Share News

నిబంధనలు ఉల్లంఘించే ఆక్వా చెరువులను ధ్వంసం చేయాలి

ABN , Publish Date - Feb 05 , 2025 | 12:39 AM

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నిబంధనలను ఉల్లంఘించినట్టు ధ్రువీకరించిన ఆక్వా రంగ చెరువులను మార్చి నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రెవెన్యూ, మత్స్యశాఖ, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన చెరువుల ధ్వంసం ప్రక్రియపై సమీక్షించారు.

నిబంధనలు ఉల్లంఘించే ఆక్వా చెరువులను ధ్వంసం చేయాలి

అమలాపురం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నిబంధనలను ఉల్లంఘించినట్టు ధ్రువీకరించిన ఆక్వా రంగ చెరువులను మార్చి నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రెవెన్యూ, మత్స్యశాఖ, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన చెరువుల ధ్వంసం ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మామిడికుదురు మండలంలో 193 చెరువులను గుర్తించగా వాటిలో ఇప్పటి వరకు 47 చెరువులను ధ్వంసం చేసినట్లు చెప్పారు. మలికిపురం మండలంలో 35 చెరువులను గుర్తించగా 19చెరువులను ధ్వంసం చేసినట్టు, 8 చెరువులను ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. సఖినేటిపల్లి మండలంలో 206 చెరువులను గుర్తించగా వీటిని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య కల్యాణోత్సవాలను ముగిసిన తర్వాత ధ్వంసం చేయనున్నట్లు చెప్పారు. దశల వారీగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చెరువుల్లో చేపల హార్వెస్టింగ్‌ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే విద్యుత్‌ కనెక్షన్లు తొలగించి ధ్వంసం చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ధ్వంసం చేసిన చెరువుల్లో తిరిగి సాగును పునఃప్రారంభించినట్టయితే అందుకు సంబంధిత మత్స్య అభివృద్ధికి అధికారి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆక్వాచెరువుల రైతులకు ఆరు మాసాల గడువు ఇచ్చామని, మార్చి 15నాటికి మొత్తం చెరువులను ధ్వంసం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, ఆర్డీవో కొత్త మాధవి, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్‌.శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు, తహశీల్దార్లు శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యాచారి, మత్స్య అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2025 | 12:39 AM