Share News

‘నిర్లక్ష్యం’పై వేటు!

ABN , Publish Date - Feb 19 , 2025 | 01:33 AM

రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగు రు డాక్టర్లు, ఐదుగురు కార్యాలయ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు విజయవాడలోని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

‘నిర్లక్ష్యం’పై వేటు!
ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సోమవారం హాజరుపట్టీ పరిశీలిస్తున్న మంత్రి సుభాష్‌

  • ఐదుగురు డాక్టర్లు, నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

  • విధుల్లో నిర్లక్ష్యానికి ప్రతిఫలం

  • రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ ఆసుపత్రి వైద్యులు, ఉద్యోగులపై చర్యలు

  • కార్మికశాఖ మంత్రి సుభాష్‌ ఆదేశాలతో కదలిన ఉన్నతాధికారులు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగు రు డాక్టర్లు, ఐదుగురు కార్యాలయ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు విజయవాడలోని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి సుభాష్‌ ఆదేశించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ తక్షణమే స్పందించి మంగళవారం ఈచర్యలు తీసుకున్నారు.

రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ ఆసుపత్రిని సోమవారం మంత్రి సుభాష్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సమయంలో కొందరు వైద్యులు, కార్యాలయ సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు. హాజరుపట్టీని ఆయన పరిశీలించారు. కొందరు డాక్టర్లు, కార్యాలయ సిబ్బంది హాజరు నమోదు చేసుకుని విధులు నిర్వర్తించకుండా ఆస్పత్రినుంచి వెళ్లిపోతున్నట్టు గుర్తించారు. అక్కడున్న మరికొందరు సరైన సమాధానం, సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి సుభాష్‌ తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. దీంతో విధినిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన డాక్టర్లు, సిబ్బందిపై వేటు పడింది. కాగా, దీనిపై విచారణ కొనసాగుతోందని, నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈఎస్‌ఐబీమా చందాదారులు, వారి కుటుంబీకులకు నాణ్యమైన వైద్యసేవలందజేసేందుకు కట్టుబడి ఉందని, రోగుల విషయంలో నిర్లక్ష్యం, క్రమశిక్షణారా హిత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

Updated Date - Feb 19 , 2025 | 01:33 AM