కిలోతో పట్టుబడినా.. పదేళ్లు!
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:38 AM
గంజాయి కేసులో చిక్కితే జీవితం కటకటాల పాలే.. బయటకు వచ్చేదారుండదు.. బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అంతలా చట్టాలను కట్టుదిట్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన నాటి నుంచే గంజాయి నిర్మూ లన దిశగా యుద్ధం మొదలుపెట్టింది.
మరింత కఠినంగా చట్టం
ఎన్‌డీపీఎస్ యాక్ట్ కట్టుదిట్టం
20 కిలోలు దాటితే 20 ఏళ్లు
చిక్కితే నిదాన్‌లో నమోదు
పాస్ పోర్టూ రాదు
సహాయం చేసినా 20 ఏళ్లు
కూటమి ప్రభుత్వ యుద్ధం
గంజాయిపై ఉక్కుపాదం
నిర్మూలన దిశగా చర్యలు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
గంజాయి కేసులో చిక్కితే జీవితం కటకటాల పాలే.. బయటకు వచ్చేదారుండదు.. బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అంతలా చట్టాలను కట్టుదిట్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన నాటి నుంచే గంజాయి నిర్మూ లన దిశగా యుద్ధం మొదలుపెట్టింది. ‘ఈగిల్’ పేరుతో ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసింది. గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు మాత్రం తూర్పువే.. ఎందుకంటే గంజాయి ఎక్కువగా సాగయ్యేది తూర్పు ఏజెన్సీలోనే.. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు.. కేసుల్లో నిందితులుగా ఉన్నవారు మన జిల్లాకు చెందిన వారే ఎక్కువ.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే గంజాయి కేసుల్లో చిక్కిన 400 మంది వరకూ ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఎన్‌డీపీఎస్ యాక్ట్ ఉన్నా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.. గంజాయి కేసులో చిక్కినా బెయిల్‌పై బయటకు వచ్చేసి తిరుగుతున్నారు.. ఇక నుంచి అలా కుదురదు.. గంజాయి కేసులో చిక్కితే జీవితం జైలుకే.. ఒక నెలో.. రెండు నెలలో కాదు.. 20 కిలోల లోపు గంజాయితో పట్టుబడినా 20 ఏళ్లు తప్పదు.. ఇప్పటికే ఈ చట్టం కింద అనకాపల్లి జిల్లా న్యాయస్థానం 20 కిలోల గంజాయి రవాణా కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇటీవల ఓ స్మగ్లరు గంజాయి అక్రమ వ్యాపారంలో కూడబెట్టిన రూ.2 కోట్ల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది.రెండు కేసుల్లో నిందితులుగా ఉంటే మరణదండనే..అదనపు ఆదాయానికి ఆశపడి గంజాయి కేసులో చిక్కారో.. ఇక జీవితం అంతే.. తస్మాత్ జాగ్రత్త! మరో వైపు నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్(ఎన్‌డీపీఎస్) అత్యంత పదునైన చట్టం. దీంతో గంజాయి కేసు ల్లో మరణ దండన విధించే అవకాశం ఉంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
దొరికితే జీవితానికి పొగ
గంజాయి కేసులు ఎన్‌డీపీఎస్ చట్టం పరిధి లోకి వస్తాయి. గంజాయి ఇతర నిషేధిత మాద కద్రవ్యాల సాగు, విక్రయించడం, కొనుగోలు, రవాణా,కాల్చడం(వినియోగం),నిల్వ..ఇవన్నీ ఎన్ డీపీఎస్ చట్టం కిందకే వస్తాయి. గంజాయి కేసు ల్లో ఎన్‌డీపీఎస్ చట్టం ద్వారా పట్టుబడిన పరి మాణాన్ని బట్టి కఠినమైన శిక్షలు ఉంటాయి. బెయిల్ రాకపోవడమే కాకుండా శిక్షను పూర్తిగా అనుభవించాల్సిందే.శిక్ష ఖరారైన ఖైదీకి ఎట్టి పరి స్థితుల్లోనూ క్షమాభిక్ష ఉండదు.సాధారణంగా ఏ కేసులోనైనా నేరాన్ని పోలీసులు, ప్రాసిక్యూషన్ రుజువు చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్‌డీపీఎస్ కేసులో తాను నేరం చేయలేదని నిందితుడే నిరూపించుకోవాలి. తెలిసి చేసినా,తెలియక చేసి నా విష వలయంలో చిక్కు కున్నట్టే.ఈ కేసుల్లో ఒక్కసారి చిక్కితే కేంద్ర హోంశాఖ నిర్వహించే నేషనల్ ఇంటి గ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టెడ్ నార్కో-అఫెండర్స్ (నిదాన్) పోర్టల్‌లో పేరు నమోదవుతుంది. ఆ జాబితాలో ఉన్న వాళ్లకు పాస్‌పోర్ట్ జారీ చెయ్యరు. అంటే దేశం దాట డానికి లేకుండా గేట్లు మూసేసినట్టే.
కూటమి యుద్ధం ఇలా
గంజాయిపై యుద్ధానికి కార్యాచరణకు కూట మి ప్రభుత్వం ఇప్పటికే యాంటీ నార్కొటిక్ టాస్క్‌ఫోర్స్(ఏఎన్‌టీఎఫ్) అవసరమైన సిబ్బంది, సంపత్తితో రంగంలోకి దిగింది. కేంద్ర ఇంటె లిజెన్స్ బ్యూరో పని చేసి సమర్థవంతమైన అధి కారిగా గుర్తింపు తెచ్చుకున్న ఐజీ ర్యాంకు అధి కారి ఆకే రవికృష్ణను ఏఎన్‌టీఎఫ్ అధిపతిగా నియమించింది. మత్తు పదార్థాల నిల్వ, స్మగ్లింగ్, విక్రయాలతో పాటు గంజాయి సాగు, సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తోంది. టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి అందజేసే ఏర్పాటు చేసింది. జిల్లాలో నలుగురితో ఈగిల్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే వారికి ఆఫీసు పెట్టాల్సి ఉంది.
