Share News

Industry Linked Courses: జాబ్‌ గ్యారెంటీకి యాడ్‌ ఆన్‌ నైపుణ్యం

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:32 AM

త్వరగా ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరుతుంటారు. అలాంటి వారికి అదనపు నైపుణ్యాలను అందించే దిశగా సాంకేతిక విద్యాశాఖ కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది.

Industry Linked Courses: జాబ్‌ గ్యారెంటీకి యాడ్‌ ఆన్‌ నైపుణ్యం

  • కచ్చితంగా ఉద్యోగం వచ్చేలా డిప్లొమా విద్యార్థులకు అదనపు కోర్సులు

  • పది సెక్టార్లలో 24 రకాలు అందుబాటులోకి

  • అందుకోసం ప్రత్యేకంగా సిలబస్‌

  • ప్రాంతాలు, పరిశ్రమలకు తగ్గట్టుగా కోర్సులు

  • అదనంగా సర్టిఫికెట్‌ జారీకి ప్రణాళిక

  • సాంకేతిక విద్యా శాఖ నూతన విధానం

  • ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

త్వరగా ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరుతుంటారు. అలాంటి వారికి అదనపు నైపుణ్యాలను అందించే దిశగా సాంకేతిక విద్యాశాఖ కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. యాడాన్‌ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చి, సాధారణంగా ఇచ్చే డిప్లొమా సర్టిఫికెట్‌తో పాటు మరో సర్టిఫికెట్‌ కూడా జారీ చేయనుంది. నాలుగో సెమిస్టర్‌లో యాడ్‌ ఆన్‌ కోర్సును పూర్తిచేసిన వెంటనే విద్యార్థులకు సర్టిఫికెట్‌ జారీచేసేలా ప్రణాళిక రూపొందించింది. అంటే డిప్లొమా కోర్సు మరో ఏడాది మిగిలి ఉండగానే విద్యార్థులకు అదనపు నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్‌ చేతికి అందుతుంది. దానివల్ల డిప్లొమా పూర్తికాగానే వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగవుతాయని సాంకేతిక విద్యాశాఖ చెబుతోంది. 2024-25లో ఈ యాడ్‌ఆన్‌ కోర్సులను ప్రయోగాత్మకంగా అమలుచేయగా, 2025-26 విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రాంతాల వారీగా ఉన్న పరిశ్రమలతో విద్యార్థులను అనుసంధానం చేయనుంది. మొత్తం రాష్ర్టాన్ని ఆరు క్లస్టర్లుగా విభజించి, పది రకాల సెక్టార్లలో 24 రకాల కోర్సుల్లో విద్యార్థులకు అదనపు శిక్షణ ఇస్తుంది. డిప్లొమా రెండో సంవత్సరం విద్యార్థులకు సాయం త్రం తరగతులు పూర్తయిన తర్వాత యాడ్‌ఆన్‌ కోర్సుల కోసం మరో గంట సేపు అదనంగా బోధన చేయనున్నారు. ఇందుకోసం సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేకంగా సిలబ్‌సను తయారుచేసింది.


ఇవీ క్లస్టర్లు, కోర్సులు

  • క్లస్టర్‌-1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఫార్మా, ఉత్పత్తిరంగాలు ప్రధాన పరిశ్రమలు. ఈ క్లస్టర్‌లో ఫార్మాలో ఉపకరణాల నిర్వహణ, ఫార్మా ప్రాసెస్‌ కంట్రోల్‌, ఫార్మా ఇండస్ర్టీ ప్రాసెస్‌ సేఫ్టీ, ఉత్పత్తి రంగంలో నిర్వహణ, ఉత్పత్తి రంగంలో అడ్వాన్స్‌డ్‌ ఎన్‌డీటీల కోర్సులు ఉన్నాయి.

  • క్లస్టర్‌-2లో ఉభయగోదావరి జిల్లాలున్నాయి. ఇక్క డ ఆక్వా ప్రధాన పరిశ్రమ. ఈ క్లస్టర్‌లో ఆక్వా అమ్మోనియా రిఫ్రిజిరేషన్‌, ఆక్వా ప్లాంట్‌ ఆటోమేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కోర్సులు ఉన్నాయి.

  • క్లస్టర్‌-3లో కృష్ణా, గుంటూరు జిల్లాలున్నాయి. ఇక్కడ మెకానికల్‌, టెక్స్‌టైల్‌ ప్రధాన పరిశ్రమలు. ఈ క్లస్టర్‌లో టెక్స్‌టైల్‌ పరిశ్రమలో మెషీన్ల నిర్వహణ- రిపేర్లు, స్పిన్నింగ్‌ మిల్లులో ప్రాసెస్‌ కంట్రోల్‌ కోర్సులు ఉన్నాయి.

