గంజా..ఏదీ పంజా!
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:44 AM
హత్య జరిగిందంటే.. ఆధారాలు లభించకపోయినా పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తారు.. కనిపెట్టేస్తారు.. హంతకుడిని కటకటాల్లోని నెట్టేస్తారు.. అయితే గంజాయి ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో పోలీసులందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.. అయినా అరికట్టలేకపోతున్నారు..

తూర్పును కమ్మేస్తున్న గంజాయి పొగ
రైలులో యువతతో తరలింపు
బ్యాక్ బ్యాగ్‌లలో గంజాయి
ఏజెన్సీ టూ హైదరాబాద్
పండగలో భారీ వినియోగం
బరుల వద్ద విక్రయాలు
పల్లెలకూ పాకిన వైనం
కన్నెత్తిచూడని నిఘా శాఖ
అడపాదడపా మాత్రమే కేసులు
రెచ్చిపోతున్న మాఫియా
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
హత్య జరిగిందంటే.. ఆధారాలు లభించకపోయినా పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తారు.. కనిపెట్టేస్తారు.. హంతకుడిని కటకటాల్లోని నెట్టేస్తారు.. అయితే గంజాయి ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో పోలీసులందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.. అయినా అరికట్టలేకపోతున్నారు..
రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, కొవ్వూరు, నిడదవోలు వంటి ప్రధాన పట్టణాల్లోనూ గంజాయి ఎక్కడ లభిస్తుందనేది బహిరంగ రహస్యం.. అయినా దాడులు మాత్రం అంతంత మాత్రమే.. అవసరమైన సమయంలో మాత్రమే దాడులు చేస్తారు... కేసులు నమోదు చేస్తారు. ఎందుకంటే కేసులకూ ఒక లెక్క ఉంటుంది మరి..
ఈసారి సంక్రాంతి పండుగలో మందు.. సారాతోపాటు మరొకటి చేర్చారు.. అదే గంజాయి.. ఎప్పటి నుంచో గంజాయి వినియోగం ఉన్నా ఈ ఏడాది మాత్రం విచ్చలవిడిగా మారింది.. కోడి పందాల బరుల వద్ద గంజాయి విక్రయాలు సాగాయి. అయినా ఏ ఒక్కరూ అటు వైపు చూసిన దాఖలాలు లేవు. అసలు గంజాయి ఎలా రవాణా జరుగుతుందంటే పోలీసులు మాకేం తెలుసు అంటారు.. బయట జనాలకే తెలిసింది.. రక్షణాధికారులకు తెలియకపోవడం విడ్డూరమే కదా మరి.. ఇటీవల కూటమి ప్రభుత్వం ఈగల్ టీమ్‌లను నియమించింది.. ఆ టీమ్ ఎంతవరకూ అరికడుతుందో చూడాల్సిందే..
ప్రశాంతమైన ‘తూర్పు’ను గంజాయి పొగ కమ్మేస్తోంది. యువత ఆ మత్తులో జోగుతూ రెచ్చిపోతోంది. రాత్రివేళ మరీ పేట్రేగిపోతోంది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతో సహా నిడదవోలు, కొవ్వూరు, అమలాపురం వంటి పట్ట ణాల్లో గంజాయి వినియోగం విజృంభిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు గంజాయిని అరికట్టాలని పోలీసు లపై ఒత్తిడి తెస్తున్నారు. గంజాయి నిర్మూలిం చండి మహాప్రభో అంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎస్పీకి విన్నవించా రంటే పరిస్థితి ఎంత చేయిదాటిందో అర్థం చేసు కోవచ్చు. తాజాగా రాజమహేంద్రవరం, రాజా నగరం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో గంజా యి పట్టుబడడమే దీనికో ఉదాహరణ. ఈ ఏడా ది సంక్రాంతి పండుగలో కోడి పందాల బరుల వద్ద విచ్చలవిడిగా గంజాయి విక్రయాలూ సాగా యి. గతంలో ఎన్నడూ ఇలా సంక్రాంతి సమ యంలో గంజాయి విక్రయాలు జరిగిన సంద ర్భాలు లేవు. ఇప్పటికే చాపకింద నీరులా ఆవ హిస్తున్న గంజాయి మరింత బలంగా పాతుకు పోయే పరిస్థితి కానరావడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో గంజాయి సరుకు గ్రామాల్లోనూ అం దుబాటులో ఉండడంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
స్టూడెంట్ల ముసుగులో..
