రోడ్డు చేంజర్ కూటమి!
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:41 AM
: ప్రభుత్వం మారింది.. రోడ్డూ మారింది.. అదేమిటంటారా.. రోడ్లకు ప్రభుత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది.. అది నిరూపించిందే.. రాజానగరం- సామర్లకోట ఏడీబీ రోడ్డు..

వైసీపీ హయాంలో నరకమే
వందలాదిగా ప్రమాదాలు
గాలిలో కలిసిన ప్రాణాలు
వేలాది మందికి గాయాలు
పట్టించుకోని పాలకులు
2018లో పనులు ప్రారంభం
ప్రభుత్వం మారి ఆగిన పనులు
కూటమి ప్రభుత్వంలో దృష్టి
శరవేగంగా నిర్మాణ పనులు
శనివారం ప్రమాదంతో కదలిక
సామర్లకోట/రంగంపేట/రాజానగరం జనవరి 6 : (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం మారింది.. రోడ్డూ మారింది.. అదేమిటంటారా.. రోడ్లకు ప్రభుత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది.. అది నిరూపించిందే.. రాజానగరం- సామర్లకోట ఏడీబీ రోడ్డు.. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. అంతే రోడ్డుకు శని పట్టుకుంది.. ఐదేళ్లూ కదల్లేదు.. రోడ్లంతా గోతులే.. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.. ఎంతో మంది గాయాలపాలయ్యారు. ఎన్నో వాహనాలు పనికిరాకుండా పోయాయి.. ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడేవారు.. మళ్లీ 2024 వచ్చింది.. ప్రభుత్వం మారింది.. వైసీపీ హయాంలో ఐదేళ్లు సాగని పనులు .. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునఃప్రారంభమయ్యాయి.. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడీ రోడ్డు సంగతెందుకంటారా.. శనివారం రాత్రి వేమగిరిలో జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై తిరిగి కాకినాడ వెళుతుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఈ రోడ్డపై అందరి దృష్టి పడేలా చేసింది. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రహదారి నిర్మాణంలో గత ప్రభుత్వ వైఫల్యం గురించి ప్రస్తావించారు. దీనిలో భాగంగా ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..ఏడీబీ రోడ్డును తలచు కుంటే చాలు అటుగా తిరిగేవారెవరైనా అయ్యబా బోయ్ ఆ రోడ్డా అనకమానరు.. ఎందుకంటే అం త అధ్వానం..గత ఐదేళ్లలో ఎంతో మంది ప్రాణా లను బలితీసుకున్న రోడ్డు అది. అయినా గత వైసీపీ ప్రభుత్వంలో కనీస చలనం లేదు. ఐదేళ్లు ఆ రోడ్డు గోతులతోనే నిండి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో రోడ్డుకు మహర్దశ వచ్చిం ది.వేగంగా రోడ్డు నిర్మాణపనులు సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం హైవే-కాకినాడ పోర్టుకు అనుసంధానం చేస్తూ రాజానగరం నుంచి కాకినాడ వాకలపూడి లైట్‌హౌస్ వరకూ ఏడీబీ (ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ రహదారి) రోడ్డును నిర్మించారు. 1991లో ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో ఈ రహదారిని 52 కిలోమీ టర్ల మేర ఎంతో పటిష్టంగా నిర్మించారు.
వై..చీప్ పాలన
గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేం ద్రంగా ఉన్న కాకినాడ నుంచి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరగడం, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు ఈ రహదారి అనుసంధానమై ఉండడం వల్ల రోజురోజుకు వాహనాల రద్దీ పెరగడం వల్ల రాజానగరం నుంచి సామర్లకోట వరకు నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని 2014లో టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు తెచ్చింది. తదనంతరం 2018లో ఉమ్మడి జిల్లాలో రాజానగరం, రంగంపేట మీదుగా పెద్దాపురం, సామర్లకోట, రైల్వే వంతెన వరకు నాలుగు వరుసలుగా 30 కిలో మీటర్ల పొడవైన రహదారి నిర్మాణానికి నాబార్డు నిధులు రూ.300 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో కాంట్రాక్టర్ పనులు చేపట్టి కొంత వరకు పూర్తి చేశారు.మొత్తం రూ.250 కోట్ల వరకు నిధులు విడుదలయ్యాయి.2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు మంజూరులో జాప్యంతో పనులు నెమ్మదించాయి.