అన్నవరంలో బో...ఫోర్స్!
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:36 AM
అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భో.. ఫోర్స్ కుంభకోణం అంత పెద్ద కుంభకోణం జరుగుతోంది.. ఇది ఈనాటిది కాదు.. చాలా ఏళ్లుగా వేళ్లూనుకుపోయింది.. అయినా ఏ ఒక్కరూ దీనిపై దృష్టి సారించినవారే లేరు.. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందించే సౌకర్యాలపై చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో చివరి స్థానానికి చేరడంతో అందరి దృష్టీ ఈ ఆలయంపై పడింది.. ఇది జిల్లాకు మాయని మచ్చగా మారింది..

4 ప్రధాన విభాగాల్లో దోపిడీ
కంటున్నావా.. సత్యదేవా
ఐవీఆర్‌ఎస్ సర్వేలో చివరి స్థానం
లోపమెక్కడని ఆంధ్రజ్యోతి ఆరా
దోచుకుంటున్న దళారులు
దర్శనమైనా..గదులైనా డబ్బులే
మామూళ్ల మత్తులో అధికారులు
నేడు కలెక్టర్ సమీక్ష
అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భో.. ఫోర్స్ కుంభకోణం అంత పెద్ద కుంభకోణం జరుగుతోంది.. ఇది ఈనాటిది కాదు.. చాలా ఏళ్లుగా వేళ్లూనుకుపోయింది.. అయినా ఏ ఒక్కరూ దీనిపై దృష్టి సారించినవారే లేరు.. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందించే సౌకర్యాలపై చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో చివరి స్థానానికి చేరడంతో అందరి దృష్టీ ఈ ఆలయంపై పడింది.. ఇది జిల్లాకు మాయని మచ్చగా మారింది.. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ నిఘా పెట్టగా అసలు విషయం బయటపడింది.. తవ్వితే బోఫోర్స్ కుంభకోణం అంతగా ఉంది.. ర్యాంక్ మెరుగుపరిచేందుకు అన్నవరం ఆలయంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ సోమవారం అన్నవరం ఆలయంలో సమీక్షించేందుకు సిద్ధమయ్యారు.
అన్నవరం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అన్నవరం దేవస్థానంలో పనిచేసే సిబ్బందిలో చాలా మంది తమ జేబులు నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అర్చకుల నుంచి క్యూలైన్‌లో నిలబెట్టేవారు వరకూ అందరూ చేయి చాపే వారే.. చేయి తడిపితేనే దర్శనం చేయించేంతగా అవినీతి వేళ్లూనుకుపోయింది. అన్నవరం వచ్చి న భక్తులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారనే విమర్శలున్నాయి. మిగిలిన ఆల యాల్లో భక్తులు పరోక్ష దోపిడీకి గురవుతుండగా రత్నగిరికి విచ్చేసిన భక్తులు ప్రత్యక్ష దోపిడీకి గురికావడమే చివరి ర్యాంక్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం దళారీ వ్యవస్థ. ఎక్కడికక్కడే దళారులు కొంత మంది సిబ్బందితో కుమ్మక్కై భక్తులను దోచుకుతింటున్నారు. సిబ్బంది కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ సోమవారం జరిగే సమీక్షలో అవలోకనం చేస్తే భక్తులు సంతృప్తి చెందవచ్చు. ఇక్కడ భక్తులు ప్రత్యక్షంగా దోపిడీకి గుర వుతున్నది నాలుగు విభాగాల్లో మాత్రమే.
దళారీ..దేముళ్లు!
స్వామివారి దర్శనాలు, వైదిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటైన ఈ విభాగంలో దళారీ వ్యవస్థదే కీలక పాత్ర. రత్నగిరికి కార్లలో వచ్చే భక్తులనే దళారులు టార్గెట్‌గా పెట్టుకుంటారు. కారు పార్కింగ్ చేయగానే మీకు నేరుగా దర్శనం చేయిస్తామని, గర్భగుడిలో అర్చకులతో మెడలో పూలమాల వేయిస్తామని బేరసారాలు జరుపుతారు. ఒక్కొక్కరి వద్ద రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు లాగే స్తారు. బేరమయ్యాక దళారులు ఎన్‌ఎంఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఫోన్ చేస్తారు. భక్తబృందాన్ని వారికి అప్పగిస్తారు. దర్శనం అయ్యాక ఎన్‌ఎంఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగి డబ్బులను పం చుకుంటారు. ఈ తతంగమంతా సెక్యూరిటీ సిబ్బందికి తెలిసినా... వారు దళారీలతో ముచ్చటిస్తూ ఇంటికెళ్లే సమయంలో వారికి కొంత భాగమిస్తారు. ప్రకాష్ సదన్ కాటేజీ నుంచి పశ్చిమ రాజగోపురం వరకు దళారులు తిరుగుతుంటారు.