హైవేల గుండా వాహనాల్లో దూర ప్రాంతా లకు చేరుతుంటే.. రాజమహేంద్రవరం, సామ ర్లకోట, తుని, అన్నవరం రైల్వే స్టేషన్ల గుండా విజయవాడ, హైదరాబాద్‌లోని పబ్‌లకు వారానికి నాలుగైదుసార్లు గంజాయి రవాణా జరుగుతున్నట్టు సమాచారం. దీనికి స్టూండెట్ల మాదిరిగా కనిపించే కుర్రాళ్లను ఎంచుకుంటు న్నారు. వాళ్లు వీపునకు తగిలించుకొనే బ్యాక్ ప్యాక్ బ్యాగులో కింద అర మాదిరిగా ఏర్పా టు చేస్తారు. సెల్‌ఫోన్ బాక్సుల్లో గంజాయి పెట్టి ఆ అరల్లో ఉంచుతున్నారు. ఈ వ్యక్తులు రైలు వచ్చే సమయానికంటే ముందే రైల్వే స్టేషనుకు చేరుకుంటారు. స్టూడెంట్ల మాది రిగా తచ్చాడుతూ రైలు వచ్చే ప్లాట్‌ఫామ్‌కి అవతల వైపున.. అంటే ఒకటో నంబరు ప్లాట్ ఫామ్‌కి రైలు వస్తుందంటే రెండో నెంబరు ప్లాట్‌ఫాంపై తిరుగుతుంటారు. రైలు ఒకటో నెంబరు ప్లాట్‌ఫాంకి చేరుకునే సమయంలో అటువైపు నుంచి బోగీలోకి ప్రవేశిస్తారు. కొం దరికి రిజర్వేషన్లు ఉంటే.. మరికొందరు జనరల్ బోగీల్లో వెళుతున్నారు. బోగీలో కూడా వీళ్లు ఒకచోట కూర్చుని బ్యాగును మరో చోట పెడతారు. ఇలా చేరిస్తే రవాణా చార్జీలు కాకుండా రూ.3-5 వేలు గిట్టుబాటవుతుందని చెబుతున్నారు. రైళ్లలో తనిఖీలు నెమ్మదించ డంతో గంజాయి రవాణా మరీ సులభంగా సాగిపోతోందని తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న పబ్‌కి రాజమండ్రి రైల్వే స్టేషను నుంచే గంజాయి సరఫరా అవుతుండ డం ఒక ఉదాహరణ మాత్రమే. ట్రావెల్స్ బస్సుల్లోనూ గంజాయి తరలిస్తున్నారు.
గంజాయి వస్తుందిలా..
ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మంచంగిపుట్ట, పాడేరు, అరకు, చింతపల్లి, పెదబ యలు, జి.మాడుగుల, హుకుంపేట, సీలేరు తది తర మండలాల్లోని దాదాపు 50 పంచాయతీల పరిధిలో 200 వరకూ గ్రామాల్లో సాగుచేస్తున్న గంజాయి 25 వేల ఎకరాల పైమాటే. మన్యంలో రూ.2 వేల కోట్ల వరకూ ఏడాదికి వ్యాపారం జరుగుతుందని అంచనా. గ్రామాల్లో కిలో రూ.2 వేల నుంచి ప్రారంభమ వుతుంది. నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. పాడేరు, చింతపల్లిలో రూ.5 వేలు, నర్సీపట్నంలో రూ.10 వేలు పలుతోంది. చింతపల్లి నర్సీపట్నం, తుని గుండా హైవేకు.. నర్సీపట్నం, కాకరపాడు, రాజవొమ్మంగి, ఏలేశ్వరం, ఎర్రవరం దగ్గర హైవేకు అక్కడి నుంచి రాజానగరం మీదుగా రాజమండ్రికి.. ఇటు సీలేరు, డొంకరాయి, చిం తూరు, మారేడుమిల్లి, రంపచోడవరం, రాజ మండ్రికి ఏడాది పొడవునా సరఫరా జరుగు తుంది. చెన్నై, ఢిల్లీ, రాజస్థాన్, కర్నాటక, ఒడిశా వంటి ప్రాంతాలకు చేరిస్తే కిలోకి రూ.50 వేలు, హైదరాబాద్‌లో అప్పగిస్తే రూ.25 వేలుకిస్తారు.
