అంతర్వేది కల్యాణోత్సవాలపై సమీక్ష
ABN , Publish Date - Jan 03 , 2025 | 01:08 AM
ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చెప్పారు. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలోని కల్యాణ షెడ్డులో ఉత్సవాల సమీక్షా సమావేశాన్ని అమలాపురం ఆర్డీవో కె.మాధవి అధ్యక్షతన గురువారం నిర్వహించారు.
అంతర్వేది, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చెప్పారు. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలోని కల్యాణ షెడ్డులో ఉత్సవాల సమీక్షా సమావేశాన్ని అమలాపురం ఆర్డీవో కె.మాధవి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. జిల్లా, డివిజన్ స్థాయి అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్‌లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడారు. స్వామివారి ఉత్సవాలకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరూ కల్యాణ మహోత్సవాలు తిలకించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా శానిటేషన్, తాగునీరు, రోడ్ల మరమ్మతులు, రోడ్డుకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్, మెడికల్ క్యాంపులు, ట్రాఫిక్, తీర్థ మహోత్సవంలో ముఖ్య ఘట్టాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. స్వామివారి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ సేవా కమిటీ చైర్మన్‌గా దిరిశాల బాలాజీని ప్రతిపాదించామని, వారు భక్తులకు అసౌకర్యం కలుగకుండా వారి బృందంతో సేవలు అందించాలన్నారు. ఆర్డీవో కె.మాధవి విద్యుత్, వైద్యం, తాగునీరు, శానిటేషన్, పోలీసు బందోబస్తు, క్యూలైన్, పార్కింగ్, సీసీ కెమెరాలు, గజ ఈతగాళ్లు, పరిశుభ్రత మొదలగు విషయాలపై చర్చించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతిగదులు, టాయిలెట్స్, సముద్ర స్నానాల వద్ద దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేయాలన్నారు. తెప్పోత్సవం నిర్వహించే మంచినీటి చెరువు మరమ్మతుల్లో ఉండడం వల్ల తెప్సోత్సవాన్ని తూర్పుభాగంలో కొత్తగా కోనేరు తవ్వి నిర్వహించాలా, ప్రత్యామ్నాయం చూడాలా అన్నది తదుపరి సమావేశంలో నిర్ణయిస్తామని ఆర్డీవో మాధవి తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఉత్సవ అధికారి డీఎల్వీ రమేష్‌బాబు, కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు, ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కలిదిండి కుమారరామగోపాల రాజ బహుదూర్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ గుండుబోగుల నరసింహారావు (పెద్దకాపు), గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, రాజోలు నీటి సంఘం డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి), ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఎంపీటీసీలు బైరా నాగరాజు, చొప్పల బాబూరావు, సర్పంచ్ పోతురాజు నరసింహారావు(కిశోర్), తహశీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, ఈవోపీఆర్డీ ఎఫ్‌ఏసీ కె.సూర్యనారాయణ, ముప్పర్తి నాని, గుబ్బల ఫణికుమార్ పాల్గొన్నారు.