కొత్తగా భూఆధార్ నమోదు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:30 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని రైతులకు నేరుగా వర్తింపచేసేందుకు కొత్తగా భూ ఆధార్-ఫార్మర్ రిజిస్ర్టీ కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు ఆదివారం తెలిపారు.

అమలాపురం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని రైతులకు నేరుగా వర్తింపచేసేందుకు కొత్తగా భూ ఆధార్-ఫార్మర్ రిజిస్ర్టీ కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయశాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమం ద్వారా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ నమోదు చేస్తున్నారన్నారు. దీని ద్వారా పీఎం కిసాన్ చెల్లింపు పెట్టుబడి సాయం, పంటల బీమా, దిగుబడుల విక్రయాలు, రాయితీపై సూక్ష్మ పోషకాలు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, పంట రుణాలు, వడ్డీ రాయితీ, సూక్ష్మ సేద్యంపై రాయితీ వంటి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చునన్నారు. భూ ఆధార్ ఉన్న వారికి మాత్రమే పీఎం కిసాన్ వంటి పథకాలు వర్తింప చేస్తారన్నారు. భూమి ఉన్న ప్రతీ రైతు ఆధార్ నంబరు, అనుసంధానిత ఫోన్ నంబరు, కొత్త పట్టాదారు పాసు పుస్తకం తీసుకుని సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ఈ నెల 25లోగా నమోదు చేయించుకోవాలన్నారు. ప్రతీ రైతు అశ్రద్ధ చేయకుండా భూ ఆధార్ పొందాలని కోరారు. రెవెన్యూ అధికారులు భూ ఆధార్‌ను ధ్రువీకరించిన అనంతరం వాటి ఆధారంగా విశిష్ట భూ ఆధార్ కార్డు జనరేట్ అవుతుందన్నారు. ఆధార్ తరహాలో అన్నదాతలకు ప్రత్యేక గుర్తింపు పత్రం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. సాగు భూమి ఉన్న ప్రతీ రైతుకు పదకొండు అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పత్రం జారీ ప్రక్రియ జిల్లాలో ఇటీవల ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగుతుందన్నారు. భూ ఆధార్ నమోదు సమయంలో భూ యజమాని సెల్‌ఫోన్‌కు మూడు ఓటీపీలు వస్తాయని, అనంతరం రైతు ఇచ్చిన సెల్ నంబరుకు పదకొండు అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుందన్నారు. భూ ఆధార్ లేకుంటే ప్రభుత్వం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, రాయితీలు అందవని స్పష్టం చేశారు. జిల్లాలో 1.65 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు 48 వేల మంది రైతులు పోర్టల్‌లో భూ ఆధార్ కోసం నమోదైనట్టు వ్యవసాయాధికారి బోసుబాబు తెలిపారు.