CM Chandrababu: దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:15 AM
గోదావరి నదికి 2027లో, కృష్ణా నదికి 2028లో వచ్చే పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేపట్టే మంచి పనులకు కనకదుర్గమ్మ ఆశీస్సులు...
రూ.14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తాం
ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు: సీఎం
రూ.26 కోట్లతో అన్నప్రసాద భవనం
27 కోట్లతో కొత్త ప్రసాదం తయారీ కేంద్రం
వైభవంగా గోదావరి, కృష్ణా పుష్కరాలు
కనకదుర్గమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించిన
ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు
సీఎం అంతరాలయంలో ఉండగానే దర్శనాలు కొనసాగింపు
విజయవాడ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదికి 2027లో, కృష్ణా నదికి 2028లో వచ్చే పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేపట్టే మంచి పనులకు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, ప్రజలకు సుఖసంతోషాలు అందించాలని ప్రార్థించానని తెలిపారు. మూల నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు సోమవారం ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. వారికి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, కలెక్టర్ లక్ష్మీశ, దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో శీనానాయక్‌పాటు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజగోపురం మెట్ల వద్ద పరివట్టం చుట్టారు. ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించాక అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలు, మంత్రి ఆనం అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. ఆ తర్వాత మీడియా పాయింట్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఇంద్రకీలాద్రిని అభివృద్ధిచేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ‘నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఇబ్బందులు రాకుండా ఎక్కువమందికి దర్శనభాగ్యం కల్పించేలా అన్ని ఏర్పాట్లూ చేశాం. వీఐపీ దర్శనాలను క్రమబద్ధీకరించాం. ఎక్కువ సమయం సాధారణ భక్తులకే కేటాయించాం. ప్రసాదంలో నాణ్యత పెంచాం. ఒకేసారి 1,500 మందికి సరిపోయేలా రూ.26 కోట్లతో నిర్మిస్తున్న అన్నప్రసాద భవనాన్ని ఆరునెలల్లో అందుబాటులోకి తెస్తాం. రూ.27కోట్లతో కొత్త ప్రసాదం తయారీ కేంద్రాన్ని 3 నెలల్లో పూర్తి చేస్తాం. రూ.14 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ఐదు నెలల్లో పూర్తి చేస్తాం’ అని వెల్లడించారు. తిరుమలలో ఉన్నంత స్థలం ఇంద్రకీలాద్రిపై లేదని, విజయవాడలోనే వసతి ఏర్పాటు చేసుకోవాలన్నారు.
క్యూలను ఆపకుండా
చంద్రబాబు దంపతులు అంతరాలయంలో ఉండగానే సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనాలు కొనసాగించడం గమనార్హం. గతంలో పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు, ముఖ్యులు వచ్చినప్పుడు క్యూ లైన్లను ఆపేసేవారు. భక్తులు ఇబ్బందులు పడేవారు. దీనికి భిన్నం గా ఈసారి ముఖద్వారం నుంచి వెళ్లే క్యూను తప్ప.. మిగిలిన అన్ని వరుసల నుంచీ భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్