ప్రమాదంలో..అడవి!
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:20 AM
అడవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా కనీసం కన్నెత్తి చూసేవారే లేరు. ఒక పక్కన అడవి ఆక్రమణలు.. మరో పక్కన సారాబట్టీలు.. ఇంకో పక్కన వ్యభి చార కార్యకలాపాలు సాగుతున్నా కనీసం కట్టడి చేసే వారే కరువయ్యారు..

జిల్లా కేంద్రంలోనే రిజర్వు ఫారెస్టు
చుట్టూ అధికార యంత్రాంగం
అయినా కన్నెత్తి చూసేవారే లేరు
నిత్యం వ్యభిచార కార్యకలాపాలు
సారా బట్టీలకు అడ్డా
ఇటీవలే అగ్ని ప్రమాదం
జిల్లా చుట్టూ వేలాది ఎకరాలు
అయినా రక్షణ చర్యలు నిల్
రాజానగరం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : అడవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా కనీసం కన్నెత్తి చూసేవారే లేరు. ఒక పక్కన అడవి ఆక్రమణలు.. మరో పక్కన సారాబట్టీలు.. ఇంకో పక్కన వ్యభి చార కార్యకలాపాలు సాగుతున్నా కనీసం కట్టడి చేసే వారే కరువయ్యారు..జిల్లా కేంద్రం కావడంతో అటవీ శాఖలు చుట్టూ ఉన్నా.. పక్క జిల్లా కాకినాడలో అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉన్నా అడవిని రక్షించేవారే కానరావడంలేదు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఈ సీజన్‌లో ఇటువంటి ప్రమాదాలు సాధారణమేనని సాక్షాత్తూ అటవీ అధికారి కొట్టిపారేయడం తప్పనే వాదన వినిపిస్తోంది. ఈ అగ్ని ప్రమాదంపై స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. కావాలనే నిప్పు పెట్టారా లేక అనుకోకుండా జరిగిన తప్పిదమా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.ప్రమాదంపై విచారణ జరిపించి.. అటవీ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకత ఏంటంటే జిల్లా కేంద్రాన్ని ఆనుకుని అటవీ ప్రాంతం ఉండడం.. ఈ అటవీ ప్రాంతం చుట్టూనే ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అటవీ శాఖ అధి కారులకు కూతవేటు దూరంలోనే ఆ రిజర్వు ఫారెస్టు ఉంది. అధికార యంత్రాంగం చుట్టూ ఉన్నందుకు ఫారెస్టు పచ్చదనంతో కళకళ లాడుతూ ఉండాలి.పర్యవేక్షణ లేకపోవడంతో రిజర్వు ఫారెస్టు కాస్తా అసాంఘిక కార్యకలా పాలకు అడ్డాగా మారింది..ఇటీవల అటవీ ప్రాం తం దగ్ధం కావడంతో అందరి చూపు అడవిలో జరిగే కార్యకలాపాలపై పడింది. అటవీ అధికా రులు ఈ సంఘటన సాధారణమేనని కొట్టిపా రేసినా..నిప్పులేనిదే పొగ ఎక్కడ నుంచి వస్తుం దని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జోరుగా సారా బట్టీలు..
తూర్పుగోదావరి జిల్లా కేంద్రం దివాన్‌చెరువు రిజర్వు ఫారెస్టు సారా బట్టీల నిర్వహణకు అ డ్డాగా మారింది. ఫారెస్టును ఆనుకుని దివాన్ చెరువు,హౌసింగ్ బోర్టు కాలనీ, లాలాచెరువు, శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం, రఘునాథపురం, పి డింగొయ్యి, వెలుగుబంద, చక్రద్వారబంధం పరి సర గ్రామాలు, మామిడి, జీడిమామిడి పండ్ల తోటలతో పాటు రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఉన్నా యి.దీంతో జనసంచారం అంతగా లేకపోవ డం తో కొంతమంది సారా బట్టీల నిర్వహణకు అను వుగా మలచుకున్నారు.రాత్రి పగలు తేడా లేకుం డా సారా తయారు చేస్తున్నారు. సారాను ఇక్క డ నుంచి సుదూర ప్రాంతాలకు బాటిళ్లు, టిన్ను లు, కవర్లలో నింపి గుట్టు చప్పుడు కాకుండా యథే చ్ఛగా తరలిస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరం.. జాతీయ రహదారి పక్కనే ఉన్న అడవిని అడ్డాగా చేసుకుని భారీ స్థాయిలో సారా తయారీ సాగుతున్నా పోలీసులు ఫారెస్టు వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవ హారమంతా పోలీసుల కనుసన్నల్లో జరుగుతుం దని, మామూళ్లకు అలవాటుపడిన సారా బట్టీల నిర్వాహకులను ప్రోత్సహిస్తూ మత్తులో జోగు తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
వ్యభిచార స్థావరాలు..
