Share News

Tirumala: తిరుమలలో నమాజ్‌ చేసిన డ్రైవర్‌

ABN , Publish Date - May 23 , 2025 | 05:38 AM

తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద ఓ డ్రైవరు నమాజ్‌ చేసి కలకలం సృష్టించాడు. టీటీడీ నిబంధనల ప్రకారం ఇతర మతస్తులు అక్కడ ప్రార్థనలు చేయడం నిషేధం. ఈ ఘటనపై తిరుపతి ఎస్పీ విచారణ చేపట్టారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి వైసీపీ నేతలపై రాజకీయ కుట్ర చేయడంలో అనుమానం వ్యక్తం చేశారు.

Tirumala: తిరుమలలో నమాజ్‌ చేసిన డ్రైవర్‌

తిరుమల, మే 22(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఓ డ్రైవరు నమాజ్‌ చేయడం కలకలం సృష్టించింది. టీటీడీ నిబంధనల ప్రకారం ఇతర మతస్థులు తిరుమలలో తమ ప్రార్థనలు చేయడం నిషేధం. అయితే టీటీడీ సామూహిక వివాహాలు చేసే కల్యాణ వేదిక వద్దకు గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి టీఎన్‌ 83 టీ 6705 నెంబరు కారులో వచ్చారు. కొంత సమయం పార్కింగ్‌లోనే గడిపిన ఆ వ్యక్తి.. కల్యాణ వేదికపైకి చేరుకున్నారు. తన వద్దనున్న వస్త్రాన్ని నేలపై పరిచి నమాజ్‌ చేశారు. తిరిగి కారులో తిరుమల నుంచి వెళ్లిపోయారు. అక్కడి సిబ్బంది ఎవరూ దీనిని గుర్తించకపోవడం గమనార్హం. ఈ విషయం మీడియాలో రావడంతో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు కల్యాణ వేదికను పరిశీలించారు. ఓ భక్త బృందంతో తిరుమలకు వచ్చిన డ్రైవర్‌.. వారు దర్శనానికి వెళ్లిన తర్వాత నమాజ్‌ చేసినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అప్పటికే ఆ వ్యక్తి తిరుమల నుంచి వెళ్లిపోయారు. తిరుమలలో నమాజ్‌ చేసిన వ్యక్తి ఎవరు? నిబంధనలు తెలియక చేశారా లేదా తెలిసే చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.


వైసీపీ నాయకుల పనే: భానుప్రకాశ్‌ రెడ్డి

‘తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద అన్య మతస్థుడు నమాజ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వచ్చింది. దాని గురించి మేము విచారిస్తే కొందరు వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా తిరుమల ప్రతిష్ఠను దిగజార్చేలా ఈ చర్యకు పాల్పడినట్టు తెలిసింది. దీనివెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై క్రిమినల్‌ కేసులు పెడతాం. భగవంతుడిని అడ్డుపెట్టుకుని ఇలా రాజకీయం చేయడం సరికాదని వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా’ అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:38 AM