బర్డ్‌ఫ్లూపై వదంతులు, అపోహలు నమ్మొద్దు!
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:45 AM
జిల్లాలో ప్రబలిన బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా)పై సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వదంతులు, అపోహలు నమ్మొద్దని, ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరావు పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రబలిన బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా)పై సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వదంతులు, అపోహలు నమ్మొద్దని, ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరావు పేర్కొన్నారు. దీని నియంత్రణపై ప్రజలందరికీ అవగాహన కల్పించామని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బర్డ్‌ఫ్లూ పక్షులకు మాత్రమే వస్తుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని స్పష్టంచేశారు. బర్డ్‌ఫ్లూ సోకిన ప్రాంతాల ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే కాకుండా వైరస్‌వ్యాప్తిని అడ్డుకోవడానికి పలు జాగ్రత్తలు అవసరమని తెలిపారు. ఏదైనా జ్వరం, జలుబు, తలపోటు, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు వచ్చిన వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. పెరవలి, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, నిడదవోలు, సీతానగరం మండలాల్లో మొత్తం 64 టీమ్స్ ద్వారా 22,902 ఇళ్లను సందర్శించి అందులో 87,724 ప్రజలకు రోగ లక్షణా లపై సర్వే చేశామని, ఎవరికీ ఎలాంటి లక్షణా లు లేవని ఆయన తెలిపారు. బర్డ్‌ఫ్లూ వెలు గుచూసిన ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖ డోర్ టు డోర్ నిఘా పెట్టిందని, పది కిలోమీటర్ల పరిధిలోని పీహెచ్‌సీలను తమ వైద్య బృందాలు కవర్ చేశాయని తెలిపారు. రోగ లక్షణాలున్న కేసులను గుర్తించడానికి, ఇంటింటి నిఘా కోసం ఆశాలు, ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలతో కూడిన 64 వైద్య బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు. ఏదైనా సమాచారం కోసం ఆరోగ్య సిబ్బందిని కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైఽద్యాధికారిని కానీ సంప్రదించాలని ఆయన కోరారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
కోడిగుడ్లు, చికెన్ వినియోగానికి ముందు శుభ్రం చేయడంతోపాటు వంటకు తగిన జాగ్రతలు తీసుకోవాలని డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. ముడి మాంసం, హాఫ్ బాయిల్డ్ చేసిన గుడ్లు తినకూడదని తెలిపారు. కోడిగుడ్లు చికెన్ చేతితో తాకినా ఆ తర్వాత బాగా చేతులు కడుక్కోవాలని, చికెన్, గుడ్లను వేర్వేరుగా నిల్వ చేయాలని, ఇతర ఆహార పదార్థాలతో కలపకూడదని పేర్కొన్నారు. కోళ్లు మరణించి ఉంటే వాటిని తగిన జాగ్రత్తలతో నిర్మూలన చేయాలని ఆయన వెల్లడించారు.