  • క్లస్టర్‌-4లో ప్రకాశం, నెల్లూరు జిల్లాలున్నాయి. ఇక్కడ గ్రానైట్‌, ఆయిల్‌ టెక్నాలజీ ప్రధాన పారిశ్రామిక రంగాలు. ఈ క్లస్టర్‌లో గ్రానైట్‌ ఇండస్ర్టీలో మెషీన్ల నిర్వహణ- రిపేర్లు, పీఎల్‌సీ, ఎస్‌సీఏడీఏ ద్వారా ఆటోమేషన్‌, గ్రానైట్‌ క్వాలిటీ కంట్రోల్‌, ఆయిల్‌ ఇండస్ర్టీలో మెషినరీ నిర్వహణ, ఎలక్ర్టికల్‌ ఆటోమేషన్‌ కోర్సులున్నాయి.

  • క్లస్టర్‌-5లో కర్నూలు, అనంతపురం జిల్లాలున్నా యి. ఇక్కడ రెన్యూవబుల్‌, సోలార్‌, విండ్‌ పవర్‌, ఆటోమొబైల్‌ ప్రధాన రంగాలు. ఈ క్లస్టర్‌లో సోలార్‌ ఎనర్జీ బేసిక్స్‌ అండ్‌ సిస్టమ్‌ డిజైన్‌, రెన్యూవబుల్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌, అసెంబ్లీ ఇన్‌ ఆటోమేటివ్స్‌, ఆటోమేటివ్స్‌లో ఎలక్ర్టికల్‌ సిస్టమ్స్‌, ఆటోమేటివ్‌ డైనమిక్స్‌ అండ్‌ కంట్రోల్స్‌ కోర్సులున్నాయి.

  • క్లస్టర్‌-6లో కడప, చిత్తూరు జిల్లాలున్నాయి. ఇక్కడ సిమెంట్‌, ఎలక్ర్టానిక్స్‌ ప్రధాన రంగాలు, సిమెంట్‌ పరిశ్రమలో ఉపకరణాల నిర్వహణ, ఎలక్ర్టికల్‌ ఆటోమేషన్‌, మెటీరియల్‌ టెస్టింగ్‌ కోర్సులు, ఎలక్ర్టానిక్స్‌లో పీసీబీ డిజైన్‌ ఈక్యాడ్‌, ఇండస్ర్టియల్‌ ఆటోమేషన్‌, సేఫ్టీ ప్రొటోకాల్స్‌, పీఎల్‌సీ, ఎస్‌డీఏడీఏ కోర్సులున్నాయి.


ఈ ఏడాది నుంచి తప్పనిసరి

ప్రయోగాత్మకంగా 2024-25లో 70 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 3,468 మంది విద్యార్థులకు యాడ్‌ఆన్‌ కోర్సులు బోధించారు. వారికి ఇప్పుడు సర్టిఫికెట్లు జారీకి సాంకేతిక విద్యాశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. 2025-26 నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో దీనిని తప్పనిసరి చేశారు. రెండో సంవత్సరం చదివే సుమారు 13వేల మంది విద్యార్థులు తప్పనిసరిగా యాడ్‌ఆన్‌ కోర్సు సర్టిఫికెట్‌ పొందాలి. వారికి 30 గంటల పాటు ఇన్‌స్టిట్యూట్‌, ల్యాబ్స్‌లో శిక్షణ ఇస్తారు. మరో 10 గంటల పాటు సంబంధిత పరిశ్రమలకు విద్యార్థులను తీసుకెళ్లి అక్కడి యంత్రాలు, వాటి పనితీరుపై అవగాహన కల్పిస్తారు. దీనికి 4.5 లెవెల్‌తో సర్టిఫికెట్‌ జారీచేస్తారు. డిప్లొమా సర్టిఫికెట్‌,యాడ్‌ఆన్‌ కోర్సు సర్టిఫికెట్‌, కోర్సు అనంతరం చేసే ఇండస్ర్టియల్‌ శిక్షణతో విద్యార్థులకు తొందరగా ఉద్యోగం వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

డిప్లొమాతో ఉద్యోగాలే లక్ష్యం

గత కొన్నేళ్లుగా డిప్లొమా విద్య తీరు మారిపోయింది. ఒకప్పుడు త్వరగా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో డిప్లొమాలో చేరితో ఇప్పుడు ఎక్కువ మంది ఇంజనీరింగ్‌ కోసం డిప్లొమా చదువుతున్నారు. మూడేళ్ల డిప్లొమా అనంతరం ఈసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌లో సీట్లు పొందుతున్నారు. డిప్లొమాపై మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వస్తున్నవారు కూడా వాటిని వదులుకుని ఇంజనీరింగ్‌ బాట పడుతున్నారు. దీనివల్ల డిప్లొమా అనంతరం ఉద్యోగాలు చేసేవారి సంఖ్య తగ్గుతోంది. కొత్త విధానంతో డిప్లొమా సర్టిఫికెట్‌తోనే ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఏర్పడుతుంది. అలా విద్యార్థులను డిప్లొ మా స్థాయిలో ఉద్యోగాలు సాధించేలా చేయాలని సాంకేతిక విద్యాశాఖ లక్ష్యంగా నూతన విధానాలు అమలుచేస్తోంది.

Updated Date - Jun 06 , 2025 | 03:33 AM