నో ఫైవ్‌స్టార్
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:52 AM
విద్యా వ్యవస్థలో మార్పులు, సంస్కరణల పేరుతో గత వైసీ పీ ప్రభుత్వం చేపట్టిన విధానాలు ప్రభుత్వ పాఠశాలలను దీనస్థితిలోకి నెట్టాయి. విద్యార్థుల చదువులను గాలికొదిలేసి బైజూస్, టోఫెల్, సీబీఎస్‌ఈ అంతర్జాతీయ సిలబస్ అంటూ చేసిన ప్రయోగాలు విద్యాప్రమాణాలను దెబ్బతీశాయి. ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు అప్పగించడంతో విద్యార్థుల చదువు లు అటకెక్కాయి.

-స్టార్ రేటింగ్‌లో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలలు
-గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతో ఈ పరిస్థితి
-జిల్లాలో పది పాఠశాలలకు సున్నా రేటింగ్
కాకినాడరూరల్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థలో మార్పులు, సంస్కరణల పేరుతో గత వైసీ పీ ప్రభుత్వం చేపట్టిన విధానాలు ప్రభుత్వ పాఠశాలలను దీనస్థితిలోకి నెట్టాయి. విద్యార్థుల చదువులను గాలికొదిలేసి బైజూస్, టోఫెల్, సీబీఎస్‌ఈ అంతర్జాతీయ సిలబస్ అంటూ చేసిన ప్రయోగాలు విద్యాప్రమాణాలను దెబ్బతీశాయి. ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు అప్పగించడంతో విద్యార్థుల చదువు లు అటకెక్కాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కరువవడంతోపాటు కొంత మంది విద్యార్థుల్లో అభ్యసనా సామర్ధ్యాలు తగ్గాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన నివేదికలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. దీ ని ప్రకారం జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలకూ ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కకపోవడం గమనార్హమని పలువురు విద్యావేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
కాకినాడ జిల్లాలో 1280 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు 18, అభ్యసన సామర్ధ్యాలకు 14 సూచికలను ప్రామాణికంగా తీసుకుని వాటికి రేటింగ్ ఇవ్వగా రాష్ట్రంలో జిల్లా విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలోను, మౌలిక సదుపాయాలపరంగాను మె రుగైన స్థానంలో నిల్వలేదు. జిల్లాలోని ఏ పాఠశాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కకపోవడం శోచనీయం.
అభ్యసనంలో..
అకడమిక్‌పరంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, గతేడాది 10వ తరగతి ఫలితాలు, ఇటీవల నిర్వహించిన సమ్మేటివ్ అసెస్‌మెంట్ ఫలితాలు ఆధారంగా ఇచ్చారు. ఈ నాలుగు విభాగాల్లో హాజరుకు 40శాతం, ఫలితాలకు 60శాతం రెండూ కలిపి 90శాతం దాటిన పాఠశాలలకు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇచ్చారు. అంతకంటే తక్కువ ఫలితాలున్న పాఠశాలలకు 1 నుంచి 4 స్టార్లు కేటాయించారు. జిల్లాలో 67 పాఠశాలలు 3 స్టార్లు, 707 పాఠశాలలు 2 స్టార్లు, 496 పాఠశాలలకు ఒక స్టార్ రాగా, సున్నా స్టార్ రేటింగ్ పాఠశాలలు 10 ఉన్నాయంటే గత వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎంతమేర ప్రభావితం చూపాయో అర్థం చేసుకోవచ్చు.
ఫలితాలను గాలికొదిలేశారు
గత ప్రభుత్వం పాఠశాలలను ప్రచారానికి పూర్తిస్థాయిలో వాడుకుంది. విద్యార్థుల హాజరు, వారి పరీక్షల ఫలితాలను గాలికొదిలేసింది. ఉపాధ్యాయులకు మరుగుదొడ్ల ఫొటోల బాధ్యతలు అప్పగించి బోధన సమాయాన్ని తగ్గించింది. ఈ సమస్యపై అప్ప ట్లో ఉపాధ్యాయులు గగ్గోలుపెట్టి నాపట్టించుకోలేదు. పాఠశాలవిద్య అంటే నాడు-నేడు పథకం ఒక్కటే నా అన్నట్లు మార్చేసి ఫలితాలను దిగజార్చిందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మౌలిక సదుపాయాల్లో..
మూడు, నాలుగు తరగతి గదుల్లో అవసరమైన మంచి వాతావరణం, పాఠశాల ప్రహారీ ఎలక్ట్రికల్, సోలార్ పరికరాలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, గ్రంథాలయం, ఆటస్థలం, ఆర్వో వాటర్‌ప్లాంట్, అన్ని తరగతి గదులకు ఫర్నీచర్, పూర్తిస్థాయి పరికరాలతో ల్యాబ్‌లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కలిగిన తరగతి గదులు, వినియోగంలో ఉన్న స్మార్ట్ టీవీ, వంట గదులు, కిచెన్ గార్డెన్ ఇతర అంశాలను పరిశీలించారు. వాటిలోని ఒక్కో అంశానికి 5చొప్పున గ్రేడింగ్ ఇచ్చారు. వాటిలో 90 శాతం గ్రేడింగ్ సాధించిన పాఠశాలలకు 5స్టార్లు కేటాయించారు. 30 కంటే తక్కువ ఉంటే ఒక స్టార్ ఇచ్చారు. కాకినాడ జిల్లాలో 200 పాఠశాలలు 4స్టార్లు, 674 పాఠశాలలు 3 స్టార్లు, 383 పాఠశాలలు 2స్టార్లు, 21 పాఠశాలలు ఒక స్టార్, 2 పాఠశాలలు సున్నా స్టార్ సాధించాయి.