రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:28 AM
రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో కోనసీమ జిల్లా విద్యార్థులు ప్రాజెక్టుల రూపకల్పనతో సత్తా చాటారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఆరు ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచగా నాలుగు ప్రాజెక్టులు జాతీయస్థాయి ప్రదర్శనకు తొలిసారిగా ఎంపిక కావడం విశేషమని జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
అమలాపురం రూరల్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో కోనసీమ జిల్లా విద్యార్థులు ప్రాజెక్టుల రూపకల్పనతో సత్తా చాటారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఆరు ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచగా నాలుగు ప్రాజెక్టులు జాతీయస్థాయి ప్రదర్శనకు తొలిసారిగా ఎంపిక కావడం విశేషమని జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. విజయవాడ మురళీ రిసార్ట్స్‌లో బుధవారం రాష్ట్ర స్థాయి దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శనలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఉత్తమమైన 156 ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. ఈప్రాజెక్టుల్లో 35ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపిక చేయగా కోనసీమ జిల్లాకు చెందిన నాలుగు ప్రాజెక్టులు వాటిలో ఉన్నాయి. వ్యక్తిగత విభాగంలో జిల్లా నుంచి గోడి గురుకుల పాఠశాల విద్యార్థులు రూపొందించిన మేజిక్ అంబ్రెల్లా ప్రాజెక్టు, ఊబలంక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, సామూహిక విభాగంలో వన్నెచింతలపూడి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన మల్టీపర్పస్ టూల్ మిషన్, ఉపాధ్యాయ విభాగంలో తొండవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన వేస్ట్ టూ వెల్త్ ప్రాజెక్టులు ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు. ఈనాలుగు ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్టు సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వెంకటకృష్ణారెడ్డి, స్టేట్ నోడల్ సైన్స్ కోఆర్డినేటర్ నాగమణి ప్రకటించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. 85శాతం స్ర్టెకింగ్ రేటుతో అత్యధిక ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికై జిల్లాగా ఖ్యాతిని గడించినట్టు సైన్స్ అధికారి గిరజాల వీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. విద్యార్థులను కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్‌కలెక్టర్ టి.నిషాంతి, డీఈవో డాక్టర్ షేక్ సలీంబాషా అభినందించారు.