదకు అనూహ్యమైన డిమాండ్ పెరిగింది. దాంతో ఆదివారం వస్తే చాలు ఫిష్ మార్కెట్లు వినియోగదారులతో కిక్కిరిసిపోతున్నాయి. సందువా, పండుగొప్ప, కోనం వంటి చేపల ధర గతంలో కిలో రూ.400 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.700 పైమాటే. కిలో రొయ్యలు రూ.300పైనే ధర పలుకుతున్నాయి. మటన్ సంగతికి వస్తే గతంలో కిలో రూ.800 ఉండగా ఇప్పుడు డిమాండ్‌ను బట్టి రూ.900 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. కోడిగుడ్డు గతంలో రూ.7పైనే ఉండగా ప్రస్తుతం రూ.6కు దిగింది. కోడిగుడ్ల వినియోగం మార్కెట్‌లో బాగానే పెరిగినట్టు వ్యాపారులు చెప్తున్నారు. హోటళ్లు, బేకరీలు వంటి వాటితో పాటు వంటకాల్లో బాగా పెరిగింది. చికెన్ లేకపోవడంతో ప్రజలు మళ్లీ గుడ్డువైపు మొగ్గుచూపుతున్నారు. మటన్, ఫిష్ మార్కెట్లలో ధరలను అనూహ్యంగా పెంచడంతో మాంసాహారుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ధరలు పెంచితే కఠిన చర్యలు చేపడతామని అధికారులు హెచ్చరించినప్పటికీ వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు.