రూ.45వేలు ఇంజక్షన్‌తో గుండెపోటుకు అత్యవసర వైద్యం
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:38 AM
గుండెపోటు వంటి విపత్కర పరిస్థితుల్లో సత్వర వైద్యం పొందినప్పుడే ప్రాణాన్ని నిలబెట్టగలమని జిల్లా వైద్యసేవల సమన్వయకర్త డాక్టర్ కె.కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు.

అమలాపురం టౌన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గుండెపోటు వంటి విపత్కర పరిస్థితుల్లో సత్వర వైద్యం పొందినప్పుడే ప్రాణాన్ని నిలబెట్టగలమని జిల్లా వైద్యసేవల సమన్వయకర్త డాక్టర్ కె.కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. ఎవరైనా చాతీలో నొప్పి, ఎడమ భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం, గుండెదడ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే 108అంబులెన్సుకు ఫోన్‌చేసి సమీపంలోని సామాజిక ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. గుండెనొప్పి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి గోల్డెన్ అవర్ (మొదటి గంట)లో రూ.45వేలు విలువైన తెనెక్టీప్లేస్ ఇంజక్షన్ ఉచితంగారోగికి అందిస్తారని చెప్పారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో సైతం ఇంజక్షన్‌తో పాటు వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు తెలిపారు. మంగళవారం ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి స్టెమీ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టెమీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే జిల్లాలో 45మందికి, ఏరియాఆసుపత్రిలో ఐదుగురు గుండె జబ్బు లక్షణాలున్న పేషెంట్లకు తెనెక్టీప్లేస్ ఇంజక్షన్ ఉచితంగా అందించినట్లు కార్తీక్‌రెడ్డి తెలిపారు. ఆర్‌ఎంవో డాక్టర్ కె.అనూష, నర్సింగ్ సూపరిండెంటెంట్ సీహెచ్ వెంకటలక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్‌ంలు పాల్గొన్నారు.