Share News

పని ఒత్తిడి తగ్గించాలని ఏఎన్‌ఎంల నిరసన

ABN , Publish Date - Mar 06 , 2025 | 01:05 AM

పని ఒత్తిడితో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని సచివాలయ ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు.

పని ఒత్తిడి తగ్గించాలని ఏఎన్‌ఎంల నిరసన

అమలాపురం టౌన్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పని ఒత్తిడితో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని సచివాలయ ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ సర్వేలతో పాటు వైద్య ఆరోగ్యశాఖ సర్వేలు కూడా చేయాల్సి వస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామన్నారు. జిల్లా పరిధిలోని లక్కవరం, కేశనపల్లి, తాటిపాక, నగరం, నాగుల్లంక, పి.గన్నవరం, అమలాపురం అర్బన్‌లకు చెందిన సచివాలయ ఏఎన్‌ఎంలు బుధవారం కేవీఆర్‌ కుమారి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపి నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తమ ఎస్‌ఆర్‌లు వైద్య ఆరోగ్యశాఖ వద్ద ఉంటే జీతాలు పంచాయతీరాజ్‌శాఖ చెల్లిస్తున్నందున అటు సచివాలయ పనులు, ఇటు వైద్య ఆరోగ్యశాఖ పనులు ఒకేసారి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. కేవలం వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన పనులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి ఈనెల8వ తేదీ వరకు ఉన్న వర్కు ఫ్రం హోమ్‌ సర్వేను పూర్తి చేయాలని, అనంతరం వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన పనులకు మాత్రమే పరిమితం చేసేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 06 , 2025 | 01:05 AM