కోతుల బెడద తప్పించరూ..
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:36 AM
ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా ఉన్న బొబ్బర్లంక బ్యారేజీపై కోతుల స్వైర విహారంతో ప్రజలు భయాందోళలు చెందుతున్నారు.

ఆత్రేయపురం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా ఉన్న బొబ్బర్లంక బ్యారేజీపై కోతుల స్వైర విహారంతో ప్రజలు భయాందోళలు చెందుతున్నారు. ఆహ్లాద వాతావరణం, గోదావరి జిల్లాలకు సాగునీరు పంపించే బ్యారేజీ అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మరోవైపు బ్యారేజీపై కోతులు గుంపులుగా చేరి పర్యాటకులను, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆనందంగా గడిపేందుకు వచ్చే పర్యాటకులు తినే తినుబండరాలు సైతం అవి లాక్కునిపోతున్నాయి. వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న కోతులను పట్టుకుని బ్యారేజీ వద్ద వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వందల సంఖ్యలో కోతులు బొబ్బర్లంక, పేరవరం, వెలిచేరు, పేరవరం గ్రామాల్లో సంచరిస్తూ పంటలు, కిరాణా షాపులు, హోటల్‌పై చొరబడి తినుబండారాలు, వస్తువులు ఎత్తుకుపోతున్నాయని పలువురు వాపోతున్నారు. దీనిపై సంబంధిత బాధితులు ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాం తంలో పర్యటించిన ఎమ్మెల్యే దృష్టికి పలువురు స్థానికులు కోతుల బెడదను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులతో మాట్లాడినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.