Share News

పెద్దాసుపత్రిలో రోగుల సందర్శనకు ఆంక్షలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:33 AM

రాజమహేంద్రవరం పెద్దాసుపత్రిలో రోగులను పరామర్శించేందుకు వచ్చే సందర్శకులపై ఆసుపత్రి అధికారులు పలు ఆంక్షలు విధించారు.

పెద్దాసుపత్రిలో రోగుల సందర్శనకు ఆంక్షలు

జీటీజీహెచ్‌లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ మాత్రమే అనుమతి

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం పెద్దాసుపత్రిలో రోగులను పరామర్శించేందుకు వచ్చే సందర్శకులపై ఆసుపత్రి అధికారులు పలు ఆంక్షలు విధించారు. కేవలం సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలోనే రోగులను చూసేందుకు సందర్శకులను అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రి (జీటీజీహెచ్‌) పర్యవేక్షణాధికారి పేరుతో ఆయా విభాగాధిపతులకు ఆదేశాలు ఇస్తూ, హెచ్‌వోడీలు అందరూ తమ కింద పనిచేస్తున్న నర్సింగ్‌ సిబ్బందికి ఈ విషయమై తగిన సూచనలు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హాస్పటల్‌ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపిన విషయాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని, ఈ సూచనలను తు.చ తప్పకుండా అందరూ పాటించాలని స్పష్టంచేశారు. దీంతో ఇన్‌పేషెంట్లుగా ఉన్న తమ వారిని పరామర్శించేందుకు వచ్చే సందర్శకులను. నిర్ణీత వేళల్లో మాత్రమే అనుమతిస్తారు. అలాగే ఆయా వార్డుల్లో వైద్యంకోసం చేరిన రోగులకు చెందిన వ్యక్తులు తప్ప ఇతర వ్యక్తులను అనుమతించరాదని, ఎటువంటి అనుమతిలేని తినుబండారాలను లోపలకు అనుమతించవద్దని సూచించారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా హాస్పటల్‌ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపిన సూచనలమేరకు అంటూ, ఆసుపత్రి అధికారులు ఇలాంటి ఆదేశాలు జారీచేయడం వివాదాస్పదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రోగులను పరామర్శించడానికి సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య కేవలం రెండు గంటల సమయం కేటాయించడం, అది కూడా సా యంత్రం 4 తర్వాత మాత్రమే అని కండీషన్‌ పెట్టడం దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి తీవ్ర ఇబ్బందికరంగా, భారంగా మారుతుంద నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు అనుమతిలేని తినుబండారాలను లోపలకు అనుమతించవద్దని సూచించడం గందరగోళానికి దారితీసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అనుమతిలేని తినుబండారాలు అంటే ఏమిటనే దానిపై స్పష్టత లేకపోవడమే దీనికి కారణం. ఆసుపత్రిలో ప్రధానమైన సెక్యూరిటీ విభాగాన్ని పటిష్టం చేయకుండా ఇటువంటి అర్థంపర్థం లేని నిర్ణయాలు తీసుకోవడం ఏంటని, దీనివల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుందని కొందరు మండిపడుతున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 01:33 AM