Dussehra 2025: పండుగకు ఊరు వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:05 AM
తెలంగాణలో ఘనంగా జరుపుకునే దసరా పండుగ వచ్చిందంటే.. పండుగకు పది రోజుల ముందు నుంచే అం తటా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో దసరా పండుగకు విద్యాసంస్థలకు ఎక్కువ..
దిల్‌సుఖ్‌నగర్, సెప్టెంబరు 29: తెలంగాణలో ఘనంగా జరుపుకునే దసరా పండుగ వచ్చిందంటే.. పండుగకు పది రోజుల ముందు నుంచే అం తటా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో దసరా పండుగకు విద్యాసంస్థలకు ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వడంతో నగరంలో ఉంటున్న గ్రామీణ ప్రాంతవాసులు ఊరుబాటపడతారు. నగరంలోని ఇళ్లకు తాళాలు వేసి నగరవాసులు సొంత ఊరు వెళ్లడాన్ని అదునుగా చేసుకుని దొంగలు తమ చేతి వాటానికి పనిచెప్పేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ నేపథ్యంలో పండుగకు ఊరు వెళ్లే వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాచకొండ పోలీసులు.
దొంగతనాల నివారణ కోసం పోలీసు సూచనలు, సలహాలు పాటించాలని సరూర్‌నగర్, చైతన్యపురి పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తు పోస్టర్లు, బ్యానర్లు రూపొందించారు. రాచకొండ కమిషనర్ సుఽధీర్‌బాబు ఆదేశానుసారం ప్రతి కాలనీ లో పోస్టర్లు అంటించడంతో పాటు ఆటోలకు బ్యానర్లు కట్టి, మైకుల ద్వారా వీధి, వీధి తిరుగుతూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నట్లు సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి వెల్లడించారు. బ్యానర్లతో పాటు సోషల్ మీడి యా ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని, పోలీసు సూచనలు పాటించి, దొంగతనాల నివారణకు పోలీసులకు సహకరించాలని విన్నవిస్తున్నారు. కాలనీల్లో సంచరించే అనుమానిత వ్యక్తుల గురించి 100 నెంబర్‌కు గానీ, రాచకొండ పోలీస్ కంట్రోల్ రూం (సెల్ నెం.8712662666, వాట్సాప్ నెం. 8712662111) లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పోలీసు సూచనలు పాటించండి: సైదిరెడ్డి, ఇన్‌స్పెక్టర్
👉🏼 ఊరు వెళ్లే సమయంలో వీలైనంత వరకు విలువైన వస్తువులు, నగలు, నగదు ఇంట్లో పెట్టకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం శ్రేయస్కరం.
👉🏼 సెంట్రల్ లాక్ చేసిన ఇంటికి బయట నుంచి గొళ్లెం పెట్టరాదు.
👉🏼 బయట గేటుకు లోపలి నుంచి తాళం వేసి, ఇంటి గడప ముందు చెప్పులు ఉంచాలి.
👉🏼 ఇంటి ముందు గదిలో లైట్ వేసి ఉంచాలి.
👉🏼 పేపర్ బాయ్, పాలు వేసే వ్యక్తులకు రావద్దని చెప్పాలి.
👉🏼 ఊరు వెళ్లే సమయంలో ఇంటి పక్కన నమ్మకమైన వారికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
👉🏼 ఇంటి నుంచి బయటకు వెళ్లే మహిళలు, ఇంటి ముందు ముగ్గులు వేసే మహిళామణులు బంగారు ఆ భరణాలు ధరించకపోవడం శ్రేయస్కరం, ఒక వేళ ధ రించినా కనబడకుండా, తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
👉🏼 తాళం వేసిన తర్వాత డోర్ కర్టన్ వేసి తాళం కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.
👉🏼 ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటె, మొబైల్ యాప్ ద్వారా సీసీ కెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది. దీని మూలంగా ఇంటి వద్ద కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు.