అతిథికి గ్రహణం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:11 PM
నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహాన్ని పట్టించుకునే నాథు డు లేక కొన్నేళ్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. కనీసం మరమ్మతులు కూడా చేసేవారు లేకపోవడంతో అతిథిగృహ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

రాజానగరంలో అలంకార ప్రాయంగా ట్రావెలర్స్ బంగ్లా
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
వినియోగంలోకి తీసుకురావాలి అంటున్న ప్రజలు
రాజానగరం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహాన్ని పట్టించుకునే నాథు డు లేక కొన్నేళ్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. కనీసం మరమ్మతులు కూడా చేసేవారు లేకపోవడంతో అతిథిగృహ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకుని దాదాపు ఐదెక రాల విస్తీర్ణంలో జిల్లా పరిషత్‌కు చెందిన అతిథి గృహం నిర్మితమైంది. రెండు సూట్‌లతో పాటు మూడు గొడౌన్లు, వాచ్‌మెన్ కోసం నివాస భవనం తదితర సదుపాయాలతో దాదాపు మూడు దశాబ్ధాల కిందట స్థానిక పోలీసుస్టేషన్‌ను ఆనుకుని దీనిని నిర్మించారు. పూర్వపు సమితి కేంద్రమైన రాజానగరంలో పలు రకాల పనుల కోసం వచ్చే అధికారులు కొద్ది రోజుల పాటు నివాసం ఉండేందుకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. గత కొన్నేళ్ల కాలంగా జిల్లా పరిషత్ అధికారులు గానీ, స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు గానీ ఈ అతిథి గృహాన్ని పట్టించుకోకపోవడంతో గొడౌన్లు చెత్తా చెదారంతో నిండి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. గతంలో స్థానిక శాసన సభ్యులైన దివంగత వడ్డి వీరభద్రరావు కృషి ఫలితంగా 1986లో అతిథి గృహానికి నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణ పనులు చేపట్టడంతో ఇందుకు అవసరమైన ఫర్నీచర్‌ను కూడా సమకూర్చారు.
చుట్టూ ఆక్రమణలే..
ట్రావెల్స్ బంగ్లాకు ఆనుకుని ఉన్న ప్రహరీ గోడను ఆనుకుని ఎవరికి వారు ఇష్టానుసారంగా పక్కా గృహాలు నిర్మించినప్పటికి అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా బంగ్లాను ఆనుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు చెత్తాచెదారాలను లోపల పోస్తుండడంతో అసాంఘిక కార్యకలాపాలు, విషసర్పాలు, చెత్తకుప్పలకు నిలయంగా దర్శనమిస్తోంది.
శుభకార్యాలకు అనువుగా చేస్తే..
గ్రామంలో అందరికి అనువుగా ఉన్న అతిథి గృహానికి సంబంధిత అధికారులు కొద్దిపాటి మరమ్మతులు చేపట్టి, నీటి వసతి కల్పించి సామాన్య, మధ్యతరగతి ప్రజలు శుభ కార్యాలు ఏర్పాటు చేసుకునే విధంగా రూపొందిస్తే అందరి మేలు చేకూరుతుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.