Share News

వీటీడీఏల లక్ష్యానికి ఐటీడీఏ తూట్లు

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:46 AM

విలేజ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీటీడీఏ)... ‘గిరిజన భాగస్వామ్యంతోనే గిరిజనాభివృద్ధి’ నినాదంతో 1999లో చంద్రబాబు సారధ్యంలో టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. 25ఏళ్ల క్రితం చంద్రబాబు విజనలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను గిరిజనులతోనే చేయించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని నిశ్చయించి జీవో నెం.30 ద్వారా మార్గదర్శకాలు జారీ చేశారు

వీటీడీఏల లక్ష్యానికి ఐటీడీఏ తూట్లు

25 ఏళ్ల క్రితం చంద్రబాబు రూపొందించిన గిరిజన వృద్ధి విజనను నిర్వీర్యం చేస్తున్న రంపచోడవరం ఐటీడీఏ అధికారులు

నిర్మాణ పనులన్నీ గిరిజనులకే అప్పగించే దిశగా తదనంతర చర్యల విస్మరణ

రూ.10 లక్షలు విలువను పెంచకపోగా కనీస పనులూ అప్పగించని వైనం

(రంపచోడవరం-ఆంధ్రజ్యోతి)

విలేజ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీటీడీఏ)... ‘గిరిజన భాగస్వామ్యంతోనే గిరిజనాభివృద్ధి’ నినాదంతో 1999లో చంద్రబాబు సారధ్యంలో టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. 25ఏళ్ల క్రితం చంద్రబాబు విజనలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను గిరిజనులతోనే చేయించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని నిశ్చయించి జీవో నెం.30 ద్వారా మార్గదర్శకాలు జారీ చేశారు. తద్వారా రూ.10లక్షల లోపు పనులను వీటీడీఏ ద్వారా చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామాల అభివృద్ధితో పాటు గిరిజనులకు ఉపాధి లభించింది. తదనంతరం కాలంలో ఈ వ్యవస్థను నడిపించాల్సిన రంపచోడవరం ఐటీడీఏ అధికారులే దీనికి తూట్లు పొడిచారు.

వీటీడీఏలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని భావించి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించే పద్దతిని క్రమబద్ధీకరించారు. అన్ని శాఖల నిధులూ వీటీడీఏల ద్వారా నే గ్రామస్థాయిలో వెచ్చించాలనేది ఈ విధానంలో కీలకం. 20 కుటుంబాలకు తక్కువ కాకుండా ఉండే ప్రతి జనావాసంలోనూ వీటిని ఏర్పాటు చేశారు. నేడు ఈ వీటీడీఏలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర నిధులతో మౌలిక వనరుల నిర్మాణాలు సాగుతున్నా వీటీడీఏలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసి, గ్రామస్థాయి అభివృద్ధి పనులన్నీ గిరిజనులతోనే చేయించాలన్న ఊసే అధికారులకు లేకుండా పోయింది. క్రమేణా అధికారులే ఈ వీటీడీఏలను నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం మన్యంలో అన్ని ఇంజనీరింగ్‌ శాఖల పనుల్లో మెజారిటీ పనులు గిరిజనేతర కాంట్రాక్టర్ల గుప్పెట్లోనే నడుస్తున్నాయి. గిరిజనులు కేవలం ఆయా పనుల్లో పని చేస్తున్నారు. తమ గ్రామాల్లో సాగే పనులను తామే నిర్వహించుకోవచ్చన్న ఆలోచననే వారికి లేకుండా ఇంజనీరింగ్‌ శాఖలు వ్యవహరిస్తున్నాయి.

మన్యంలో సుమారు 800కు పైగా వీటీడీఏలు ఉన్నాయి. ఇవి ఉన్న గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నా అవన్నీ వీటీడీఏలకు తెలియకుండానే జరుగుతున్నాయి. అసలు వీటీడీఏలు అమలులో ఉన్నాయన్న విషయమే తెలియని అధికారులు కూడా ఉన్నారు. వీటీడీలు అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వానికి గిరిజన గ్రామాల్లో పట్టు ఉండేది. అధికారులు దళారీ విధానాలనే ప్రోత్సహించడంతో క్రమేణా ప్రభుత్వానికి గ్రామాలపై పట్టు సడలింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి వీటికి ఎన్నికలు జరపాల్సి ఉండగా చాలా ఏళ్లుగా వీటికి ఎన్నికలే లేవు.

పనుల పరిధిని రూ.50 లక్షలకు పెంచాలి

వీటీడీఏలు చేపట్టే పనుల పరిధిని 25 ఏళ్ల క్రితం ఉన్న రూ.10లక్షలు నుంచి కనీసం రూ.50లక్షలకు పెంచితే ఆయా విలువ కలిగిన పనులు ఆయా గ్రామాల్లో గిరిజనుల పరిపుష్ఠికి దోహదపడతాయి. ఎంతటి పెద్ద పనినైనా రీచల పద్ధతిలో విభజించితే అన్ని పనులూ వీటీడీఏల ద్వారా చేయించే వీలుకలుగుతుంది. త్వరలో విజన-2047 డాక్యుమెంటు రూపకల్పన నేపథ్యంలో గిరిజనాభివృద్ధికి సంబంధించిన వీటీడీఏ కీలకం కానుంది. ప్రస్తుతం చీఫ్‌ సెక్రటరీగా ఉన్న విజయానంద్‌ మూడు దశాబ్దాల క్రితం రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పని చేసినందున విజన డాక్యుమెంటులో గిరిజనుల భాగస్వా మ్యానికి ప్రాధాన్యమిస్తే గిరిజనాభివృద్ధికి సార్ధకత చేకూరుతుంది.

Updated Date - Jan 18 , 2025 | 12:46 AM