బరిలో కోడి
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:08 AM
సంక్రాంతి పర్వదినాల ముసుగులో జూద క్రీడల నిర్వహణకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ అధికార తెలుగుదేశం పార్టీ కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ప్రమేయంతో కోనసీమ జిల్లాలో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు వంటివి నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జూద క్రీడల నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు..
కోడిపందాలు, గుండాట, పేకాటలకు సర్వంసిద్ధం
‘షరా మామూళ్లగా’నే అధికార యంత్రాంగం
ప్రధాన రహదారుల చెంతనే పందెం బరులు
(అమలాపురం- ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి పర్వదినాల ముసుగులో జూద క్రీడల నిర్వహణకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ అధికార తెలుగుదేశం పార్టీ కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ప్రమేయంతో కోనసీమ జిల్లాలో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు వంటివి నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కోడి పందాలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తుంది. గతం కంటే భిన్నంగా జిల్లా వ్యాప్తంగా భారీగా పందెం బరుల ఏర్పాటుకు కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఎవరికి తగిన తీరిలో వారు బరుల ఏర్పాటులో రంగంలోకి దిగారు. సాక్షాత్తూ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, కలెక్టర్ మహేష్‌కుమార్‌లు ఇచ్చిన ప్రకటనలు ప్రచారానికే పరిమితమయ్యాయనే రీతిలో పందాల నిర్వహణదారులు వారికి సవాళ్లు విసురుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో బరులు నిర్వహిస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్ల, కాట్రేనికోన మండలం చెయ్యేరు, ముమ్మిడివరం మండలం కొత్తలంకలతో పాటు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, అమలాపురం మండలంలోని అనేక ప్రాంతాలతో పాటు రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల పరిధిలో భారీగా పందెం బరులు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 216 జాతీయ రహదారిని ఆనుకుని బరులు ఏర్పాటవుతున్నాయి. మరోవైపు సంక్రాంతి సంబరాల పేరిట సెట్టింగులు వేసి ఆ ముసుగులోనే గుండాట, పేకాట, కోడి పందాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడక్కడా తమ ఉనికిని చాటుకునేందుకు ఫ్లెక్సీలు పెట్టి ఫొటోలు తీయడం ‘షరా మామూళ్ల’గానే మారింది. మరికొన్ని చోట్ల పోలీసు బందోబస్తు నడుమ బరులను ట్రాక్టర్లతో దున్నేస్తున్నట్టు చేస్తున్నప్పటికీ అవి మొక్కుబడిగానే జరుగుతున్నాయి. బరి ఒకచోట ఉంటే మరోచోట ట్రాక్టర్‌తో దున్నే పనులు చేయడం కనిపిస్తుంది. ఈ సారి మురమళ్లలో భారీ ఏర్పాట్ల నడుమ కోడిపందాలు నిర్వహించడానికి వీఐపీ బరిని సిద్ధం చేస్తున్నారు. కోడిపందాల బరుల వద్ద కొన్నిచోట్ల ఇప్పటికే బెల్టుషాపులు పబ్లిక్‌గా వెలిశాయి. నిబంధనకు విరుద్ధంగా బహిరంగ లిక్కర్ విక్రయాలు పందెం బరుల వద్ద చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోలీసు యంత్రాంగం కనుసన్నల్లోనే బరులు ఏర్పాటయ్యే విధంగా కూటమి నాయకులు, పోలీసులతో మంతనాలు జరుపుతున్నారు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులకు ఇష్టం లేకుండా బరులు వేస్తుంటే వాటిని పోలీసులు అడ్డుకునే విధంగా వ్యూహాలు రూపొందించారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా వందకుపైగా కీలక బరులు సోమవారం నుంచి ప్రారంభించడానికి సర్వం సిద్ధమైంది. అయితే ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కోడిపందాల బరులు ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చినప్పటికీ అవి ఈ పండుగ సీజన్‌లో ఖచ్చితంగా అమలయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తుంది. పోలీసు యంత్రాంగం కూడా చేతులెత్తేయడంతో పబ్లిక్‌గా బరులు ప్రధాన రహదారుల చెంతనే ఏర్పాటవుతున్నాయి. వీటిని ప్రారంభించేందుకు ప్రజాప్రతినిధులు సైతం ముందుకు వస్తుండడంతో అధికారులు చేతులెత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.