దివాన్‌చెరువు రిజర్వు ఫారెస్టులో వ్యభిచార స్థావరాలు ఎక్కువగానే దర్శనమిస్తాయి. జాతీ య రహదారిని ఆనుకుని ఇరువైపులా ఫారెస్టు, పండ్ల తోటల్లో ఇతర ప్రాంతాలకు చెందిన కొం త మంది వ్యభిచారాలు సాగిస్తున్నారు. జాతీయ రహదారిపై వెళుతుంటే నిత్యం పదుల సం ఖ్యలో తారసపడతారు. రాజానగరం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్నా దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.వ్యభిచారుల వద్ద కు వస్తున్న విటులను కొంతమంది అప్పుడ ప్పుడు పోలీసులకు పట్టిస్తుంటారు. వీరిని పోలీ సులు భయబ్రాంతులకు గురిచేసి వీరి వద్ద ఉన్న నగదు,బంగారం దోచుకున్న సంఘట న లూ ఉన్నాయి.వ్యభిచార స్థావరాలు కొంత మం ది పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే ఈ స్థావరాలపై పోలీసులు దాడి చేసి న సందర్భాల్లేవు. వ్యభిచారం కోసం వెళ్లిన వారు స్మోకింగ్ చేసి పారేసిన సిగరెట్ వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఆక్రమణల్లో రిజర్వు ఫారెస్టు..
దివాన్‌చెరువు రిజర్వు ఫారెస్టు చుట్టూ ఆక్ర మణలే దర్శనమిస్తాయి. ఫారెస్టును ఆనుకుని పక్కా భవన నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఇటీ వల ఆటోనగర్ సమీప ప్రాంతంలో అడవి లో చెట్లను నరికేస్తున్నా అడిగేవారే లేరు. నగరానికి సమీపాన ఉండడంతో చుట్టూ పండ్ల తోటలతో పాటుగా మరికొన్ని చోట్ల పక్కా భవనాలు, జో రుగా సారా బట్టీలు పుట్టుకొస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. దీంతో అడవి ఆక్రమణలకు గురవుతోంది.
హైవేను ఆనుకుని 2 వేల ఎకరాలు
జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దివాన్ చెరువు రిజర్వు ఫారెస్టు ఆహ్లాదకర వాతా వరణం,పచ్చని ప్రకృతి సోయగాలతో వీక్షకు లను మైమరపించేలా ఉంటుంది. దాదాపు 845 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన రిజర్వు ఫారెస్టును 16వ నెంబరు జాతీయ రహదారి రెండు భాగాలు విభజించింది. దీనిలో ఈస్ట్ ఫారెస్టు 311 హెక్టార్ల విస్తీర్ణం, వెస్ట్ ఫారెస్టు మరో 534 హెక్టార్లు విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. సుమారు 2112.5 ఎకరాలు ఉం టుంది. ఈ ఫారెస్టులో జం తువులు అరు దు.దీంతో కొంతమంది అక్రమార్కులు అసా ంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మలుచు కుంటున్నారు.రాజమహేంద్రవరానికి చేరువ లో హైవేను ఆనుకుని ఇరువైపులా రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉండడంతో రిసార్టులు ఏర్పాటు చేస్తే టూరిస్టుల రాకతో ఈ ప్రాం తం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని..పుష్కరాల నేపథ్యంలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ దృష్టి సారించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పునకు నలుదిక్కులా రిజర్వు ఫారెస్టు ఇలా..
దివాన్‌చెరువు - 2 వేల ఎకరాలు
నల్లజర్ల - ద్వారకాతిరుమల - 3 వేల ఎకరాలు
గోపాలపురం మండలం - 2 వేల ఎకరాలు
గోకవరం మండలం - 18 వేల ఎకరాలు