కోకో గిట్టుబాటు ధరకు ప్రభుత్వ ప్రణాళికలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:27 AM
కోకో పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి మర్కెట్‌లో పలికే గిట్టుబాటు ధర క్షేత్రస్థాయిలో రైతుకు చేరే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలో కొబ్బరిలో కోకోను అంతర పంటగా అభివృద్ధి చేసి జిల్లాను కోకో హబ్‌గా తీర్చిదిద్దాలని రైతులకు ఆయన సూచించారు.

పి.గన్నవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కోకో పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి మర్కెట్‌లో పలికే గిట్టుబాటు ధర క్షేత్రస్థాయిలో రైతుకు చేరే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలో కొబ్బరిలో కోకోను అంతర పంటగా అభివృద్ధి చేసి జిల్లాను కోకో హబ్‌గా తీర్చిదిద్దాలని రైతులకు ఆయన సూచించారు. ముంగండలోని రైతులు కేవీ రమణ, ఖండవల్లి నాగేశ్వరరావు కొబ్బరి తోటలో కోకో పంటను ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న ధర క్షేత్రస్థాయిలో రైతుకు అందడంలేదని ధరలో వ్యత్యాసం ఉంటు ందన్నారు. దీంతో ప్రభుత్వమే కోకో పంటను అభివృద్ధి చేసి పంటను నిల్వచేసే విధంగా స్థానికంగా రైతులకు గోదాములు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు. సంబంధిత కంపెనీలే ప్రభుత్వం ఆధ్వర్యంలో నేరుగా పంట ఉత్పత్తులను గోదాములు నుంచి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. కోకో ఉత్పత్తులకు మార్కెటింగ్ డిమాండ్‌ను అనుసరించి గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఆ దిశగా కోనసీమలో అంతర పంటగా కోకోను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా కోకో విస్తీర్ణం ఎంత మేర ఉంది విశ్లేషించి సాగు విస్తీర్ణాన్ని అభివృద్ధి చేసే దిశగా అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆయన కోకో కాయలను పరిశీలించి ప్రాసెసింగ్ విధానాన్ని, చాక్లెట్ తయారీ అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన అధికారి కేవీ రమణ, తహశీల్దార్ పి.శ్రీపల్లవి, ఎంపీడీవో కేవీ ప్రసాద్, ఉద్యానవన అఽధికారి దిలీప్‌కుమార్, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, సర్పంచ్ కుసుమ చంద్రకళ, మాజీ ఎంపీపీ అంబటి భూలక్ష్మి, పెచ్చెట్టి వెర్రియ్య, సరెళ్ల అప్పారావు, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.