చేయితడిపితేనే.. వ్రతఫలం
సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తుల్లో అధికశాతం స్వామివారి వ్రతాలు చేస్తారు. సామాన్యుల వ్రతం టిక్కెట్టు ధర రూ.300 అయితే పూర్తయ్యేసరికి మూడింతలు ఖర్చవుతుంది. టిక్కెట్టు రూ.300, వ్రతం పూజా సామగ్రి రూ.300, వ్రతం పూర్తయ్యాక పురోహితులకు దానాల రూపంలో స్వీకరించేది మరో రూ.300. ఇది కాకుండా వ్రతం అనంతరం శానిటేషన్ సిబ్బంది మూకుమ్మడిగా వ్రత మండపాల్లోకి వెళ్లి తాము స్వీపర్‌లమని యాచిస్తుంటారు. రత్నగిరి భక్తులు సగం ఛీత్కరించుకునేది ఇక్కడే.
ఛీ..ఆర్వో విభాగం
ఈ విభాగం కింద భక్తులకు వసతి గదులు కేటాయింపు జరుగుతుంది. పర్వదినాల్లో సాధారణ భక్తులకు కౌంటర్ గుమస్తాలు నరకం చూపిస్తారు. గదులు ఖాళీలు ఉన్నా సాధారణ భక్తుడికి గదులు ఇవ్వరు. అక్కడే ఉండే దళారులను సంప్రదించి కొంత అధిక మొత్తం చెల్లిస్తే మాత్రం వెంటనే గది దొరుకుతుంది. కేవలం రత్నగిరిపై 550 గదులు మాత్రమే ఉన్నాయి. సిఫార్సులు అధికం. దీంతో ఇక్కడ సామాన్య భక్తుడికి గది దొరకడం అసాధ్యం. ఇక్కడే వివాహ బృందాల దోపిడీకి దళారీ వ్యవస్థ కాచుకుని కూర్చుంటుంది. పురోహితుడు, సన్నాయిమేళం బేరం కుదుర్చుకుంటేనే వారికి లోపల ప్రవేశం ఉంటుంది. లేకుంటే అష్టకష్టాలే. దశాబ్దాలుగా ఇక్కడ దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోవడంతో ఎవరూ వారిని కదిలించలేకపోతున్నారు. వివాహ బృందాలకు స్వేచ్ఛ దొరకనివ్వకపోవడంతో దేవస్థానం అపఖ్యాతి పాలవుతోంది. గలీజుల విభాగం!
భక్తుల సౌకర్యార్థం స్టాళ్లను ఏర్పా టు చేసే విభాగమే లీజుల విభాగం. దీన్ని సీ సెక్షన్‌గా పిలుస్తారు.ఇక్కడ దేవస్థానం నిర్దేశిం చే ధరలు అమలు జరగవు. ఉదాహరణకు సెల్‌ఫోన్ భద్రపరుచుకునేందుకు లైసెన్స్‌దారు డు ఒక్కో ఫోన్‌కు రూ.5 వసూలు చేయాలి ఇక్కడ రూ.10 వసూలు చేస్తాడు.ఇటీవల వినియోగదారుల కమిషన్ సైతం సదరు గుత్తేదారుపై జరిమానా వేసింది.మరోపక్క భక్తుల జోళ్ల జతకు రూ.2 వసూలు చేయాలి ఇక్కడ రూ.5 వసూలు చేస్తారు.పూజాసామగ్రి ధరలు, వివాహాలకు అవసరమైన డెకరేషన్ మండపాల ధరలు దేవస్థానం నిర్దేశించిన దానికంటే మూడింతలు ఎక్కువ.ఎక్కడా షాపుల వద్ద ధరల పట్టికలు ఉండవు. లీజుల విభాగం అధి కారులు దీనిపై దృష్టిసారించరు. ఎందుకంటే మామూళ్ల మత్తు.ఎంఆర్‌పీ ధరలతో విక్రయా లు జరగవు. మామూళ్ల మత్తులో అధికారులు ఊగుతుండడం దౌర్భాగ్యంగా పేర్కొనవచ్చు.