రెండు కేసుల్లో రుజువైతే మరణశిక్ష
కిలో నుంచి 20 కిలోల లోపు గంజాయితో పట్టు బడితే పదేళ్ల వరకూ జైలు, జరిమానా తప్పదు. అంతకంటే ఎక్కువ పరిమాణంలో దొరికితే 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష, కనీసం రూ.లక్ష జరిమానా విధిం చే అవకాశం ఉంటుంది.రెండు సార్లు అంతకు మిం చిన కేసుల్లో దోషిగా రుజువైతే 30 ఏళ్ల వరకూ జైలు శిక్ష లేదా మరణ దండన కూడా విధించ వచ్చు. గంజాయి సాగు, రవాణాకు సహాయం చేసినా 20 ఏళ్ల శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే.గంజాయి ఉత్పత్తి, వ్యక్తి దగ్గర ఉండ డం, నిల్వ చేయడం, రవాణా, వినియోగం, అం దుకు ప్రయత్నించడం ప్రేరేపించడం అన్నీ నేరాలే.
గతేడాది 65 కేసులు..
తూర్పుగోదావరి జిల్లా పోలీసులు గతే డాది 65 కేసుల్లో 195 మందిని అరెస్టు చేసి సుమారు 3 వేల కిలోల గంజా యిని స్వాధీనం చేసుకున్నారు.ఈ ఏడాది ఇప్పటి వర కూ 4 కేసుల్లో 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 22 మందిని నిందితులుగా గుర్తించగా 21 మందిని అరెస్టు చేశారు.సరఫరా చేసిన వాడిని అరెస్టు చేయాల్సి ఉంది.మిగిలిన రెండు జిల్లా ల్లోనూ పరిస్థితి కాస్త అటూ ఇటూగా ఉంది. ఎక్కువగా తూర్పు నుంచే రవాణా ఉంటుంది.
ఏవోబీ నుంచి వచ్చేదెలా!
ఈ నెల 4న కొవ్వూరులో 10కిలోల గంజా యితో నలుగురు యువకులు అరెస్టు అయ్యారు. ఈ ఘటన జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టలేదని రుజువు చేస్తోంది. ఎక్కడో దండ కారణ్యంలో సాగవుతున్న గంజాయి ఫారెస్టు, పోలీస్, ఎక్సయిజ్ వాళ్ల కళ్లుగప్పి పట్టణాలు, గ్రామాలకు చేరుతోంది. దీనికి ప్రధాన కారణం ఆయా శాఖల్లోని కొందరు సిబ్బంది లోపాయి కారిగా గంజాయి రవాణాకు సహకరిస్తుండడమే అనే అనుమానాలు ఉన్నాయి. అటవీ సంపద అక్రమంగా తరలిపోకుండా ఏజెన్సీ మండ లాల్లో ఫారెస్ట్ చెక్‌పోస్టులు మండలానికి సుమారు 15 వరకూ ఉంటాయి. మారేడుమిల్లి, రాజవొమ్మంగి, చింతూరు, జడ్డంగి తదితర పోలీస్ స్టేషన్లు రోడ్డు పక్కనే చూస్తుంటాయి. కానీ అరకొర తప్ప భారీ తరలింపులు వాటికి కనిపించవు. గతంలో గంజాయి రవా ణాకు సహరిస్తున్న చింతూరు ఎస్‌ఐ, కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యా రు.పోలీసులు చూసీ చూడనట్టు వదిలే యడా నికి ‘ఒప్పందాలు’ంటాయని సమాచారం.
సెంట్రల్ జైలులో 400 మంది
గంజాయి దందాలో అమాయక గిరిజనం జీవి తాలు చిత్తవుతున్నాయి.గతంలో ముగ్గురు అమాయక గిరిజన మహిళలు గంజాయితో రాజమహేంద్రవరంలో ఎస్‌ఈబీ పోలీసులకు పట్టుబడ్డారు. కనీసం వారి కాళ్లకు చెప్పులు కూడా లేవు.ఆ గంజాయిని విజయవాడలో అప్పగిస్తే రూ.2 వేలు చొప్పున ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. గంజాయిని తరలించే క్రమంలో అనుమానం రాకుండా ఉండ డానికి మహిళలను రంగంలోకి దింపుతున్నారు. మరో వైపు అమాయక గిరిజనులు పోలీసులకు పట్టు బడుతూ జైళ్లలో మగ్గిపోతున్నారు. రాజ మహేంద్రవరం సెంట్రల్ జైలులో గంజాయి కేసుల్లో 55 మంది శిక్ష అనుభవిస్తుండగా.. 357 మందిపై న్యాయస్థానంలో విచారణ జరుగు తోంది.వీరిలో అధిక శాతం గిరిజనులే ఉన్నారు. అయితే ఎన్‌డీపీఎస్ చట్టంపై గిరిజన గ్రామా ల్లో అవగాహన కల్పించకపోవడం,సరైన నిఘా లేకపోవడం వంటివి గిరిజనుల పాలిట శాపం గా మారుతున్నాయనే వాదన ఉంది.