Share News

జూన్‌లో కార్పొరేషన్‌ ఎన్నికలు

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:50 AM

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల్లో వసూలు చేసే పన్నులు ఎక్కడికక్కడ వినియోగించుకునే విధానం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు.

జూన్‌లో కార్పొరేషన్‌ ఎన్నికలు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ

ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు

భవన అనుమతులు సులభతరం

మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 8( ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల్లో వసూలు చేసే పన్నులు ఎక్కడికక్కడ వినియోగించుకునే విధానం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన టౌన్‌ ప్లానింగ్‌, రుడా, రెవెన్యూ విభాగాల అధికారులతో సమీక్షించారు. మునిసిపాలిటీలకు వచ్చే ఆదాయాన్ని వాటికే చేందేలా సీఎం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ద్వారా మునిసిపాలిటీ ,రుడా పరిధిలో భవనాలు, లేఅవుట్లకు అనుమతులు త్వరితగతిన జారీ చేస్తామన్నారు.ఐదు అంతస్తులు, 15 మీటర్ల ఎత్తులో నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనుమతులన్నీ చాలా సులభతరం చేశామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల టీడీఆర్‌ స్కామ్‌ జరిగిందన్నారు. దీనిపై విచారణ జరుగుతుందన్నారు.విశాఖపట్నంలో విజిలెన్స్‌, సీఐడీ లకు అప్పగించారని చెప్పారు. గోదావరి పుష్కరాలరు 29 నెలల సమమయం ఉందని దీనికి సీఎం చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారని చెప్పారు. త్వరలో పుష్కరాలపై సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో వేస్ట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను 2014-19లో ప్లాన్‌ చేశామని అటుపై వచ్చిన వైసీపీ నిర్వీర్యం చేసిందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ దృష్టి సా రించామన్నారు. ఒక్కో ప్లాంట్‌కు రూ.350 కోట్ల నుంచి రూ. 400 కోట్లతో ఖర్చవుతుందన్నారు. రాజమహేంద్రవరం-కాకినాడ, నెల్లూరు -తిరుపతి మధ్యలో, రాయలసీమలోను ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మునిసిపాలిటీల్లో పన్నులకు సంబంధించి వడ్డీ మాఫీ పై పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూన్‌లో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌, కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, ఆర్‌డీవో కృష్ణనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 12:50 AM