Share News

దామోదరం సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:40 AM

రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్యను ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా పనిచేయడంతో పాటు 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు.

దామోదరం సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి

అమలాపురం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్యను ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా పనిచేయడంతో పాటు 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసిన గొప్ప రాజకీయవేత్త మాత్రమే కాకుండా సాహితీవేత్తగా ఆయన చిరస్మరణీయుడని కొనియాడారు. దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంజీవయ్య చిత్రపటానికి జేసీ నిషాంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత నిరుపేద కుటుంబంలో పుట్టిన సంజీవయ్య పట్టుదలే పెట్టుబడిగా లా డిగ్రీని సాధించారన్నారు. తెలుగుభాషకు ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి, రాష్ట్రంలో భూ సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గాల్లో పనిచేసిన సంజీవయ్య స్మారకార్థం పాటిగడ్డ సమీపాన ఉద్యాన పార్కును అభివృద్ధి చేసి ఆయన పేరు పెట్టారన్నారు. విశాఖపట్నంలోని లా యూనివర్సిటీకి 2012లో దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీగా నామకరణం చేసినట్టు జేసీ వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు పి.శ్రీకర్‌, డి.అఖిల, పరిపాలనాధికారి కడలి కాశీవిశ్వేశ్వరరావు, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ, రమణకుమారి, ఎల్డీఎం కేశవవర్మ, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి, వికాస జిల్లా మేనేజర్‌ గోళ్ల రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:40 AM