గాడ్ 89వ జన్మదిన వేడుకలు ప్రారంభం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:40 PM
వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ 89వ జన్మదిన వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి

రాయవరం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ 89వ జన్మదిన వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గాడ్ కుమార్తె గాదే సత్య వెంకట కామేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలుత తమిళనాడులోని అరుణాచలం వేద పండితులతో అపితకుచాంబదేవి సమేత అరుణాచల్వేరస్వామికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ జరిపి అమ్మవారికి స్వామివారికి అష్టోత్తర నామాలతో పుష్పార్చనలు, నీరాజన మంత్రపుష్పాలు, మహానివేదన జరిపారు. పీఠాధిపతి గాడ్ భక్తులనుద్ధేశించి మాట్లాడుతూ అరుణాచల్వేశరస్వామిని దర్శించడం వల్ల కలిగే శుభాలు, అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలిపారు.
ఘనంగా అరుణాచల్వేరుడి కల్యాణం: అరుణాచల్వేరస్వామి, అపితకుచాంబ అమ్మవార్ల కల్యాణం వేద పండితులు జరిపారు. కల్యాణంలో భాగంగా తొలుత వినాయకపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుపర్క సమర్పణ కన్యాదానం, యజ్ఞోపవీతం, మాంగల్యధారణ, తలంబ్రాలు కార్యక్రమాలు నిర్వహించి కల్యా ణాన్ని జరిపారు. అనంతరం విజయదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన చేశారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదే భాస్కరనారాయణ, కామేశ్వరి దంపతులు, బలిజేపల్లి రమ, పెదపాటి సత్యకనకదుర్గ, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఆధ్యాత్మికవేత్త కోట సునిల్‌కుమార్, పీఆర్వో బాబి భక్తులు పాల్గొన్నారు.