DSC Hall Tickets 2025: డీఎస్సీ పరీక్షలకు హాల్ టికెట్లపై తేదీలే ప్రామాణికం
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:50 AM
డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లపై ఉన్న తేదీలే అధికారికమని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా ఎంపిక సమయంలో వర్తిస్తుందని, హాల్‌టికెట్లలో OCగా చూపించినా అది ప్రభావితం చేయదన్నారు.
ఎంపిక సమయంలో ఈడబ్ల్యూఎస్ వర్తింపు: కన్వీనర్
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ పరీక్షల తేదీల విషయంలో అభ్యర్థులకు జారీచేసిన హాల్ టికెట్లు మాత్రమే ప్రమాణికమని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. పరీక్షల తేదీలపై వివిధ మాధ్యమాల్లో ప్రచారమవుతున్న టైమ్‌టేబుళ్లు తాము జారీ చేయలేదని, హాల్‌టికెట్లపై పేర్కొన్న తేదీల ఆధారంగా మాత్రమే అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ఈ మేరకు డీఎస్సీలో పలు సందేహాలకు ఆదివారం ఆయన స్పష్టత ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులకు హాల్‌టికెట్లలో ఓసీ అని మాత్రమే ఉంటుందని, ఎంపిక సమయంలో కోటా వర్తిస్తుందని వివరించారు. టీజీటీ, పీజీటీ నాన్ లాంగ్వేజ్ పోస్టులు, ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్షీ పరీక్ష ఉంటుందని, సాంకేతిక కారణాల వల్ల మొదట జారీచేసిన హాల్ టికెట్లలో అది చూపించలేదని, సవరించిన హాల్ టికెట్ల జారీచేశామని పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి వీలైనంత వరకు ఒకే జిల్లాలో పరీక్షా కేంద్రాలు కేటాయించామని తెలిపారు. పీఈటీ, పీఈటీ-వీహెచ్/హెచ్‌హెచ్(దృష్టిలోపం, శ్రవణ లోపం) పోస్టులకు ఒకే సిలబస్ ఉన్నందున పరీక్షలు కూడా ఒకేరోజు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.