ఈ రహ దారి విస్తరణ పనుల్లో భాగంగా ఇరువైపులా లోతుగా తవ్విన ప్రాంతాల్లో గోతులు పూడ్చి పెట్టకుండా వదిలిపెట్టడంతో ప్రయాణికులు తరచూ ప్రమా దాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. వాహ నాలు అదుపుతప్పి రహదారిపై తిరగబడి ట్రాఫిక్ నిలిచి ప్రయాణికులు అవస్థలు చవిచూ శారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఈ రహదారి నిర్మాణ పనులను పూర్తిగా గాలి కొదిలేసింది. దీంతో రహదారిపై ఏర్పడిన భారీ గోతులకు వాహనాలు ధ్వంసమైన దాఖలాలున్నాయి.ఎత్తు పల్లాల, గతుకుల కారణంగా ప్రయాణికులు ఈ రోడ్డుపై పడుతూ.. లేస్తూ ప్రయాణం సాగించక తప్పలేదు.ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్ ప్రచారయాత్ర ఈ ఏడీబీ రోడ్డు మీదుగానే సాగింది. నాడు రహదారి బాగుపడుతుందని అంతా ఆశించారు.కానీ కనీసం మరమ్మతు పనులు చేయకపోవడంతో వాహనదారుల్లో నిరా శే మిగిలింది. నిత్యం ఈ రహదారిపై ప్రయా ణించే వివిధ కళా శాలలకు చెందిన విద్యార్థులు, ప్రయాణికులు నరకం చూశారు. కాకినాడ-రాజ మహేంద్రవరం నాన్ స్టాప్ బస్సులు అనేకసార్లు ఈ రోడ్డులో గోతుల్లో ఇరుక్కుపోయిన ఘటనలు ఉన్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.45 కోట్ల మేర బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లకు చుక్కలు చూపించింది. దీంతో వారు తీవ్ర నిరాశకు లోనై రోడ్డు నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేశారు. కాంట్రాక్టర్ యంత్రాల ను తిరిగి తీసుకెళ్లిపోయారు.
కూటమి మార్పు ఇది..
కూటమి ప్రభుత్వం వచ్చింది.. వెంటనే రహ దారి నిర్మాణంపై దృష్టి సారించింది. రాజానగరం నుంచి సామర్లకోట వరకు నాలుగులైన్లుగా నిర్మిస్తున్న ఏడీబీ రోడ్డు పనులు పెద్దాపురం, కోటపాడు, సూరంపాలెం ఆదిత్య దగ్గర పునఃప్రారంభించారు. ప్రస్తుతం గోతులతో వాహనాలు ప్రయాణం ఇబ్బందిగా ఉన్నచోట మరమ్మతులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనపర్తి, రాజానగరం, జగ్గం పేట, పెద్దాపురం,కాకినాడ రూరల్ ఎమ్మెల్యేల చొరవతో సీఎం చంద్రబాబు పెండింగ్ బిల్లుల్లు చెల్లించడంతో ఏడీబీ రోడ్డు పనులు పునః ప్రారంభించారు. ప్రస్తుతం పనులు కోటపాడు వద్ద శర వేగంగా సాగుతున్నాయి.ఎక్కడైనా చిన్న గొయ్యిపడినా వెంటనే పూడ్చివేస్తున్నారు.
ఇద్దరు యువకుల మృతి బాధాకరం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పిఠాపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి రాజమహేంద్రవరం-కాకినాడ మధ్య గల ఏడీబీ రోడ్డు మీదుగా వెళుతూ ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మరణించడం బాధాకరమని.. ఈ సమాచారం తెలియగానే తీవ్ర ఆవేదనకు గురయ్యాయని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. మృతులు కాకినాడ సమీపంలోని గైగోలుపాడుకు చెందిన మణికంఠ, చరణ్ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున జనసేన పార్టీ తరపున ఆర్థికసహాయం అందజేస్తామని ఆయన ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందజేయాలని కార్యాలయ అధికారులకు సూచించినట్టు తెలిపారు.గేమ్ చేంజర్ ఈవెంట్‌లో ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని ఒకటికి రెండుసార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇక నుంచి ఏడీబీ రోడ్డుపైనే
పిఠాపురానికి
కాకినాడ-రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి కీలకమైన ఏడీబీ రోడ్డును గత ప్రభుత్వం ఐదేళ్లపాటు పట్టించుకోలేదని.. కనీసం నిర్వహణ పనులు చేయలేదని, విద్యుద్దీపాలు లేవని పవన్‌కల్యాణ్ విమర్శించారు. దీంతో ఈ రహదారిలో ప్రమాదాలు పెరిగాయని తెలిపారు. ఐదు నియోజకవర్గాలే కాక రెండు జిల్లాల మధ్య ప్రధాన రహదారిగా ఉన్న ఈ రోడ్డు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి చేపట్టిందని చెప్పారు. అధ్వానంగా ఉన్న ఈ రహదారిని మెరుగు పరిచే పనులు జరుగుతున్న తరుణంలో ఇటువంటి ప్రమాదం జరగడం బాధ కలిగించిందని తెలిపారు. ఇక తాను పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పుడు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నట్టు పవన్ ప్రకటించారు.