లింగ వివక్షను రూపుమాపేందుకు అవగాహనా ర్యాలీ
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:31 AM
బాలికలను రక్షించి బాలికా విద్యను ప్రోత్సహించడంతో పాటు లింగ వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ఆశించిన సత్ఫలితాలు అందిస్తుందని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్శంగా మహిళా సంక్షేమశాఖ, మహిళా పోలీసు సిబ్బందితో చేపట్టిన బైక్ ర్యాలీని కలెక్టరేట్ వద్ద శనివారం జేసీ నిషాంతి ప్రారంభించారు.

అమలాపురం టౌన్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): బాలికలను రక్షించి బాలికా విద్యను ప్రోత్సహించడంతో పాటు లింగ వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ఆశించిన సత్ఫలితాలు అందిస్తుందని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్శంగా మహిళా సంక్షేమశాఖ, మహిళా పోలీసు సిబ్బందితో చేపట్టిన బైక్ ర్యాలీని కలెక్టరేట్ వద్ద శనివారం జేసీ నిషాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికల హక్కులు, విద్య, గౌరవానికి కొత్త కోణాన్ని చూపించిందన్నారు. ఈ పథకాన్ని ప్రధాని మోదీ 2015 జనవరి 22న ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా శిశు లింగ నిష్పత్తి క్షీణతను అరికట్టడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాస్థాయిలో ఒకప్పుడు బాలికల శాతం తక్కువగా ఉండేదని, కార్యక్రమం ద్వారా అవగాహనతో లింగ నిష్పత్తిశాతం మెరుగుపడిందన్నారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం వరకు జరిగింది. కార్యక్రమంలో ఐసీడీఎస్ పథక సంచాలకురాలు బి.శాంతకుమారి, డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్‌ఐలు, సీడీపీవోలు, మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.