నిద్దరోతున్న నిఘా వ్యవస్థ
ఉమ్మడి తూర్పుగోదావరిలో గంజాయిపై ఉక్కుపాదం మాటలా ఉంచితే, కొంతకాలంగా సోదాలు కానరావడం లేదు. హైవే పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లు వాహన తనిఖీలు వదిలే శాయి. ఎక్కడో మారుమూల ఏజెన్సీలో సాగు చేస్తున్న గంజాయి నగరాలకు రావడం పరిపా టిగా మారింది. గ్రామాల్లోనూ గం‘జాయ్’ పొగ దట్టంగా మారింది. సుమారు గ్రాము గంజా యిని రూ.500కి విక్రయిస్తున్నారు. ప్రధానంగా నగరాల్లో పరిసర గ్రామాలకు చేరుకుంటున్న గంజాయి.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. ఇంత జరుగుతున్నా పోలీస్ నిఘా (ఎస్‌బీ)కు ఎందుకు వాసన రావడం లేదనే ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమవుతోంది.
గత ఐదేళ్లలో ఇదీ తీరు..
ఇక వైసీపీ ప్రభుత్వంలోనే గంజాయి విశృంఖ లమైంది. ఉమ్మడి జిల్లాలో 2019లో 27 కేసులు నమోదుకాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన త ర్వాత 2020లో 29, 2021లో 48, 2022లో ఏకం గా 84, 2023లో 69 కేసులు నమోదయ్యాయి. 2024లో 75 కేసులు పెట్టారు. ఐదేళ్లలో గంజా యి వినియోగించేవాళ్లు 209, విక్రయదారులు 483, సరఫరాదారులు 623 మంది కలిపి మొ త్తం 1315పై కేసులు నమోదుచేయగా, 1116 మందిని ఆరెస్టు చేశారు. ఇంకా 199 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. వీళ్లలో 2019లో కేసులు నమోదైనవాళ్లు 19 మంది ఉన్నారు. 2019 నుం చి 2024 నవంబరు వరకు 27,137 కిలోల గం జాయి, 212 వాహనాలు స్వాధీనం చేసుకు న్నా రు. నేర నిరూపణ కాక ఇద్దరు విడుదలయ్యారు. ఒక్కరికీ శిక్ష పడలేదు. 133 మంది నిందితులను అసలు గుర్తించలేక పోయారు. జైలులో గంజా యి కేసుల్లో మగ్గుతున్న వారిలో అత్యధికం గిరి పుత్రులే. ఒక్క సెంట్రల్ జైలులోనే 600 మంది దాకా గంజాయి కేసులపై నిందితులే ఉంటారు.
‘ఈగల్’తో సాధ్యమేనా!
గంజాయి తదితర నిషేధిత మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్ మెంట్(ఈఏజీఎల్‌ఈ-ఈగల్)ని ఏర్పాటుచేసిం ది. దీనికి సమర్థవంతమైన అధికారిగా పేరు న్న ఆకే రవికృష్ణను ఐజీగా నియమించడంతో పాటు 1972 టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసింది. ఒకే ఈగల్ పోలీస్ స్టేషను ఉన్నప్ప టికీ రాష్ట్రమంతా దీని పరిధిలోకి వస్తుంది. ప్రతి జిల్లాలోనూ ఈగల్ టీం ఉంటుంది. రాజమహేంద్రవరంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు. ఈగల్ విధివిధా నాలపై ఇటీవలే హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ గంజాయి పొగ పోలీసు లకు తెలియకుండా ఉంటుందా?... అయినా ఇప్పుడు ఈగల్ టీమ్‌కి స్థానిక పోలీసులు ఎంతవరకూ సహకరిస్తారనే అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ ఆ టీమ్‌లో స్థానిక పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది ఉంటే ఉద్దేశం నీరుగారక తప్పదనే విమర్శలు వినవస్తున్నాయి.