Share News

స్వగృహమస్తు!

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:52 AM

పేదింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. వీరి సొంతింటి కలను తీర్చేందుకు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరి స్తోంది.

స్వగృహమస్తు!

సొంతింటి కోసం దరఖాస్తులు

ఉమ్మడి తూ.గో. జిల్లాలో వెల్లువ

ఇప్పటి వరకు 23,359 దరఖాస్తులు

95 శాతం సొంతస్థలం ఉన్నవారే

సచివాలయాల ద్వారా స్వీకరణ

ఈ నెలాఖరు వరకు ఛాన్స్‌

తహశీల్దార్ల ద్వారా పొజిషన్‌ సర్టిఫికెట్‌

ఈ నెల 10 నుంచి వడపోత

లబ్ధిదారుకు రూ.2.50 లక్షలు

గతంలో ఇళ్లు పొందితే ఏరివేత

సొంత స్థలం లేనివారికి స్థలం

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

పేదింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. వీరి సొంతింటి కలను తీర్చేందుకు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరి స్తోంది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నా రు. దీంతో ఇప్పటి వరకు 23,359 మంది దరఖాస్తులు గృహనిర్మాణశాఖకు చేరాయి. గడువు ముగియనున్న ఈ నెలాఖరునాటికి మరో పది వేల వరకు వినతులు రావొ చ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా కాకినాడ జిల్లాలో 18 వేలు, తూర్పు గోదావరి జిల్లాలో 10,559, కోనసీమ జిల్లాలో 4,800 వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఈ నెల 10వ తేదీ నుంచి వడపోత పోయడానికి గృహ నిర్మాణశాఖ కసరత్తు ప్రారంభిం చింది. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్ల లబ్ధిదారులుగా ఉన్నట్టు తేలితే అర్హుల జాబితా నుంచి తప్పించనున్నా రు. వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 95 శాతం మందికిపైగా సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారే. ఈ నేపథ్యంలో వీరికి సొంత స్థలాలు ఉన్నట్టు నిర్ధారించేలా ఆయా మండలాల తహశీల్దార్ల నుంచి గృహనిర్మాణశాఖ అధికారులు పొజిషన్‌ సర్టిఫికెట్లు సేకరిస్తున్నారు. మరో పక్క లబ్ధిదారులుగా ఎంపికైన వారి సొంతింటి నిర్మాణా నికిప్రభుత్వం రూ.2.50 లక్షలు మంజూరు చేయనుంది.

నాడు పేదల పేరు..దోపిడీ జోరు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత వైసీపీ ప్రభు త్వం జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పేదలను నిలువునా ముంచేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.06 లక్షల మందిని పేదల ఇళ్లస్థలాలకు అర్హులుగా గుర్తించింది. వీరందరికి 7,610 ఎకరాలు అవసరమవుతాయని నిర్దారించారు. ఇందులో రెండు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగిలిన 5,610 ఎకరాల ప్రైవేటు భూములను రూ.2,200 కోట్లకుపైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో పేదల ఇళ్లస్థలాలకు అనువైన ప్రాంతాలు కాకుండా కేవలం స్థానిక అధికార పార్టీ నాయకులకు ఆర్థికంగా కలిసి వచ్చే ప్రాంతాలను గుర్తించి వాటిని అధిక ధరలకు కొనుగోలు చేశారు. ఆయా స్థలాల్లో అధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,540 వరకు లేఅవుట్లు వేశారు. ఇందులో వెయ్యికిపైగా లేఅవుట్ల వరకు వర్షాలకు నిండా మునిగిపోయేవే. 150 ఎకరాల కరప సెంట్రల్‌ లేఅవుట్‌ దగ్గర నుంచి, జగన్‌ ప్రారంభించిన కొమరగిరి లేఅవుట్‌, రాజమహేంద్రవరానికి సమీపంలోని ఆవభూములు ఇలా చాలా వరకూ పనికిరాని లేఅవుట్లు వేశారు. వీటిలోనే లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది.అయినా ఆ లేఅవుట్లలో స్థలాలు మాకొద్దంటూ పేదలు బీష్మించ డంతో లక్షలాది స్థలాలు ఖాళీగా ఉండిపోయాయి. ఇన్ని చేదు అనుభవాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు కదులుతోంది. దానిలో భాగంగా సొంతిళ్లు కట్టుకోవాలనుకునే లబ్ధి దారులకు ఆర్థికంగా సాయం అందించేందుకు సచివా లయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది.తొలుత సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపింది. సొంత స్థలం లేనివారికి స్థలం సేకరించి ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది.

ఇప్పుడు ఎక్కువ మంది వారే..

కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సచివాలయాల ద్వారా అధికా రులు సొంతింటి కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబరు చివరలో ప్రారంభించిన ఈ దరఖాస్తుల స్వీక రణ ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 23,359 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 18 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1,700 మంది వివిధ మునిసిపాలిటీల పరిధిలో దరఖాస్తు చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 10,559 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా నల్లజర్ల మండ లంలో 2,396 మంది,గోపాలపురం 1,143, రాజానగరం మండలంలో 1,060 మంది చొప్పున దరఖాస్తు చేసుకు న్నారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 4,800 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఛాన్స్‌ ఉండడంతో మరో పది వేల వరకు దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 95 శాతం మంది సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారే.ఈ నేపథ్యంలో వీరికి సొంత స్థలం ఉన్నట్టు ఆయా మండలాల తహశీల్దార్లతో పరిశీలించి పొజిషన్‌ సర్టిఫికెట్‌ను అధికారులు తీసుకుంటున్నారు.ఇప్పటికే సగం దరఖాస్తులకు సంబంధించి ప్రక్రియ ముగిసింది.

10 నుంచి యాప్‌ వివరాలు..

ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించిన యాప్‌లో ఈనెల 10 నుంచి అధికారులు వివరాలు నమోదు చేయనున్నారు. గతంలో వీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభుత్వం నుంచి స్థలం లేదా ఇళ్లు పొంది ఉన్నారా?లేదా?అనేది గుర్తిం చనున్నారు. ఒకవేళ పాత లబ్ధిదారుడైతే అర్హుల జాబితా నుంచి తొలగించనున్నారు.మరో పక్క అర్హుల జాబితాకు సంబంధించి వడపోత పూర్తయితే వాటిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్‌ వెబ్‌సైట్‌, పట్టణం, గ్రామీణ ప్రాంతం విభాగంలో అప్‌లోడ్‌ చేయనున్నారు. లబ్ధిదారుడు పథ కానికి అర్హత సాధిస్తే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలు మంజూరు చేయనుంది. ఇందులో కేం ద్రం వాటా రూ.1.50 లక్షలు. ఈ నేపథ్యంలో ప్రతి దర ఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సొం తింటి స్థలం లేని పేదల దరఖాస్తులను సైతం అధికా రులు పరిశీలిస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను బట్టి ఎంత భూమి సేకరించాల్సి ఉంటుందనే దానిపై అంచ నాకు వచ్చి స్థల సేకరణపై దృష్టిసారించనున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:52 AM